Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆకలి సూచీలో అథమస్థానమే!

bichagadu

ఆకలి సమస్యను నివారించడంలో నత్తనడక నడుస్తున్న దేశాలలో భారత్ ఒకటి. ప్రపంచ ఆకలి సూచిక (జిహెచ్‌ఐ) తాజా అంచనా ప్రకారం ఈ సమస్య గత 9 ఏళ్లలో ఇతర దేశాలలో కంటె మన దేశంలోనే తక్కువగా ఉపశమించింది. ఆ సంస్థ 9 ఏళ్ల క్రిందటి అంచనాలలో ఈ విషయంలో దేశం ఇప్పటి కంటె కొంచెం మెరుగ్గా ఉంది. 2014నుంచి ఈ ఏడాది దాకా మూడేళ్ల కాలంలో ఈ సూచికలో భారత్ స్థానం 45 మెట్లు దిగిపోయిందన్న వాదంతో అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (ఐఎఫ్‌పిఆర్‌ఐ) ఏకీభవించ లేదు. అయితే జిహెచ్‌ఐ తాజా నివేదిక తెలిపినట్లుగా ప్రపంచ ఆకలి సూచికలో మొత్తం119 దేశాలకూ భారత్ స్థానం 100 అన్న వాస్తవంలో ఎటువంటి సందేహం లేదు. ఆకలి సూచికలో భారత్ దిగజారుడు గురించి కాంగ్రెస్, బిజెపి మధ్య రాజకీయ వివాదం రాజుకొంది. ఆకలి నిర్మూలన కృషిలో 19 దేశాలే భారత్ కంటె అధ్వాన్నస్థితిలో ఉన్నాయి. ఆసియాలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లే ఈ సూచికలో మన కంటే దిగువన ఉన్నాయి. అవి వరుసగా 106,107 స్థానాలలో ఉన్నాయి.
తక్కిన ఆకలి దేశాలన్నీ అధికంగా ఆఫ్రికాలో ఉన్నాయి. ఇథియోపియా, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, సూడాన్, యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్
రిపబ్లిక్‌లు ఆకలి నిర్మూలనలో పూర్తిగా వెనుకబడి అధమ స్థానంలో ఉన్నాయి. మన పొరుగు దేశాలు చైనా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఆ సమస్య నిర్మూలనలో మనకంటె మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. చైనా 29, నేపాల్ 72, శ్రీలంక 84, బంగ్లాదేశ్ 88 స్థ్థానాల్లో నిలిచాయి. బ్రెజిల్, మెక్సికో, ఇరాన్, వెనెజులా, ఇరాక్, నైజీరియా, ఉత్తర కొరియా కూడా మన కంటె పై మెట్ల మీదే ఈ విషయంలో నిలిచాయి.
పిల్లల పరిస్థితే ప్రధానం
అనేక మార్గాలలో ఆకలిని జిహెచ్‌ఐ అంచనా వేస్తుంది. నాలుగు సూచికల ఆధారంగా దేశాలకు ఇంత అని నికరంగా ఓ స్కోర్ ఇస్తుంది. పౌష్టికాహారలోపం స్థాయి, అయిదేళ్లలోపు బాలల్లో బాల్యం సక్రమంగా సాగకుండా తగినంత ఎదుగుదల లోపించడం, పిల్లల ఎదుగుదల స్తంభించి గిడసబారడం అనేవి బాలల మరణాల రేటు జిహెచ్‌ఐ పరిగణించే ప్రాతిపదికలు. ఆకలిని జిహెచ్‌ఐ ప్రపంచం, ప్రాంతం, దేశాల స్థాయిలలో అంచనా వేస్తుంది. దీని నాలుగు సూచికలలో మూడు పిల్లల కు సంబంధించినవే కావడం గమనార్హం. అయిదేళ్ల లోపు ఆకలి అంచనాలో పిల్లల ఆరోగ్యస్థితికి ప్రాధాన్యమిచ్చారు.
ఇంతకుముందు ఈ నివేదికలను 1992, 2000, 2008లో ఐఎఫ్‌పిఆర్‌ఐ ప్రకటించింది. ‘తగినన్ని కేలరీలు లోపించడంతో కలిగే నిస్సత్తువ’ గా ఆకలిని ఆ సంస్థ అభివర్ణించింది. ఆకలితో విపరీతంగా కునారిల్లుతున్న ప్రాంతాలుగా దక్షిణాసియా, ఆఫ్రికా, సహారా దక్షిణ భాగాన్ని
జిహెచ్‌ఐ తాజా నివేదిక పేర్కొంది. వాటి స్కోర్ 30.9, 29.4 మధ్య ఉంది. దక్షిణ ఆసియాలో మూడవవంతు జనాభా భారత్‌లో నివసిస్తోంది. అందుచేత పేదరిక నిర్మూలనలో భారత్ స్కోర్ దక్షిణ ఆసియా ప్రాంతం స్కోర్‌పై బాగా ప్రభావం చూపుతోంది. ఆ ప్రాంతీయ స్కోర్ భారతదేశంలో పరిస్థితులను బట్టి ఉంటోంది అని కూడా నివేదిక తెలిపింది. అయిదేళ్లలోపు పిల్లలలో వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం, పౌష్టికాహార లోపం సమస్యలు భారత్‌లో అధికంగా ఉన్నాయి. 20శాతం మంది పిల్లలకు ఈ లోపాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. గత 25 ఏళ్లుగా ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. 20శాతాన్ని మించి ఈ సమస్య ఉన్న దేశాలు మరి మూడు ఉన్నాయి. అవి డిజిబౌటీ, శ్రీలంక, దక్షిణ సూడాన్. పిల్లలలో ఎదుగుదల స్తంభించి గిడసబారడం కూడా భారత్‌లో ఎక్కువగా ఉంది. 1992లో 61.9శాతం నుంచి ప్రస్తుతం 38.4శాతానికి ఆ సమస్య తగ్గింది.
పథకాల ప్రచారం అంతంత మాత్రం
ఐదేళ్ల లోపు పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉండి, పౌష్టికాహార లోపానికి ఉదాహరణలుగా ఉంటారు. భారత సమగ్ర బాలల అభివృద్ధి సేవల (ఐసిడిఎస్) పథకం. జాతీయ ఆరోగ్య యంత్రాంగం (ఎన్‌హెచ్‌ఎం)పథకాలు అమలు వేగవంతంగా సాగుతున్నా వీటికి తగినంత ప్రచారం లోపించిందని నివేదిక పేర్కొంది. ఆకలితో పోరాటంలో భారత్ చేయవలసింది ఇంకా ఎంతో ఉందని సూచించింది. మన దేశంలో పేదరిక నిర్మూలన పథకాలు సరిగా అమలు జరగడం లేదు. పేదరిక నిర్మూలనతో ఆకలి నివారణ ముడిపడి ఉంది. పేద కుటుంబాల్లో పిల్లల సంరక్షణకు తగినంత ఆదాయం లోపించడం కారణమవుతుంది. ఈ దిశగా యుపిఎ హయాంలో ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాథి హామీ’ పథకం ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా పేదరిక నిర్మూలన పథకాల్లో పేరెన్నికగన్నదిగా అది నిలిచింది. అయితే 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఆ పథకం అమలు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆ పథకం కింద ఇవ్వాల్సిన వేతనాలను బిగపట్టి దానిని నీరుకార్పించాలని కేంద్రం చూసింది.
అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఉపాధి హామీ పథకం వేతనాలను తక్షణం విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా దానిపట్ల కేంద్రం ఉదాసీనత కొనసాగింది. ఆ పథకం కింద ఇచ్చే వేతనాలను పెంచాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో ఆ పథకం పాత్ర గణనీయమైనది. దానికి తోడు వ్యవసాయ సంక్షోభం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం పెరిగి ఆకలి ముదిరింది. దానివల్ల పేద కుటుంబాల్లో పిల్లలకు పౌష్టికాహారం మృగ్యమవుతోంది.
సాగు సంక్షోభాన్ని అరికట్టడానికి కూడా కేంద్రం చేయాల్సినంత చేయకుండా కాలక్షేపం కానిస్తోంది. రైతురుణాల మాఫీ పథకాలను కంటితుడుపుగా ప్రకటించి చేతులు దులుపుకుంటోంది.
ఉత్తరప్రదేశ్‌లో రైతు రుణమాఫీ ఒక ఫార్స్‌గా తయారయిందని ప్రచార సాధనాలు మొత్తుకున్నా కదలిక లేదు. అంతేకాకుండా మన దేశం లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ చిత్తశుద్ధి లోపించడం అనేక పథకాలను పడుకోపెట్టడంలో స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఉపాథి కల్పనకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు ఏమీ ప్రభుత్వం చేపట్టలేదు. ఇది కూడా పేదరికాన్ని పెంచుతున్న కీలకమైన అంశం. దేశంలో సంపన్నులు మరిం త సంపన్నులు అవుతుండగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత పూర్తిగా విస్మరించి పైపై నినాదాలతో ప్రభుత్వాలు కాలక్షేపం చేయడం సామాజికులు విమర్శిస్తున్నారు. దేశం ఆకలి నిర్మూలనలో వెనుకబడడానికి పేదరికం అంతంపై దృష్టి పెట్టకపోవడమే కారణమని వారు ఘోషిస్తున్నారు.
* ఎస్.ఎస్

Comments

comments