Home మెదక్ హైదరాబాద్ జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలని…

హైదరాబాద్ జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలని…

పట్టు పట్టరాదు పట్టివిడువరాదు…అన్నట్లుగా ఏదైనా సాధించాలన్న ఆలోచన చేశాక వెనకడుగువేయరు కొందరు.చేసే పనిని కష్టంగా కాకుండ కర్తవ్యంగా భావించేవారే విజయతీరాలు చేరుతారు.తీరా తీరంచేరి సేదతీరుతారా అంటే అదీ ఉండదు,నిత్యం కృషి చేస్తూనే ఉంటారు మరింకేం కృషితో నాస్తి దుర్భిక్షం.ఇటువంటి ఉన్నత భావాలున్న వ్యక్తులవల్ల సమాజం పురోగమిస్తుంది.ఈ ఉపమానాలు సరిగ్గా సరిపోతాయి రాహుల్ బొజ్జా I A S,జిల్లా కలెక్టర్,హైదరాబాద్ కు.సీనియర్ న్యాయవాదిగా,సామాజిక కార్యకర్తగా మనందరికి సుపరిచితమైన బొజ్జా తారకం బిడ్డగానే నేటికీ నన్ను గుర్తిస్తారనే రాహుల్ తన తండ్రికున్న సేవాభావం తనను ఈ రంగంలోకి వచ్చేలా చేసిందంటున్నారు.మద్రాస్ I I Tలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి,ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతో సివిల్స్ ను ఎంచుకున్నారు.హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా సామాన్యుడి జీవితాన్ని మార్చే విద్య,వైద్యం పై దృష్టి సారించారు.ఈ రంగాల్లో సమూలమార్పులు తీసుకురావాలనే ప్రయత్నంలో సొంతడబ్బు ఖర్చు చేస్తున్నారు.చదువుతోనే జీవితంలో మార్పు వస్తుందనే రాహుల్ బొజ్జా మనోగతం మనతెలంగాణ పాఠకులకు వారి మాటల్లోనే…

rahul-bojja2అమ్మతో ఎక్కువ సమయం- నాన్న బొజ్జా తారకం సీనియర్ అడ్వకేట్,సామాజిక కార్యకర్త,అమ్మ విజయ భారతి తెలుగు ఎకాడమి డైరెక్టర్‌గా చేసి రిటైర్ అయ్యారు.నా చదువంతా హైదరాబాద్‌లోనే గడిచింది,సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో పదవ తరగతి వరకు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాను.I I T మద్రాస్‌లో బి టెక్(మెకానికల్) పూర్తిచేశాను.బి టెక్ కాగానే ఐ ఐ ఎమ్ లో చేరి మేనేజ్‌మెంట్ కోర్స్ చేయాలని అనుకున్నాను కాని ఐ ఏ ఎస్ చదవాలని పెద్దనాన్న చెప్పారు. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన మాత్రం చేయలేదు.నాకు నాన్నతో కంటే అమ్మతో అనుబంధం ఎక్కువగా ఉండేది(చిన్నప్పుడు).
హైదరాబాద్‌లోనే కోచింగ్- పెద్దనాన్న సలహాతో సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను.అనుకున్నదే తడవు చాలామంది పెద్దలను కలిసి(టీచర్స్) వారి సలహాలు తీసుకున్నాను.అంతే అశోక్‌నగర్‌లోని రామచంద్రారెడ్డి ఐ ఏ ఎస్ స్టడీ సర్కిల్‌లో చేరాను.మొదట పోలీస్ సర్వీస్(ఢిల్లిలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా)లో చేరాను.తర్వాత ప్రయత్నంలో ఐ ఏ ఎస్ సాధించాను(2000 బ్యాచ్).నా మొదటి పోస్టింగ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా అనంతపూర్‌లో చేశాను.
తెలంగాణ మూవ్‌మెంట్ సమయం- జాయింట్ కలెక్టర్ గా గుంటూరులో.శాప్ ఎమ్ డిగా.ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా.ప్రాజెక్ట్ డైరెక్టర్ ఔటర్ రింగ్ రోడ్.మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ పి ఎస్‌గా.వరంగల్,మెదక్ జిల్లాలకు కలెక్టర్‌గా చేశాను.అన్నింటికన్నా నాకు సంతృప్తినిచ్చింది మరిచిపోలేనిది వరంగల్ జిల్లా కలెక్టర్‌గా రెండున్నర సంవత్సరాలు అక్కడ పనిచేశాను,అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది.దాంతో గవర్నెన్స్ కొంత మందిగించింది కాని సంక్షేమ చర్యలు ఆగిపోకూడదు.దానికై నాకు నేనుగా ఎప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకుని పేదలకు సంక్షేమం అందేలా చర్యలు తీసుకున్నాను.సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోపం లేకుండా పర్యవేక్షించాను.అక్కడ పనిచేసిన అనుభవం మరియు ప్రజల మద్ధతు మరిచిపోలేనివి.నేటికీ వరంగల్,గుంటూరు జిల్లాల వారు వచ్చి నన్ను కలుస్తుంటారు.మెదక్ ముఖ్యమంత్రి జిల్లా అక్కడ మంత్రి హరీష్ రావు స్పీడ్‌ను అందుకోవడం అంత తేలికైన పని కాదు.
నాన్న నన్ను కావాలనే దూరం ఉంచారేమో..?- చిన్నప్పుడు ఎక్కువగా అమ్మతో అనుబంధం ఉండేది.నాన్న ప్రొఫిషన్‌కు ఆకర్షితమవుతాననే నన్ను దూరం ఉంచారేమో అన్పిస్తుంది.ఇప్పుడు నాన్నతో అన్ని విషయాలు చర్చిస్తాను ఆ అనుబంధం తీయనిది. అమ్మ ఉన్నత విద్యావంతు రాలు(బోయి భీమన్న కూతురు).నాన్న తండ్రి కూడా పెద్ద నాయకుడు.మా ఇల్లెప్పుడు వచ్చివెళ్ళే వాళ్ళతో నిండి ఉండేది.చిన్నప్పటినుండి ప్రజల సాధక బాధకాలు వినడంతో వారి కష్టాలు అవగతమే నాకు.ఆ వాతావరణం కూడా నాకు చాలా నేర్పింది.తోటివారకి సాయమందిం చాలనే విలువలు మాత్రం ఇంటినుండే నేర్చుకున్నాను.
సివిల్స్ అంటే మాస్టర్ ఆఫ్ సబ్జెక్ట్- మన దగ్గర సివిల్స్ వైపు వచ్చేవారు చాలా తక్కువ.ఆల్టర్‌నేట్ కెరీర్ ఉండదనే భయం ఎక్కువగా ఉంటుంది కాని అది తప్పు.సివిల్స్ కాకుంటే గ్రూప్స్ రాసుకోవచ్చు.ఈ రకమైన కెరీర్ ఆప్షన్ చాలా బావుంటుందన్నది నా సలహా.గవర్నమెంట్ ఉద్యోగం అంటే సర్వీస్ మాత్రమే కాదు చాలా గౌరవప్రదమైన కెరీర్‌కూడా.సివిల్స్ అసాధ్యం కూడా కాదు ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే అది బేసిక్‌గా పనికి వస్తుంది.పూర్తి టెక్నికల్‌గా ఉంటుందనేది అపోహ మాత్రమే.కామన్ సెన్స్ ఉపయోగించడం ముఖ్యం.జనరల్ స్టడీస్ అంటే మన చుట్టూ(వరల్డ్,దేశం) జరుగుతున్న విషయాలను కనీసం నాలుగు సంవత్సరాలవి గుర్తుంచు కోగలగాలి. మీరెంచుకున్న సబ్జెక్ట్‌లో మాస్టర్‌గా ఉండాలి.పాఠ్య పుస్తకాలు చదవడం అనేది ముఖ్యం.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా- హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన విషయాలే ఉంటాయి.విద్య,ఆరోగ్య పరంగా చాలా వెనుకబడి ఉంది.ఇక్కడ నివసించే మిడిల్ క్లాస్,లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాల్లో విద్యపై సరైన అవగాహన లేదు.గత కొన్ని సంవత్సరాల పదవ తరగతి ఫలితాలు చూస్తే హైదరాబాద్ జిల్లా 23 వ స్థానంలో ఉంటుంది.ఇతర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు,తల్లిదండ్రులు చదువుపై శ్రద్ధ పెడుతున్నారు,వారికి తెలుసు విద్య వల్ల వారి జీవితాలు మారిపోతాయని.ఇక్కడ పరిస్థితిలో మార్పు ఇంకా రాలేదు.చిన్నప్పటి నుండే పిల్లలను సంపాదన వైపు పంపిస్తున్నారు.టైర్ల పంక్చర్లు తీయడం,కిరాణ షాప్ పెట్టుకోవడం ఏం లేదంటే పాన్ డబ్బా అయినా నడిపించడం ఇక్కడ అలవాటుగా మారింది.ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను.దీనికై ఇక్కడ స్వచ్ఛంద సంస్థలతో సంప్రదించాను,వారిలో అవగాహన కల్పించేవిధంగా వారిని ప్రోత్సహిస్తు న్నాను. అవసరమనుకున్న చోట నా సొంత డబ్బు ఖర్చుచేస్తున్నాను.వచ్చే విద్యా సంవత్సరంలో పది ఫలితాల్లో మార్పు తీసుకురావాలన్న తలంపుతో ఉన్నాను.
దవాఖానాల్లో- దవాఖానాల్లో సరైన వసతులు లేక సామాన్య జనం ఇబ్బందులకు గురౌతున్నారు.సిబ్బందిలో బాధ్యత పెరిగే విధంగా మొదట కింగ్ కోఠి గవర్నమెంట్ దవఖానాలో ఔట్ పేషెంట్ విభాగాన్ని పూర్తిగా ఆన్‌లైన్ చేశాను.మరిన్ని మార్పులు చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నాను.
యువతకు- ఈ రోజు భారతదేశం మేధో పరంగా చాలా బలమైన దేశం.మున్ముందు కూడా మనదేశం చదువుకున్న యువతకు కేంద్రం కావాలి.ప్రతి కుటుంబం చదువుకోవాలి. జీవితాలు మారాలంటే చదువు తప్ప గత్యంతరం లేదు.యువతలో వ్యతిరేఖ భావనలు అధికంగా ఉంటాయిక్కడ,ఆ పద్ధతి మారాలి.క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి.చదువుకునే సమయంలో చదువు మాత్రమే ఉండాలి.ఒక్కసారి ట్రాక్‌లోకి వచ్చాక మీకిష్టమైన వ్యాపకం పెట్టుకోవచ్చు అది వృత్తి జీవితంలో అవసరం కూడా.