Search
Monday 24 September 2018
  • :
  • :

జెట్ ఎయిర్‌వేస్‌తో ట్రూజెట్ చర్చలు

Hyderabad flight company Trujet talks with Jet Airways

ఏడు విమానాల సబ్‌లీజుకు ఆసక్తి

ముంబయి: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్‌తో హైదరాబాద్‌కు చెందిన విమాన సంస్థ ట్రూజెట్ చర్చలు జరుపుతోంది. జెట్‌కు చెందిన ఏడు ఎటిఆర్ విమానాలను సబ్‌లీజు కింద తీసుకోవాలని ట్రూజెట్ భావిస్తోంది. వీటితో వృద్ధి కనిపిస్తే ట్రూజెట్ జెట్ మరిన్ని విమానాలను సబ్ లీజుకి తీసుకోవాలనుకుంటోంది. టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ భారీస్థాయిలో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చి 2019 నాటికి 7 కొత్త విమానాలతో 20 ప్రాంతాలకు ట్రూజెట్ బ్రాండ్ విమానాలను నడపాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ నెలలోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా ఖర్చులు తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని జెట్ ఎయిర్‌వేస్ భావిస్తోంది.

27న క్యూ1 ఫలితాలు : జూన్ ముగింపు నాటి ఫలితాలపై ఆమోదం తెలిపేందుకు జెట్ ఎయిర్‌వేస్ ఈ నెల 27న సమావేశం కానుంది. దేశీయ అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ ఆగస్టు 9న వాయిదా త్రైమాసిక ఫలితాలను ప్రకటించాలనుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఫలితాలను వాయిదా వేయడంతో కంపెనీ షేరు విలువ మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా సంస్థ యాజమాన్యం సిబ్బందిని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్ ఫైనాన్షియల్ ఆడిట్‌ను విమాన రెగ్యులేటరీ సంస్థ డిజిసిఎ చేపట్టనుందని వార్తలు వెలువడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో జెట్ ఎయిర్‌వేస్ షేరు విలువ 2.81 శాతం పెరిగి రూ.309 వద్ద స్థిరపడింది.

2 వేల కోట్లు సమీకరణ యోచన : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జెట్ ఎయిర్‌వేస్ నిధుల సమీకరించే ప్రయత్నంలో ఉంది. వ్యాపార నిర్వహణ నిమిత్తం దాదాపు రూ.2000 కోట్లు సమీకరించేందుకు ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ)తో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధమైంది. కాగా ఇంధన రేట్లు పెరగడం, పోటీ కారణంగా కంపెనీ లాభాలు గణనీయంగా పడిపోయాయి. నరేశ్ గోయల్ నేతృత్వంలోని జెట్ ఎయిర్‌వేస్‌లో గల్ఫ్ విమానయాన సంస్థ ఎథిహాద్‌కు 24 శాతం వాటా ఉంది. జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక ఇబ్బందులో చిక్కుకోవడంతో ఆ సంస్థ షేరు ధర బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను వెల్లడించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులు ఇండిగో సంస్థకు సానుకూలంగా మారాయని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.

Comments

comments