Home IPL 2019 అంచనాలకు మించి..

అంచనాలకు మించి..

 Hyderabad players bowled in bowling

మన తెలంగాణ/క్రీడా విభాగం : కొంత కాలంగా అభిమానులను కనువిందు చేసిన ఐపిఎల్ క్రీడా సంగ్రామానికి ఆదివారం తెరపడింది. ఏప్రిల్  ఏడు నుంచి మే 27 వరకు జరిగిన మెగా క్రికెట్ పండగలో ఎన్నో రికార్డుల బద్దలయ్యాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. భారీ ఆశలతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, హేమాహేమీలతో కూడిన కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లు కనీసం ప్లేఆఫ్ దశకు కూడా చేరుకోలేక పోయాయి. అయితే ఏమాత్రం ఆశలు లేకుండా రంగంలోకి దిగిన హైదరాబాద్ జట్టు లీగ్ దశలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అసాధారణ రీతిలో రాణించింది. సీజన్ ప్రారంభానికి ముందే జట్టుకు పెద్ద షాక్ తగిలింది. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో హైదరాబాద్ ఐపిఎల్‌లో కనీసం ప్లేఆఫ్‌కు కూడా చేరడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేగాక కెప్టెన్సీ కూడా అనూహ్యంగా కేన్ విలియమ్సన్‌కు కట్ట బెట్టారు. శిఖర్ ధావన్‌కు పగ్గాలు అప్పగిస్తారని అందరు భావించారు. అయితే యాజమాన్యం మాత్రం విలియమ్సన్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది.

ముందుండి నడిపించాడు..

అయితే విలియమ్సన్ తనపై యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి మ్యాచ్ నుంచే జట్టుపై తనదైన ముద్ర వేశాడు. సహచర ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ సమష్టిగా జట్టును ముందుకు తీసుకెళ్లాడు. వార్నర్‌కు దీటుగా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నూరి పోశాడు. సీనియర్లు, జూనియర్ల సేవలను సందర్భోచితంగా ఉపయోగించుకుంటూ లక్షం వైపు నడిపించాడు. క్లిష్ట సమయాల్లో బ్యాట్‌తోనూ జట్టుకు అండగా నిలిచాడు. తొలి మూడు మ్యాచు ల్లో జట్టును గెలిపించి తానెంటో ప్రత్యర్థులకు రుచి చూపించాడు. అందుబాటులోని అస్త్రాలను ఉపయోగించుకుంటూ జట్టును విజయపథంలో నడిపించడంలో విలియమ్సన్ సఫలమయ్యాడు. అతని సారథ్యంలో హైదరాబాద్ ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొ య్యగా మారింది. లీగ్ దశలో చెన్నై, కోల్‌కతా, బెం గళూరు, పంజాబ్ జట్లు మాత్రమే హైదరాబాద్‌ను ఓ డించాయి. 14 మ్యాచుల్లో హైదరాబాద్ ఏకంగా 9 పోటీల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక, బ్యాటింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్ ఆరేంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఐపిఎల్ పదకొండో సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా విలియమ్సన్ నిలిచాడు. అసాధారణ రీతిలో చెలరేగి విలియమ్సన్ 735 పరుగులు సాధించి ఆరేంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ధావన్ 496 పరుగులతో పదో స్థానంలో నిలిచాడు.
సత్తా చాటిన బౌలర్లు..
బ్యాటింగ్‌లో అంతంత మాత్రంగానే రాణించిన హైదరాబాద్ ఆటగాళ్లు బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టారు. భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, బాసిల్ థంపి, సాకిబ్ అల్ హసన్, బ్రాత్‌వైట్ తదితరులు అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్, కౌల్, సందీప్‌లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయాల్లో కెట్లు తీస్తూ ప్రత్య ర్థి జట్ల బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బ తీశారు. రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్‌లు చెరో 21 వికెట్లు పడగొట్టి రెం డో, మూడో స్థానంలో నిలిచారు. జట్టు ఫైనల్ చేరడంలో వీరిద్దరి పాత్ర చా లా కీలకం. కీలక సమయా ల్లో వికెట్లు తీస్తూ జట్టును ఒంటిచేత్తో గెలిపించిన ఘనత వీరికి ఉంది. సందీప్ కూడా మెరుగ్గా రాణించాడు. గత సీజన్‌లో ప్రకంపనలు సృష్టించిన భువనేశ్వర్ ఈసారి కాస్త నిరాశ పరిచాడు. అయితే కీలక సమయాల్లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ జట్టుకు అండగా నిలిచాడు.

అదరగొట్టిన రషీద్..

మరోవైపు అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ ఈ సీజన్‌లో జట్టుపై తనదైన ముద్ర వేశాడు. కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఆట ఆకాశమే హద్దుగా సాగి పోయింది. తొలుత బ్యాట్‌తో చెలరేగి పోయాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రషీద్ పది బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో రెండు బౌండరీలతో ఏకంగా 34 పరుగులు సాధించాడు. ఈ సందర్భంలో రషీద్ స్ట్రయిక్‌రేట్ 350కి చేరింది. దీన్ని బట్టి అతను ఎంతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడో ఊహించుకోవచ్చు. ఇక, బంతితోనూ రషీద్ సత్తా చాటాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేగాక రెండు కళ్లు చెదిరే క్యాచ్‌లను కూడా పట్టాడు. దీంతో పాటు ఓ రనౌట్‌లో కూడా కీలక పాత్ర పోషించాడు. కళ్లు చెదిరే ప్రదర్శన చేసిన రషీద్ ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ సీజన్‌లో రషీద్ 21 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు. పలు మ్యాచుల్లో బంతితో చెలరేగి పోయాడు. అతని అసాధారణ బౌలింగ్ వల్లే హైదరాబాద్ ఫైనల్‌కు చేరిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, సాకిబ్, అలెక్స్ హేల్స్, దీపక్ హుడా తదితరులు అడపాదడపాగా రాణించి తమవంతు పాత్ర పోషించారు. మొత్తం మీద చెప్పాలంటే హైదరాబాద్ ఫైనల్‌కు చేరిందంటే అందులో కీలక పాత్ర కౌల్, విలియమ్సన్, రషీద్, ధావన్‌లదనే అని చెప్పక తప్పదు. మిగతావారు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు.