Home జాతీయ వార్తలు సిద్ధూ తలకు వెలకట్టిన హిందూ యువ వాహిని

సిద్ధూ తలకు వెలకట్టిన హిందూ యువ వాహిని

 

ఆగ్రా: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ‘అవమానించిన’ పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ తలకు మతవాద సంస్థ హిందూ యువ వాహిని(హెచ్‌వైవి) వెల కట్టింది. సిద్ధూ తలను తెగ్గొట్టి తెచ్చిన వారికి కోటి రూపాయల బహుమానం అందచేస్తామని 15 సంవత్సరాల క్రితం యోగి ఆదిత్య నాథ్ స్థాపించిన హెచ్‌వైవి ప్రకటించింది. సిద్ధూకు ధైర్యముంటే ఆగ్రాకు రావాలంటూ హెచ్‌వైవి ఆగ్రా విభాగం అధ్యక్షుడు తరన్ సింగ్ సవాలు చేశారు. ఆగ్రాలోకి అడుగుపెట్టిన మరుక్షణం సిద్ధూను ముక్కలుగా నరికివేస్తామంటూ ఆయన హెచ్చరించారు.

రాజస్థాన్‌లో ఎన్నికల సభ సందర్భంగా యోగిని అవమానించినందుకు నిరసనగా విశ్వ హిందూ మహాసంఘ్‌తో కలిసి హెచ్‌వైవి కార్యకర్తలు బుధవారం ధర్నా చేశారు. రాజస్థాన్‌లోని రాంగంజ్ మండిలో ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ యోగిని ‘భోగి’గా సిద్ధూ అభివర్ణించారు. చౌకీదార్(కాపలాదారుడు) మాత్రమే కాదు..ఆయన కుక్క కూడా ఒక దొంగ..యోగి ఒక పెద్ద భోగి, అంటూ సిద్ధూ విమర్శించారు. యోగిని అవమానించడమేగాక పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తి సిద్ధూ దేశాన్ని కూడా అవమానించారని హెచ్‌వైవి ఆరోపించింది. పాకిస్తాన్ ఎన్నికలలో పోటీ చేస్తే సిద్ధూ సునాయాసంగా గెలుస్తారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సాధ్యమైనంత త్వరగా సిద్ధూని పాకిస్తాన్‌కు పంపించెయ్యాలని తరన్ సింగ్ చెప్పారు. సిద్ధూ పాకిస్తాన్‌కు అయినా వెళ్లాలి లేదా అతడిని తాము మాత్రం భారతదేశంలో బతకనివ్వమని తరన్ సింగ్ హెచ్చరించారు.

HYV offers Rs 1 cr for Siddhu’s severed head