Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అమ్మ కోసం డాక్టర్ నయ్యా..

Bura-narsaiah-goud-family-i

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్

ఆయన ఏ పనిచేసినా ఏకాగ్రతతో చేస్తారు. అనుకున్నది నెరవేర్చుకోవడానికి శాయశక్తులా పని చేస్తారు. ఎప్పటికైనా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని నమ్ముతారు. ఆ నమ్మకమే ఈరోజు తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు..డాక్టర్‌గా ప్రజలకు వైద్యం అందించడానికి ఎంత శ్రమపడుతున్నారో, రాజకీయాల్లోనూ అదే ఒరవడిని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. అమ్మ కోసం డాక్టరై దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను చేసిన పనులే తనను కచ్చితంగా గెలిపిస్తాయని చెబుతున్న భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో
మన తెలంగాణ సకుటుంబం మాటామంతీ…  

డాక్టర్ చదవాలన్న కోరిక ఎందుకు వచ్చింది?
మా ఇంట్లో పెద్దగా చదువులు చదివిన వారు ఎవరూ లేరు. నాకు 6వ తరగతిలో ఆ కోరిక కలిగింది. మా అమ్మకు కూడా నేను డాక్టర్ కావాలని ఉండేది. నాన్నతో గొడవపడి నన్ను చదివించింది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహమే ఈ రోజు డాక్టర్‌గా గుర్తింపునిచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ ఇష్టం. డాక్టర్ కావడమే కాదు, ముఖ్యంగా అందులో సర్జన్ కావాలన్న కోరిక బలంగా ఉండేది. దానిని కూడా సాధించుకున్నాను. 9 సంవత్సరాల పాటు డాక్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేశాను. మొదటగా ఆమన్‌గల్ (పాత మహబూబ్‌నగర్ జిల్లా) పీహెచ్‌సీలో వైద్యుడిగా పని చేశాను. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేశాను. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం మానేసి ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను.

మీ ఫ్యామిలీ గురించి…
మాది సూర్యాపేట. మధ్యతరగతి కుటుంబం. అమ్మ రాజమ్మ, నాన్న బూర లక్ష్మయ్య. మేము ఇద్దరం అన్నదమ్ములం. నలుగురు అక్కలు.
నేను అందరికన్నా చిన్నవాడిని. నాన్న వ్యవసాయం చేసేవారు. పొద్దునే లేచి నాన్నతో పాటు ఉదయం 6 గంటలకు పొలానికి వెళ్లి గంట, రెండు గంటల పాటు వ్యవసాయ పనుల్లో సాయం చేసేవాడిని. మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. నా భార్య అనిత, మాకు ఒక కూతురు పేరు రోహిత.

మీ జీవితంలో మీకు స్ఫూర్తినిచ్చిన వారు..
నాన్న సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. రజాకార్లతో పోరాడారు. తాత నిజాం పాలనలో జైలు జీవితం గడిపారు. వీరే నాకు జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదలను కలిగించారు. వీరితో పాటు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటం నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. ఆయనతో కలిసి పనిచేసేలా చేసింది. వీరంతా నాకు స్ఫూర్తినిచ్చినవారే.

ఎన్టీఆర్‌తో గొడవలెందుకు జరిగాయి?
జూనియర్ డాక్టర్ల సంఘం యూనియన్ లీడర్‌గా ఉన్నప్పుడు స్టయిఫండ్ కోసం ఉద్యమం చేశాం. ప్రభుత్వం తరఫున ఇచ్చే రూ.400 సరిపోవడం లేదని విధులు బహిష్కరించాం. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. స్టయిఫండ్‌ను పెంచింది. చదువు విషయంలో కూడా లోపాలు జరిగినప్పుడు ప్రొఫెసర్లను కూడా నిలదీసేవాళ్లం. కొన్ని సార్లు ప్రొఫెసర్లు నన్ను ఫెయిల్ చేస్తానని బెదిరించారు. అయినా వెనుకడగు లేదు. విద్యార్థుల సమస్యల మీదే పోరాడేవాళ్లం.

రాజకీయాల్లో మీకు అనుకోకుండా సీటు వచ్చిందా..?
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశాను. అప్పటికే డాక్టర్ వృత్తిలో ఉన్నాను. డాక్టర్లతో కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యమంలో మా వంతు కృషి చేశాం. ఆ సమయంలోనే కేసీఆర్‌తో ఎక్కువగా చనువు ఏర్పడింది. తెలంగాణ ఏర్పడినప్పుడు ఆయన ఆదేశాల మేరకు భువనగిరి ఎంపీగా పోటీ చేయాల్సివచ్చింది. ఎంపీ సీటు ఇస్తారని నేను అనుకోలేదు. ఆయన నాకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయాలని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలని నా వంతు కృషి చేస్తున్నాను.

ఉద్యమంలో మీ పాత్ర ..
తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి నా వంతు పాత్ర పోషించాను. సర్జన్‌గా పనిచేస్తున్నప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల వారు ఎక్కువగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉండేవారు. అప్పటి నుంచి నాలో మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకునే వాడిని. 2009లో కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. అప్పుడే నేను ఉద్యమంలోకి రావాలనుకున్నాను. 200 మంది డాక్టర్లతో సమావేశమై దీనిపై చర్చించి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి జరిగిన ప్రతి తెలంగాణ ఉద్యమంలో మా సంఘం తరఫున ఉద్యమంలో పాలుపంచుకున్నాను. ఉస్మానియా మెడికల్ కాలేజీ వైద్యగర్జన పేరిట సభను నిర్వహించాం. రాస్తారోకో, అసెంబ్లీ ముట్టడి, మిలీనియం మార్చ్‌లో పాల్గొన్నాను.

డాక్టర్‌గా, ఎంపీగా బాధ్యతలను ఎలా నెరవేస్తున్నారు ?
హైదరాబాద్‌లో ఉన్నప్పుడు రోజుకు రెండుగంటల పాటు డాక్టర్‌గా రోగులకు సేవలందిస్తున్నాను. మిగతా సమయం నియోజకవర్గం ప్రజల కోసం కృషిచేస్తున్నాను.

ఎంపీగా ఏమి సాధించారు ?
ఎంపీగా ప్రజలు నన్ను గెలిపించారు. డాక్టర్‌గా విజయం సాధించాను. ప్రజల కోసం కష్ట, సుఖాల్లో భాగస్వాముడిని కావడానికి ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అందులో భాగంగానే ఎయిమ్స్ లాంటి సంస్థతో అనేక సంస్థలు నా నియోజకవర్గానికి వచ్చేలా కృషి చేస్తున్నాను. నేషనల్ హైవేల కోసం బడ్జెట్‌ను మంజూరు చేయించాం. ఎక్స్‌ప్రెస్‌వే కోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చాం. దీంతోపాటు డ్రై పోర్టుకు కూడా కేంద్రం ఓకే చెప్పింది. మరికొన్ని సంస్థలు, నిధుల మంజూరు కేంద్రం సమ్మతం తెలియచేసింది.

కుల వృత్తి దారుల కోసం ఎలాంటి పథకాలు తీసుకొస్తున్నారు ?
కుల వృత్తుదారులకు మనం చేయూతనిస్తే సగం మంది నిరుద్యోగులకు మనం ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అందులో భాగంగానే మొదటగా కుల వృత్తిదారులను అభివృద్ధి చేయాలన్న సీఎం పిలుపుమేరకు అనేక పథకాలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంపీలందరం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే గీత వృత్తిదారుల కోసం నీర అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. దీనికి కేంద్రం కూడా అనుమతిచ్చింది. గొర్రెల పెంపకందారుల కోసం మరో ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం.

ఎంపీగా మీ గ్రాఫ్ ఎలా ఉంది ?
ప్రస్తుతానికి నేను చేసిన పనులే నాకు విజయం చేకూరుస్తాయని భావిస్తున్నాను. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. నా నియోజకవర్గంలో ఉన్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని మరో తిరుపతిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. దీనికి సీఎం కూడా ఎన్నో నిధులను కేటాయించారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగింపునకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనివల్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

                                                                                                         – ఎల్. వెంకటేశం, మన తెలంగాణ ప్రతినిధి

Comments

comments