Home రాష్ట్ర వార్తలు మా దారి సుదీర్ఘం

మా దారి సుదీర్ఘం

224

మాది నిర్మాణాత్మక రాజకీయం
రెండు రాష్ట్రాల్లోనూ బలమున్న చోట పోటీ చేస్తాం
సమస్యలు అర్థం చేసుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం
అధికార పక్షాలు నన్ను వాడుకోవడం లేదు
బిజెపి ఆహ్వానాన్ని తిరస్కరించాను
కొండగట్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన

కరీంనగర్: రానున్న శాసనసభ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు బలమున్నచోట్ల పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. సోమవారం ఉద యం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకొని సుదీర్ఘ రాజకీయ యా త్రకు శ్రీకారం చుట్టిన పవన్ సాయంత్రం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. సినీరంగంపై ఇక ప్రత్యేక దృష్టి సారించబోనని తేల్చి చెప్పారు. పార్టీ నిర్మాణానికే తన సమయాన్ని వెచ్చిస్తానన్నారు. ఒక రాజకీయ పార్టీ బలమైన సంస్థగా ఎదగాలంటే ఒకరోజుతో సాధ్యం కాదని, అది క్రమేణా జరగాల్సి ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తన పై అభిమానం ఉందని, అభిమానులు ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమి తి వంటి పార్టీల నిర్మాణానికి దశాబ్దాలు పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్ళడం ఆ ప్రభుత్వాలకు సవాల్‌లాంటిదన్నా రు. ఇటీవల తాను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిసిన అనంతరం వస్తున్న వార్తలపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకోవడంలో తప్పేమి ఉంటుందని ప్రశ్నించారు. కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారని, ఆ కారణంగానే ప్రజలు ఆయనకు పట్టంకట్టారని తెలిపారు. ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే అన్నారు. జనసేన ఆవేశపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటుందన్నారు. తాము నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తామని, ఏది చేసినా అది ప్రజలకు ఉపయోగపడేలా చూస్తామన్నారు. రెండు రాష్ట్రాలలో అధికార పార్టీలు తనను వాడుకోవడం లేదని, తాను ఎవరి ప్రలోభాలకు లొంగేది లేదన్నారు. అనేక దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిందని, అందుకే ఈ రాష్ట్రంపై తాను ఇష్టాన్ని, మమకారాన్ని పెంచుకున్నానని చెప్పారు. జనసేన తెలంగాణలో ఆచితూచి, బాధ్యతగా ముందుకు సాగుతుందన్నారు. మొదట రాష్ట్రంలోని ప్రజా సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తమన్నారు. 2019 ఎన్నికల్లో ఇన్ని ఓట్లు, సీట్లు కావాలని తాము ఆలోచించడం లేదన్నారు. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కోసం పార్టీని ప్రారంభించామన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మీకెందుకీ రాజకీయ గొడవలంటూ తనను బిజెపిలోకి రమ్మని ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళ, బుధవారాల్లో జనసేన వేదికల ద్వారా కార్యకర్తలతో సమావేశమవుతున్నానని చెప్పారు. వారి నుండి సలహాలు, సూచనలు తీసుకుంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమస్యలపై తన పర్యటనలు ఉంటాయన్నారు. జనసేనకు మద్దతు ఇవ్వాలని తన సోదరుడు చిరంజీవిని అడగలేదని, ఇకపై అడగబోనని చెప్పారు. పార్టీని నడపడంపై స్పష్టత ఉందని, ఆ దిశగా పని చేసుకుంటూ పోతూ ఉంటానన్నారు. రాజకీయాలు అంటే పరిష్కారం, పునశ్చరణ అనేవిగా ఉండాలన్నది తన భావన అన్నారు. అంకిత భావం కలిగిన రాజకీయ కార్యాచరణ ఉంటే ఉపాధి కల్పనతో పాటు ఇతర అభివృద్ధి అంశాలను సాధించడం సుసాధ్యమే అన్నారు. తెలుగు రాష్ట్రాలలో వనరులు ఉన్నాయని, జనాభా నిష్పత్తి పెరిగిందని ఈ క్రమంలో సత్వర అభివృద్ధి ఏ ప్రభుత్వానికైనా సవాల్‌తో కూడుకున్నదేనని చెప్పారు. 2009 ఎన్నికల ప్రచార సందర్భంగా జిల్లాలలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి తాను ప్రమాదానికి గురి అయినప్పుడు కొండగట్టు అంజనేయ స్వామి కృప వల్లనే బ్రతికి బయటపడ్డానన్నారు. అందుకే ఆయన ఆశీర్వాదం తీసుకొని తన సంపూర్ణ రాజకీయాన్ని ఇక్కడి నుండే ప్రారంభిస్తున్నానని తెలిపారు.