Home తాజా వార్తలు ఐసిసి వినూత్న నిర్ణయం

ఐసిసి వినూత్న నిర్ణయం

లండన్: ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ను అవినీతి రహితంగా నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని అటాచ్ చేయనుంది. టోర్నీలో పోటీపడుతున్న పది జట్లకు పది మంది అధికారులను ఐసీసీ నియోగించనుందని తెలుస్తోంది. ‘జట్టు సభ్యులు, అధికారులు టోర్నీ ముగిసే లోపు ఎంతో మందిని కలిసేవారు. అందుకే గతంలో ప్రతి మైదానంలో ఓ అవినీతి నిరోధక అధికారిని మోహరించేవారు. ఇప్పుడు అదే అధికారిని జట్టుకు అటాచ్ చేశారు. సాధన శిబిరాలు, సన్నాహక మ్యాచ్‌లు, అసలైన మ్యాచులు ఆడేటప్పుడు వీరు ఆటగాళ్లను గమనిస్తారు. వారితో కలిసే హోటళ్లో ఉంటారు. వారితో కలిసే ప్రయాణాలు చేస్తారు’ అని ఓ ఐసీసీ అధికారి తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి రహితంగా టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ఈ చర్య తీసుకుంది. జట్టు సభ్యులు, ఐసీసీ అవినీతి నిరోధక శాఖ మధ్య అధికారులు వారధిగా ఉంటారు. ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్నవారిపై, అనుమాస్పదంగా కదులుతున్న వారిపై వీరు కన్నేస్తారు. ఏదైనా జరిగే అవకాశం ఉందా అని పరిశీలిస్తారు. కాగా, ఐసిసి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. కొన్ని దేశాలు బోర్డులు దీన్ని స్వాగతించగా, మరి కొన్ని దేశాలు దీన్ని తప్పుపట్టాయి.

ICC new idea for ODI World Cup 2019