Search
Wednesday 26 September 2018
  • :
  • :

చర్యలకు సిద్ధమవుతున్న సెబీ

sebi

వీడియోకాన్ వివాదంపై ప్రాథమిక విచారణ  ఐసిఐసిఐ బ్యాంక్, కొచ్చర్‌లపై జరిమానా విధించే అవకాశం

న్యూఢిల్లీ: వీడియోకాన్ వివాదంలో ఐసిఐసిఐ బ్యాంక్‌పై ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఐసిఐసిఐ బ్యాంక్ వివాదంపై ప్రాథమిక విచారణ చేపట్టిన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. వీడియోకాన్ గ్రూప్‌తో ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ కొచ్చర్ భర్త వ్యాపారానికి సంబంధించి లిస్టింగ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఐసిఐసిఐ బ్యాంక్, కొచ్చర్‌పై చర్యలు తీసుకోవాలని సెబీ భావిస్తోందని సమాచారం. నిబంధనలను పాటించనందు వల్ల ఐసిఐసిఐ బ్యాంక్‌పై రూ.25 కోట్ల జరిమానా, చందాకొచ్చర్‌కు రూ. కోటి జరిమానా విధించే అవకాశం ఉంది. సదరు బ్యాంక్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం వచ్చిన వెంటనే ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే వీడియోకాన్ వివాదంలో సెబీతో పాటు బ్యాంక్ బోర్డు కూడా స్వతంత్ర దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకూ కొచ్చర్‌ను సెలవుపై పంపించారు.
ఇటీవల ఐసిఐసిఐ బ్యాంక్ సిఒఒ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్), పూర్తి కాలం బ్యాంక్ డైరెక్టర్‌గా సందీప్ బక్షిని బ్యాంక్ నియమించింది. గత పదేళ్లుగా బ్యాంకు సిఇఒగా కొనసాగుతున్న చందాకొచ్చర్ పదవీకాలం 2019 మార్చిలో ముగియనుంది. 2012లో వీడియోకాన్ సంస్థకు ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రుణం మంజూరు వ్యవహారంలో సిఇఒ చందాకొచ్చర్ సాయం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వివాదం మీడియాకెక్కింది. వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్, చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు బంధవులు కలిసి 2008లో నూపవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. వీడియోకాన్ రుణం నిబంధనలకు విరుద్ధంగా క్విడ్ ప్రోకో(నీకిది నాకది) ప్రాతిపదికన ఇచ్చారని, దీంతో కొచ్చర్ కుటుంబీకులు ప్రయోజనం పొందారని ఆరోపణలు వచ్చాయి. చందాకొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఈనెల 11న సెబీ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్ గ్రూప్, నూపవర్‌తో బ్యాంక్ ఒప్పందాలపై వివరాలను సెబి కోరింది. సెబి నోటీసులు జారీ చేసిన కొద్ది రోజుల తర్వాత బ్యాంక్ తాజాగా స్వతంత్ర దర్యాప్తు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో స్వత్రంత కమిటీ ఏర్పాటు చేశారు.
నిరర్థక ఆస్తులుగా ప్రకటించకుండా జాప్యం
నిబంధనల ప్రకారం కొన్ని మొండి బకాయి ఖాతాలను సమయానికి నిరర్థక ఆస్తులుగా ప్రకటించాలి. అయితే నిబంధనలను పాటించకుండా ఐసిఐసిఐ బ్యాంక్ జాప్యం చేసిందని తాజాగా ఆరోపణలు వచ్చాయి. మొండి బకాయిల విషయంలో బ్యాంక్ ఎనిమిదేళ్ల జాప్యం చేసి, దీని ద్వారా 1.3 బిలియన్ డాలర్ల లాభాన్ని అధికంగా చూపించిందని విజిల్‌బ్లోయర్ పేర్కొంది. సరైన సమయంలో ఈ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా చూపిస్తే వీటిని కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో లాభాలు తగ్గుతాయని భావించిన బ్యాంక్ ఉద్దేశపూర్వకంగా వీటిని నిర్లక్ష్యం చేసిందని విమర్శకులు అంటున్నారు. అయితే ఇది అవాస్తవమని ఐసిఐసిఐ బ్యాంక్ పేర్కొంది.

Comments

comments