Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఆలస్యం కానున్న ఐడియా – వొడాఫోన్ విలీనం

idea

న్యూఢిల్లీ: టెలికామ్ రంగంలో భారీ విలీనంగా పేర్కొంటున్న ఐడియా సెల్యులార్  వొడాఫోన్ డీల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విలీనానికి డెలికామ్ శాఖ(డాట్) ఆమోదం పొందాల్సి ఉంది. అయితే రూ.4700 కోట్లు చెల్లించిన తర్వాత విలీనమని డాట్ స్పష్టం చేసింది. దీంతో విలీన గడువు జూన్ 30 నాటికి రెండు సంస్థల డీల్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ‘ఐడియాలో వొడాఫోన్‌కు చెందిన అన్ని సంస్థలు విలీనం కానున్నాయి. ఆ కంపెనీ(వొడాఫోన్)పై ఒటిఎస్‌సి(వన్ టైమ్ స్పెక్ట్రమ్ చార్జీలు)కు చెందిన రూ.4700 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని క్లియల్ చేయాలని డాట్ వొడాఫోన్‌ను ఆదేశించింది’ అని అధికారులు తెలిపారు. 2015లో వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లో నాలుగు అనుబంధ సంస్థలు వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ సెల్యులార్, వొడాఫోన్ డిజిలింక్ వొడాఫోన్ విలీనం చేసింది. ఈ వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌ను ఇప్పుడు వొడాఫోన్ ఇండియాగా పిలుస్తున్నారు. అప్పటి విలీన సమయంలోనే రూ.6,678 కోట్ల ఒటిఎస్ బకాయిలను చెల్లించాలని వొడాఫోన్‌ను డాట్ ఆదేశించగా, కంపెనీ కోర్టులో సవాల్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ డీల్ ఆమోదానికి గాను వొడాఫోన్ రూ.2 వేల కోట్ల బకాయిలను మాత్రమే చెల్లించింది. అనంతరం టెలికామ్ మంత్రి మనోజ్ సిన్హా ఈ అంశంపై చర్యలు చేపట్టాలని డాట్‌ను ఆదేశించారు. వొడాఫోన్ ఇండియా నుంచి ఒటిఎస్  బకాయిలు వసూలు చేసే విషయమై న్యాయ సలహాలను తీసుకోవాలని డాట్‌కు ఆయన సూచించారు. న్యాయ సలహాలను తీసుకున్న డాట్.. వొడాఫోన్ నుంచి బకాయిల వసూలుకు మరోసారి డిమాండ్ చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Comments

comments