Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రతిపక్షాల మాటలు వింటే రైతులు నష్టపోతారు: కెసిఆర్

KCR

హైదరాబాద్: గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత పరిహారం భూమి కోల్పోయిన రైతులకు తాము చెల్లిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ… 2013 భూసేకరణ చట్టంలో లేని సానుకూలతలు కూడా తాము తీసుకొచ్చిన చట్టంలో ఉన్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువకు మూడు రేట్ల పరిహారం చెల్లించాలని మాత్రమే కేంద్ర చట్టంలో ఉందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఏడు నుంచి పది రెట్ల పరిహారం రైతులకు చెల్లిస్తుందని వివరించారు. 2013 భూసేకరణ చట్టం బాధ్యతరహితంగా చేసిన చట్టమని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని దుయ్యబట్టారు. ఎలాగూ అధికారంలో ఉండము అనే ధోరణితో కాంగ్రెస్ 2013 చట్టాన్ని తయారు చేసిందని మండిపడ్డారు.

రైతులకు మంచి జరగకుండా ప్రతిపక్షాలు చెడు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలు వింటే పరిహారం విషయంలో రైతులు నష్టపోయో ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.80 వేలు మించిన పరిహారం ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులు నమూనాలు రూపొందించేది రాజకీయ నాయకులు కాదు, ఇంజినీర్లు అని చెప్పారు. తక్కువ నష్టంతో ఎక్కువ నీరు నిల్వ చేసేందుకు ఇంజినీర్లు ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు.  భూమి అనే అంశం ఉమ్మడి జాబితాతో ఉంది, కాబట్టి దానిపై చట్టం చేసి అధికారం రాష్ట్రానికి ఉందని తెలియజేశారు. భూములు కోల్పోకుండా అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణం జరగదని చెప్పారు. భూములు కోల్పోయిన వారి బాధ తనకు అనుభవమేనని కెసిఆర్ తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం గతంలో తమ కుటుంబం కూడా భూమి కోల్పోయిందని ఆయన తెలిపారు.

కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఒక్క రూపాయి కూడా ఇవ్వనుపో అని అహంకారం ప్రదర్శించారన్నారు. తెలంగాణ నిధులు అడిగే అవకాశం కూడా గత పాలకులు తెలంగాణ నేతలకు ఇవ్వలేదని మండిపడ్డారు. డిపిఆర్‌లు లేకుండా టెండర్లు పిలవరని, ప్రాజెక్టులు కట్టరని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సుదీర్ఘకాలం ఎందుకు పట్టేదే గతంలో తనకు అర్ధమయ్యేది కాదని, ప్రతిపక్షాలు, కొందరు అధికారుల ధోరణి వల్లే ఆలస్యం జరుగుతోందని అని ఆయన స్పష్టం చేశారు.

ప్రాణహిత, ఇంద్రావతి నీరు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ సలహాతోనే భూసేకరణ చట్టంలో కొన్ని సవరణలు చేశామన్నారు. 2013 భూసేకరణ చట్టానికి మార్పులు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ యోచిస్తున్నారన్నారు. 2018 జులై నాటికి ఉత్తర తెలంగాణలో రెండు పంటలు పండేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

comments