Home వార్తలు మేడిపండు కొంటేనే రుచెక్కువా?

మేడిపండు కొంటేనే రుచెక్కువా?

అత్తిపండు, మేడి పండు, అంజీర పండు ఈ మూడు  ఒకటే అని చాలా మందికి  తెలియదు. బుట్టల్లో పెట్టి అమ్మేవి అంజీర పండు, చెట్టున రాని కాలికింద నలిగేవి మేడి పండ్లు అనుకుంటున్నారు కొందరు. మేడి పండ్లనే ఫిగ్ అని ఇంగ్లీషులో పిలుచుకుంటూ   ఒక్కోటి రెండు, మూడు రూపాయలు పెట్టి కొనుక్కుని చాలా ఇష్టంగా  తింటుంటారు. కానీ ఊర్లలో కొన్ని చోట్ల కనిపించే ఈ చెట్టునుగానీ, ఇవి రాల్చే పండ్లను గానీ ఎవరూ పట్టించుకోరు.  కొన్ని ఆఫీసుల్లో, వీధుల్లో, బస్టాండుల్లో నీడ కోసం వేసిన ఈ చెట్లు కుప్పలు కుప్పలుగా రాల్చిన పండ్లు పాదాల కింద నలిగి పోతుంటాయి. అప్పుడనిపిస్తుంది ఈ పండు డబ్బు పెట్టి కొంటేనే రుచిగా ఉంటాయా? అని.  డ్రై ఫ్రూట్స్‌లో ఇవి చిల్లు అప్పచ్చిల్లా బాదం, పిస్తా, జీడిపప్పుల వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో ప్రముఖ స్థానమే పొందుతాయి. ‘మేడిపండు చూడ మేలిమై ఉండు… పొట్టవిప్పి చూడ పురుగులుండు’ బహుశా ఈ పద్యం రాసిన వేమన ఈ పండ్లకు జనాల్ని దూరం చేశాడేమో అనిపిస్తుంది… ఈ పండు పొట్టవిప్పితే సన్నని గింజలు పురుగుల్లా కనిపిస్తాయి. అవే పురుగులేమో అనుకోవచ్చు… కానీ నిజానికి ఆ సన్నని గింజలతో పాటు పురుగులూ ఉంటాయి. అందుకే వీటి జోలికి ఎవరూ వెళ్ళరమో…  అన్ని పండ్ల చెట్ల మాదిరిగానే పురుగు చేరకుండా కాపాడుకొంటే…  వీటితో గ్రామీణ మహిళలు వ్యాపారమూ చేసుకోవచ్చు. ఇంతకూ అన్ని పండ్ల కు లాగానే ఈ పండులో ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. 
ఆరోగ్య-ఔషధ దాయిని

fruitsతీపి తక్కువగా, వగరుగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పళ్ళు శరీరానికి చలవ చేస్తాయి. కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనీజాలు, పీచు, విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. పాలు, పాల పదార్థాలు పడనివారు వీటిని పది నుంచి పన్నెండు చొప్పున తీసుకుంటే శరీరానికి కాల్షియం, ఇనుము అందుతాయి. కడుపులో అమ్లాల అసమతుల్యతను లేకుండా చేస్తాయి. పేగుపూత, కడుపులో మంట, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పొటాషియం గుండెకు ఉపయోగపడుతుంది. అతి ఆకలితో బాధపడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చక్కటి ఔషధం. చక్కెర వ్యాధి గల వారు కూడా వీటి తినవచ్చు. ఇందులో ఉన్న ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణం ఉంది. నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. మేడిపండ్లు రక్త ప్రసరణ బాగా జరగడానికి తోడ్పడతాయి. దీని తొక్క దళసరిగా ఉండడం వల్ల త్వరగా అరగదు. అందువల్ల పండును నీటిలో నానబెట్టి ఆ తరువాత తింటే అరగకపోవడం అనే సమస్య తలెత్తదు.

కేన్సర్ నివారిణి

మేడి పండ్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. కేన్సర్ కలుగజేసే ముఖ్య కారకాలైన ప్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
పోస్ట్ మెనోపాజల్ మహిళల్లో హర్మోన్ల అసమతుల్యత కారణంగా రొమ్ము కేన్సర్ కలిగే అవకాశం ఉంది. మేడిపండు ఈ రకమైన కేన్సర్ వ్యాధి రాకుండా కాపాడే గుణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.
మేడి పండ్ల నుండి తీసిన రసం మెదడులో కేన్సర్‌కు గురైన కణాలపై శక్తివంతంగా పనిచేస్తుందని నూతన పరిశోధనలలో కనుగకొన్నారు.
మేడి పండ్ల రసం, కేన్సర్‌కు గురైన కణాలలో ప్రవేశ పెడితే కేన్సర్ అభివృద్ధిని 75 శాతం నివారించినట్టు పరిశోధనలలో తేలింది.
మేడి పండ్లు రసం కాలేయ కేన్సర్ కణాలతో వ్యతిరేకంగా పోరాడుతుందని తేలింది.
మేడి పండ్లలో ఉండే ల్యుటేయోలిన్ ప్లావనాయిడ్‌లు, యాంటీ ఇన్ఫ్ల మేటరీ చర్యలను పెంపొందిస్తాయి.
ల్యుటేయోలిస్ , చర్మ కేన్సర్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వంద గ్రాముల మేడిపండులో…
– పిండి పదార్థం – 19 గ్రా
– పీచు పదార్థం – 3 గ్రా
– చక్కెర – 16 గ్రా
– కొవ్వు – 0.3 గ్రా
– ప్రొటీన్లు – 0.8 గ్రా
– విటమిన్ బి6 – 110 గ్రా
– శక్తి – 70 కిలో.కె.
ఎండిన పండ్లలో పోషకాలు
– పిండి పదార్థాలు – 84 గ్రా
– చక్కెర – 48 గ్రా
– పీచు పదార్థం – 10 గ్రా
– కొవ్వు – 0.3 గ్రా
– ప్రొటీన్లు – 3 గ్రా

వివిధ వ్యాధుల్లో దీన్ని వైద్యులు వాడే విధానం…

మల బద్దకంః మేడిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టి తోలు ఉంటుంది. ఇది మల బద్ధకానికి తోడ్పడుతుంది. మేడిపండ్లలో ఉండే చిన్న చిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మోషన్ ఫ్రీ అవుతుంది.
అర్శమొలలుః మేడిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. వీటిని మూల వ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరచి చన్నీళ్ళు తీసుకొని మూడు నాలుగు ఎండు మేడిపండ్లు రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండు మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూల వ్యాధి తగ్గుతుంది.
ఉబ్బసంః కొంతమందికి కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు మేడిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసట తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.
శృంగారానురక్తి తగ్గటంః మేడిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగుడుతుంది. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతో గానీ వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే శక్తి ఇనుమడిస్తుంది.
ఆనెలుః పచ్చి మేడిపండ్ల మీద గాటు పెడితే పాల వంటి పదార్థం వస్తుంది. దీనిని ఆనెల మీద ప్రయోగిస్తే నెమ్మదిగా ఆనెలు మెత్తబడి పై పొరలు ఊడిపోతాయి. పచ్చి మేడికాయలలో వచ్చే పాలకు నొప్పిని తగ్గించే తత్వం ఉంది.
నోటిలో పుండ్లుః మేడిపండ్లనుంచి కారే పాల మాదిరి ద్రవాన్ని పుండ్లపై ప్రయోగించాలి.
శరీరంలో వేడిః బాగా పండిన తాజా మేడిపండ్లను 2-3 తీసుకొని మిశ్రీతో కలపాలి. వీటిని రాత్రంతా పొగమంచులో ఆరుబటయ ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇలా 15 రోజులపాటు చేయాలి.
బలహీనతః చాలా మందికి శారీరక బలహీనతల వల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుక మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారు మేడిపండ్లు తీసుకుంటే మంచిది.

పండించే ప్రాంతాలు

5 వేల సంవత్సరాల క్రితం ఈ చెట్టు ఉనికి ఉండేదని చరిత్రలో ఉంది. దీన్ని మొదట పార్శీ దేశస్థులు పండించి ఆహారంగా ఉపయోగించారు.
ఆసియాలోని అన్ని ప్రాంతపు అడవుల్లో ఈ చెట్లు విరివిగానే కనిపిస్తాయి. అడవుల్లోని వణ్యప్రాణులకు కోతులు, పక్షులు, నెమళ్లు వంటి వాటికి ఇవి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. అయితే భారతదేశపు శీతోష్ణ స్థితిని బట్టి ఈ చెట్లు ఎక్కువగా పెరిగే ప్రాంతమే అయినప్పటికీ ఈ పళ్ళ ఉత్పత్తి ఏ మేరకు అనేది లెక్కింపులో లేదు.
2013 లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచంలో ఈ పండ్ల ఉత్పత్తి 1.1 మిలియన్ టన్నులు ఉంది. టర్కీలోనే ౦.౩ మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. ఈజిప్ట్‌తో పోల్చితే ఇక్కడ ఉత్పత్తి రెట్టింపు. మొరాకో, ఇరాన్లలో మేడి పండ్ల ఉత్పత్తి ఎక్కువే. ఇవి ఆహారంగా, వైద్యం కోసం కూడా బాగా ఉపయోగిస్తారు.

వంటలో వాడకం

తాజా పండుగా కాకుండా డ్రై ఫ్రూట్‌ను ఎక్కువగా ఆహారంల వాడతారు. కొన్ని రకాల జాముల్లో కూడావడుతుంటారు.
దీన్ని తెంచిన తరువాత రవాణాకు అంతగా పనికిరాకపోవడంతో దీన్ని బిస్కెట్లలో నింపి లేదా ఎండిన చక్రాలను ఎగుమతి చేస్తుంటారు. ఎండబెట్టడం కూడా పండ్లను కడిగి ప్రెస్ చేసి ఎండ బెట్టడమే కాకుండా ఓవెన్లలో వేడిచేసి కూడా వాడుతుంటారు.