Home వార్తలు ర్యాగింగ్ చేస్తే శిక్ష తప్పదు

ర్యాగింగ్ చేస్తే శిక్ష తప్పదు

ఎస్.బి.టి. సుందరి,
హైకోర్టు న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్. 9912510945.

Ragging-Bannedనేను ఇంటర్ (ఎంపిసి) 80శాతం మార్కులతో పాసయ్యాను. మా తండ్రికి నన్ను బి.టెక్ చదివించాలని కోరిక. కానీ మా కుటుంబంలో ఇప్పటివరకూ అమ్మాయిలు ఎవ్వరూ బి.టెక్ చదవలేదు. నాకు చదవాలని ఆసక్తి ఉంది కానీ మా ఫ్రెండ్ చెప్పిన దగ్గర నుండి నాకు ఎందుకో భయంగా వుంది. మా ఫ్రెండ్ నీరజ వాళ్ళ దూరపు రిలేషన్ ఒకరు ర్యాగింగ్ బాధ తట్టుకోలేక ఉరి వేసుకున్నాడని. అందుకే వాళ్ళ అన్నయ్యను కూడా వాళ్ళ డాడీ బి.టెక్ చదివించలేదని చెప్పింది. అప్పటినుండీ నేను అదే తలచుకొని భయపడుతున్నాను. మా ఇంట్లో చెబితే భయపడకు ర్యాగింగ్ అనేది కామన్ ఎక్కడైనా వుంటుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు. ర్యాగింగ్ అనేది ఎందుకు చేస్తారు? జూనియర్లు అయినంత మాత్రాన ఈ ర్యాగింగ్ భరించాలా? అందరూ ధైర్యవంతులు వుండరు కదా! ర్యాగింగ్ పేరుతో బాధించి, హద్దుమీరి ప్రవర్తిస్తే వారికి శిక్షలు లేవా? కొందరు విద్యార్థులు చదువు మధ్యలో ఆపి వెళ్లిపోతుంటారు. మరికొందరు సూసైడ్ చేసుకుంటుంటారు. కొంతమంది ఇంట్లో వారికి చెప్పకుండా బాధపడుతుంటారు. వీటిని అరికట్టడానికి ఏ చట్టాలున్నాయి. దయచేసి తెలుపగలరు. నేను ఎంసెట్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. కానీ ఈ భయం నన్ను పీడిస్తుంది. – మేఘన, గుంటూరు
ragging2ఈ ర్యాగింగ్ అనేది ఒక వికృతమైన చర్య. దీనికి ఇదివరకు చాలామంది బలైనారు. ఆ సంఘటనలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. దీనికి సంబంధించి ర్యాగింగ్ నిషేధ చట్టం వుంది. దీన్ని లెక్కచేయకుండా వున్నవారికి ఈ కింది సూచనలు వర్తిస్తాయి.
ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులకు చదువు మధ్యలోనే కాలేజీ నుండి సస్పెన్షన్ చేస్తారు.
ఎకడమిక్ ఇయర్‌తో సంబంధం లేకుండా పంపించేస్తారు.
బహిరంగ క్షమాపణ చెప్పించి, జరిమానా వేస్తారు. ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 ప్రకారం.
విద్యార్థిని బహిరంగంగా ఏడిపించడం, అవమానపరచడం (ర్యాగింగ్ పేరుతో) చేసిన సెక్షన్ 4 (1) ప్రకారం ఆరు నెలలు జైలుశిక్ష, రూ. 1000 జరిమానా వుంటుంది.
దౌర్జాన్యం, నేరపూరితమైన పనులు చేసిన సెక్షన్ 4(2) ప్రకారం… ఏడాది జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా వుంటుంది.
ర్యాగింగ్ పేరుతో బలమైన గాయాలు చేసినా, కిడ్నాప్ లాంటివి చేసినా ఐదేళ్లు జైలుశిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తారు.
చంపడం లేదా చనిపోయేటట్లు ప్రేరేపించడం వంటివి చేసినా పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, రూ.50వేలు జరిమానా వుంటుంది.
క్రిమినల్ కేసులు, నేర చరిత్ర కలిగి వున్న వారికి విదేశీ పాస్‌పోర్ట్ రద్దు చేస్తారు.
2002లోనే ర్యాగింగ్‌ని నిషేధిస్తూ అన్ని విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఈ ర్యాగింగ్ చర్యలు అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కనుక మీరు భయం వదిలి, హ్యాపీగా చదువుకోండి. మీకు చట్టాలు అండగా వుంటాయి.
ఆ విషయంలో ఆలోచించాలి

మా వారు ఒక సొంతిల్లు కొనాలనుకుంటున్నారు. అంతకుముందు మాకు తెలిసిన వాళ్లు ఒక భూమి కొన్నారు. అయితే అది డిస్‌ప్యూట్‌లో వున్న స్థలం. నేను వాళ్ళని అడిగితే అంతకుముందే అది వేరే వాళ్ళకి అగ్రిమెట్ చేసిన స్థలమని , ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని చెప్పారు. ఇప్పుడు మేం చూసిన ఇల్లు అంతా బాగానే వుంది. అమ్మేవాళ్లు కూడా మంచివాళ్ళు. కానీ ఆ ఇంటిప్రక్కన ఒక బిల్డింగ్ వుంది. ఆ బిల్డింగ్‌లో వాళ్ళు ఈ ఇంటిని మీరు కొనవద్దు, దానికి వాళ్ళు మాత్రమే ఓనర్స్ కారు. ఇంకా వున్నారని మాకు చెప్పారు. ఆ విషయాన్ని మేం ఈ ఇంటి యజమానితో చెబితే, ఆ పక్కింటి యజమాని, ఆ బిల్డింగ్ వాళ్లు మాతో మా ఇంటిని అడిగారు. అయితే, మాకూ, వాళ్ళకూ మధ్య పూర్వం నుండి గొడవలు వున్నాయి. అందుకే వాళ్ళకు అమ్మడం నాకిష్టం లేదని చెప్పాం. అప్పటినుండీ వాళ్ళు ఇంటికోసం ఎవరు వచ్చినా ఇలా చెప్పి చెడగొడుతున్నారు. అని చెప్పినాడు. మా వారు కొందామంటున్నారు. నేనేమో గొడవలు (కోర్టు కేసులు) మనం పడలేం. ఇంకోటిదైనా చూద్దాం అని అంటున్నారు. ఈరోజుల్లో ఏమైనా (స్థలం, ఇల్లు) లాంటివి కొనాలంటే మోసాలు జరుగుతున్నాయి. వాటి నుండి బయటపడడం చాలా కష్టమైపోతుంది. ఎంత చదువుకున్న వాళ్ళైనా ఈ విషయంలో మోసపోతున్నారు. కనుక ముందుగా జాగ్రత్తలు తీసుకుని ప్రాపర్టీస్ కొనాలంటే మేము ఏమి చెయ్యాలి? వివరంగా చెప్పండి.
-రేవతి
నేను నీ ఉత్తరం చదువుతున్నప్పుడు నీ భయం నాకు అర్థమైంది. సాధారణంగా మనం పది రూపాయలు వస్తువు కొనేటప్పుడు ఎన్నోసార్లు పరిశీలించి, నాణ్యత చూసి కొంటాం. అలాంటిది లక్షలు పోసి కొనే ఇళ్ళు, స్థలాల ఆలోచించి, ఆచితూచి అడుగెయ్యాలి. కంగారుపడకూడదు. చాలామంది ఈ తరహా కేసులతో సతమతమవుతున్నారు. మీరు పరిశీలించుకోవాల్సిన విషయాలు.
ఆస్తి అమ్మే వ్యక్తికి దానిపై సర్వ అధికారాలు వున్నాయా? లేవా?
దానికి సంబంధించి భాగస్వాములు ఎవరైనా వున్నారా?
ఆస్తి అతనికి స్వార్జితమా, పూర్వీకులదా? ఎలా వచ్చింది.
దానికి సంబంధించిన డాక్యుమెంట్లు వున్నాయా?
ప్రస్తుతం అమ్మే ఆస్తిపై ఇంతకుముందు ఎవరికైనా అగ్రిమెంట్ రాసినారా? రిజిస్ట్రేషన్ లాంటివి జరిగాయా?
ఆ ప్రాపర్టీ ఎక్కడైనా బ్యాంకులో, లేదా మరెక్కడైనా తనఖా పెట్టారా? తెలుసుకోవాలి. దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్స్‌ని అడగాలి.
ఆ ప్రాపర్టీ (ఇల్లు)పైన బిల్లులు లాంటివి (కరెంట్, మునిసిపల్ పన్నులు, బాకీలు) ఏమైనా వున్నయా?
దస్తావేజుల్లో సరిహద్దులు కరెక్టు గా వున్నాయా లేదా? చూసు కోవాలి. లేనిచో ఈజ్ మెం టరీ రైట్స్ కోసం పోరాడాల్సి వస్తుంది (కోర్టు ద్వారా)
ఆస్తిపై మరెవరైనా అబ్జెక్షన్ చెబు తారనుకుంటే ఒకసారి పేపర్ ప్రకటన ఇవ్వాల్సి వుంటుంది.
ఆస్తికి సంబంధించిన ఇ.సిని రిజిస్ట్రేషన్ ఆఫీసు ద్వారా తీసుకుని ఒకసారి పరిశీలించు కోవాలి.