Home జయశంకర్ భూపాలపల్లి అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

ఎన్ని అడ్డంకులు సృష్టించినా ములుగు జిల్లా సాధిస్తాం
మంత్రి చందూలాల్‌కు గుణపాఠం తప్పదు
జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ
JACములుగు: అక్రమ అరెస్టులతో ములుగు జిల్లా సాధనోద్యమాన్ని ఆపలేరని జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ నాయకులు గండ్రకోట కుమార్, అల్లె శోభన్, ముంజాల బిక్షపతిగౌడ్, యూనుస్, దూడబోయిన శ్రీనివాస్‌లు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ములుగును సమ్మక్క-సారలమ్మ పేరిట జిల్లా చేయాలని కోరుతూ చేపట్టిన ఒకరోజు నిరాహారదీక్ష కార్యక్రమానికి వెళ్లకుండా వారిని ముందస్తుగా బుధవారం ఉదయం ములుగు పోలీసులు అరెస్టు చేసి రెండురోజులపాటు స్టేషన్‌లో ఉంచారు.

 ఈసందర్భంగా గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ…ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ములుగు జిల్లా సాధిస్తామని అన్నారు. ఉద్యమానికి అడ్డుపడుతున్న ఈప్రాంతానికి చెందిన గిరిజనసంక్షేమశాఖ మంత్రి చందూలాల్‌కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ములుగు జిల్లాగా ఏర్పడితే ఈప్రాంతం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత కొన్నేళ్లుగా ములుగు ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడంలేదని పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు ములుగుకు ఉన్నాయని, అయినప్పటికీ ములుగును జిల్లా చేయకుండా అర్హతలేని ప్రాంతాలను జిల్లాలు చేయడం సరైందికాదని అన్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాలు జరుగుతుంటే సహకరించాల్సింది పోయి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మంత్రి చందూలాల్ తన అంగబలాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 1న ములుగులో నిర్వహించిన జిల్లాసాధన బహిరంగసభకు సైతం మంత్రి చందూలాల్ అడ్డుతగిలాడని అన్నారు. ఇందిరాపార్కు వద్ద ఒకరోజు దీక్ష చేయడానికి జెఎసి పక్షాన అనుమతి తీసుకున్నప్పటికీ తమను ముందస్తుగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యమానికి అడ్డుతగలాలని చూస్తే అది తీవ్రరూపం దాలుస్తుందని, అందుకు నిదర్శనం గురువారం ఈప్రాంతం నుండి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లి దీక్షలో కూర్చోవడమేనని పేర్కొన్నారు. అరెస్టు చేసిన తమను రాత్రి సైతం స్టేషన్‌లో ఉంచారని, రాజ్యాంగంలో డిమాండ్ల కోసం నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేశారు. అందులో భాగంగానే తాము ములుగు జిల్లా ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా ఈప్రాంత ప్రజలారా మేల్కొని పార్టీ జెండాలను పక్కనబెట్టి ములుగు జిల్లాయే ఎజెండాగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో ములుగు జిల్లా సాధనకై కదలిరావాలని అన్నారు.