Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) కాసులిస్తే.. అక్రమమైనా సక్రమమే..!

కాసులిస్తే.. అక్రమమైనా సక్రమమే..!

ఎఫ్‌టిఎల్‌లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
అధికారులు మొదట్లో స్పందించారు … ఇప్పుడు సహకరిస్తున్నారు …?
అన్యాక్రాంతమవుతున్న స్థలాలు

BUILD1

మన తెలంగాణ/ మల్కాజిగిరి: అధికారులు అడిగినంత ఇచ్చే స్థోమత మీకుందా? లేదా మీకు రాజకీయ పలుకుబడి ఉందా? ఉన్నట్లయితే మీకు నియమ నిబంధనలు ఏవీ కూడా అడ్డు రావు. యథేచ్ఛగా ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టవచ్చు. ఒక వేళ మీకు పై అంశాల్లో ప్రావీణ్యం లేకపోతే ఇంటి నిర్మాణానికి ఇటుక కూడా పెట్టలేరు. మల్కాజిగిరిలోని బండ చెరువు పరిసర ప్రాంతా లలోని ఎఫ్‌టిఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు సహకరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎఫ్‌టిఎల్ పరిధిలో ఓ బిల్డర్ నిబంధనలను అతిక్రమించి ఇంటి నిర్మాణ పనులను చేపడుతున్నాడని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది.

సంబంధిత అధికారులు, సిబ్బంది ఆ స్థలానికి క్షణాల్లో వచ్చి పనులు నిలిపి వేశారు. అదే ఎఫ్‌టిఎల్ పరిధిలో మరి కొన్ని రోజుల క్రితం మరో చోట మరో బిల్డర్ ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించి పనులు నిలిపి వేశారు. వారిపై రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలకు పూను కున్నారు. అయితే ఇది కొన్ని రోజుల క్రితం మాట. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. రెవెన్యూ అధికారులు మామూళ్ళకు మొగ్గు చూ పడం, ఒత్తిళ్ళకు తలొగ్గుతుండడంతో అక్రమ నిర్మాణాలు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయని స్థానికులు ఆరో పిస్తున్నారు. చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు చూసీ చూడ నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఫిర్యాదు రాగానే స్పందించి వెంటనే చర్యలు తీసుకున్న రెవెన్యూ అధి కారులు ఇప్పుడు మాత్రం ఆ విధంగా స్పందించకపోవడం గమనార్హం. అక్రమ నిర్మాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అప్పటి వరకు చెప్పి తప్పించుకుంటున్నారే కానీ ఒక్కరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్న ఆధారాలు లేవు. ఈ లోపు ఇళ్ళ నిర్మాణాలను బిల్డర్లు పూర్తి చేసి అమాయకులకు అంటగడుతున్నారు. మొదట్లో చర్యలు తీసుకున్న అధికా రులు ఇప్పుడు స్పందించకపోవడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మల్కాజిగిరి మండల రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణ దారు లతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పుడు మేము నిర్మాణాలు చేపడుతుంటే మాపై కఠినమైన చర్యలు ఇప్పుడు జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని బిల్డర్లు ప్రశ్నిస్తున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం : తహసీల్దార్
మాపై వస్తున్న ఆరోపణలు సమంజసం కాదు. ఎఫ్‌టిఎల్ పరి ధిలో నిర్మాణాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం నిర్మాణాలు చేపడుతున్న ప్రకాశ్ రావ్, భాస్కర్ రావ్, అశోక్, బలరాం, గుప్త, శ్రీనివాస్, జి. మహేష్, బీరప్పలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మార్వో తెలిపారు.