Search
Thursday 15 November 2018
  • :
  • :

ఆగని క్వారీల అక్రమ పేలుళ్లు

జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే
ఇటీవల ఈ క్వారీల చుట్టే రాష్ట్ర మంత్రుల పర్యటనలు

Cvuaryపాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని దర్మారం అడ్డ రోడ్డు వద్ద కొందరు క్వారీల నిర్వాహకులు అక్రమ భారీ బ్లాస్టింగ్‌లకు పాల్పడుతున్న నేటి వరకు అన్ని శాఖల ప్రభుత్వాధికారులు అందుబాటులో ఉన్న అక్రమ పేలుళ్లను అరికట్టడంలో ఎందుకు విఫలం అవుతున్నారో ఎవరికీ అంతుచిక్కని వైనం. ఒకనాడు జిల్లా కేంద్రానికి సుమారు 40 కి.మీ.ల దూరంలో ఉన్నా ఇక్కడి పేలుళ్లును అరికట్టిన అధికారులు నేడు కేవలం 10కి.మీ.ల దూరంలో పెద్దపల్లి జిల్లా కావడం, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉన్నా క్వారీల వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇటీవల అంతర్గాం మండల కేంద్రంలోని పెద్దంపేట, అంతర్గాం గ్రామాల మధ్య నెలకొల్పిన (లిఫ్ట్ ఇరిగేషన్) పంప్ హౌజ్ పనుల ప్రారంభోత్సవానికి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, పుట్నూర్ గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలు సైతం ఆయా క్వారీల ప్రాంతం నుండే రాకపోకలు కొనసాగించారు.

ఇదేకాక ఏకంగా విద్యుత్ శాఖ మంత్రిని ఆయా అక్రమ క్వారీలకు అతి సమీపంలోనే అడ్డరోడ్డు వద్ద పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు సైతం ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల్లోకి వెళితే కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బోడగుట్టకు నెలకొల్పిన క్వారీలను బ్లాస్టింగ్ జోన్‌లుగా గుర్తించింది. ఎవరు ప్రభుత్వ అధికారులా లేక క్వారీల నిర్వాహకులా అనేది నాటి నుండి నేటి వరకు ఎవ్వరికీ అర్థం కానీ, అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఈ గుట్టలకు ఆనుకుని అటు రాజీవ్ రహదారి, ఇటు పెట్రోల్ పంపు, 11 కె.వి. విద్యుత్ హైటెన్షన్ లైన్లు సైతం ఉన్నాయి. అయినా కొందరు అక్రమార్కుల కన్ను ఆ గుట్టలపై పడటంతో అక్కడ క్వారీలను నెలకొల్పి భారీ అక్రమ బ్లాస్టింగ్‌లకు పాల్పడుతూ పెద్ద ఎత్తున రాయిని వెలికి తీస్తున్నారు.

దీనికి తోడుగా మరికొందరు పెట్టుబడిదారులు రంగ ప్రవేశం చేసి ఏకంగా కంకర క్రషర్లనే నెలకొల్పారు. ఒక నాడు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో ఏ అధికారులు ఇంత దూరం రారనే ధీమాతో క్వారీ నిర్వాహకులే అక్రమ బ్లాస్టింగ్‌లకు పాల్పడవచ్చు, కానీ నేడు సుమారు పది కి.మీ.దూరంలోనే పెద్దపల్లి జిల్లా కావడంతో పాటు రామగుండం బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఉండటం అనునిత్యం విధి నిర్వహణలో భాగంగా జిల్లాస్థాయి అధికారులు, రాష్ట్ర మంత్రులు ఈ రహదారి వెంట రాకపోకలు కొనసాగించటం జరుగుతున్నది. రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతున్న అక్కడి క్వారీలపై ఏ ఒక్క అధికారి ప్రత్యేక దృష్టి సారించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేకపోవడం మరో విడ్డూరం. ఇటీవల అక్కడి బ్లాస్టింగ్‌లకు ఉపయోగించే పేలుడు పదార్థాలు పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొని మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అయినా ఇక్కడి అక్రమ బ్లాస్టింగ్‌లను అడ్డుకునేందుకు ఏ ఒక్క అధికారి కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు జరపకపోవడం పట్ల స్థానికుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది.

Comments

comments