Home వార్తలు యథేచ్చగా వెంచర్లు.. అక్రమ లేఅవుట్లు

యథేచ్చగా వెంచర్లు.. అక్రమ లేఅవుట్లు

 Illegal layouts in government lands

మన తెలంగాణ/జహీరాబాద్ : ప్రభుత్వానికి ఆదాయం సమకూరే పనులపై అధికారులు డేగ కన్ను ఉంచాల్సి ఉంటుంది. అధికారులు చేతులు తడుపుకుంటే ప్రభుత్వానికి లక్షల్లో నష్టం చేకూరుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జహీరాబాద్ మున్సిపల్ అధికారులు నిద్రను వీడితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాకుండా అమాయక ప్రజలు కూడా అక్రమార్కుల నుంచి నష్టపోకుండా ఉంటుందని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… మండలంలోని రంజోల్, అల్లీపూర్, పస్తాపూర్, చిన్న హైద్రాబాద్, హోతి(కె) తదితర గ్రామ పంచాయతీలు త్వరలోనే (బహుశ జూలై మాసంలో) జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తమ కోటను నింపుకునేందుకు పలు పంచాయతీలతో పాటు జహీరాబాద్ పట్టణ శివారులో (రంజోల్, అల్గోల్ బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్డు, జహీరాబాద్) అనుమతి లేకుండా వెంచర్ల పేరిట అక్రమ లైవుట్‌లు వేస్తున్నారు. అనుమతి లేకుండా వేసిన లే అవుట్‌లో ప్లాట్లు కొని ఇండ్లు నిర్మించుకుంటే బ్యాంకులు ఎలాంటి రుణాలు అందించవని తెలియని కొందరు ప్రజలు ఆ వెంచరు, లేఅవుట్‌కు అనుమతి ఉందా లేదా అని తెలుసుకోకుండా అక్రమార్కుల మాయమాటలకు లోనయి ప్లాట్లు కొంటున్నట్లు తెలుస్తోంది. పట్టణంతో పాటు పట్టణ శివారులో ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు వెలుస్తున్నా మున్సిపల్ అధికారులు కాని, పాలకులు కాని పట్టించుకుంటున్న పాపాన పోలేదని చెప్పవచ్చు. తమ చేతులు తడుస్తున్నందుకే అధికారులు, పాలకులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ వెంచర్లను తొలగిస్తాం :
మున్సిపల్ కమిషనర్ : జహీరాబాద్ శివారులో అనుమతి లేకుండా వెలుస్తున్న అక్రమ వెంచర్ల విషయాన్ని మన తెలంగాణ సోమవారం మున్సిపల్ కమీషనర్ జైత్‌రాం నాయక్ దృష్టికి తీసుకుపోగా… అవును తమ దృష్టికి కూడా వచ్చింది. మున్సిపాలిటీకి రెగ్యూలర్ టౌన్ ప్లానింగ్ అధికారి అందుబాటులో ఉన్నారని, అక్రమ వెంచర్లపై దాడులు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీ అధికారులకు కేవలం 300 గజాల వరకే అనుమతి ఇస్తామని, అంతకు మించిన స్థలంలో పాట్లు, వెంచర్లు వేసుకోవాలంటే డైరెక్టర్ టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని వివరించారు.