Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఘోషిస్తున్న గోదావరి ఉపనదులు

Illegal transport sand in bhadradri district

* ఇసుక మాఫియాకు అడ్డాగా పాల్వంచ
* కిన్నెరసాని, మొర్రేడు నుండి బారీగా అక్రమ ఇసుక రవాణా
* ఒకే కూపన్ తో రోజంతా తోలకం
* రోజుకు లక్షల్లో దోచుకుంటున్న ఇసుకాసురులు
* పంచాయితీ అదాయానికి గంఢీ
* అక్రమానికి తలుపులు తెరిచిన అధికారులు
* అధికార పార్టీ అండదండలు?
* ఎమ్మెల్యే పేరును చెడగొడుతున్న గల్లీ లీడర్లు

మన తెలంగాణ/పాల్వంచ ః దక్షిన గంగగా పేరుగాంచిన గోదావరి నది ఉపనదులైన కిన్నెరసాని, మొర్రేడు నదులు ఇసుక మాఫియాతో ఘోషిస్తున్నాయి. పాల్వంచ మండల, పట్టణ పరిధిల నుండి ఆయా నదులు ప్రవహిస్తున్నాయి. కొందరు ఇసుకాసురులు అక్రమ ఇసుక రవాణాను వ్యాపారంగా చేసుకొని రోజుకు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. మండల పరిధి నాగారం, జగన్నాధపురం, సోములగూడెం, దంతెలబోర, పాయకారి యానంబైలు, పట్టణ పరిధి శ్రీనివాసకాలనీ, పాతపాల్వంచ నుండి రోజుకు వందల ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది. ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు జాతరలా నడుస్తున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కెటిపియస్ నిర్మాణ పనులతో పాటు, జాతీయ రహదారి విస్తరణ పనులు, సీతారామ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదతర పనులకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఒక్క ట్రాక్టర్ ఇసుక రూ. 2500 నుండి 3000 వేల వరకు పలుకుతుంది.
అభివృద్ధి పనులకు ఇసుక ర్యాంపు ప్రారంభం….
మండల, పట్టణ పరిధిలో డబుల్‌బెడ్‌రూం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక కొరత తీవ్రంగా ఉండటంతో దానిని తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మండల పరిధి నాగారం పంచాయితీ బోజ్యాతండా సమీపంలోని మొర్రేడు వాగులో ఇసుక ర్యాంపు ప్రారంభించారు. ఈ ర్యాంప్ నుండి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే ఇసుకను రవాణా చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు స్థానికంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయనే ఉద్దేశ్యంతో ర్యాంపును ప్రారంభించారు. ఈ ర్యాంపును పంచాయితీ అధికారుల పర్యవేక్షణలో ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ. 1000 డి.డి తీసిన వారికి పంచాయితీ అధికారులు ట్రాక్టర్ ఇసుకను ఇవ్వాల్సి ఉంది.
అసలు జరుగుతున్నది ఏంటి?
అభివృద్ధి పనుల కోసం ప్రారంభించిన ఇసుక ర్యాంపు నుండి అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారు. అనుమతులు తీసుకున్నది అభివృద్ధి పనుల కోసం.. కానీ అక్కడ జరిగే తంతు వేరేలా ఉంది. ర్యాంపు ప్రారంభం కాక ముందు అక్రమ ఇసుక రవాణాను గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసేవారు. ర్యాంపు ప్రారంభించిన నాటి నుండి ఎటువంటి అడ్డుఅదుపు లేకుండా పగలు రాత్రి తేడాలేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు అధికార పార్టీకి చెందిన గల్లీ లీడర్లు ఎమ్మెల్యే పేరును వాడుకొని ఒకే కూపన్ పై రోజంతా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో ట్రాక్టర్ మొదటి లోడ్‌కు రూ. 1200 చెల్లించి తరువాత లోడ్‌లకు కూపన్ లేకుండా ఒక్కో ట్రాక్టర్ ఇసుక లోడ్‌కు రూ. 500 నుండి 800 వరకు వసూలు చేస్తున్నారు. ర్యాంపుకు వెళ్ళేదారిలో అనధికార చెక్‌పోస్ట్ ఏర్పాటుచేసి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు తీసుకొని ట్రాక్టర్ నెంబర్ నమోదుచేసుకుని లోడ్ చేసి పంపిస్తున్నారు. ర్యాంపు వద్ద సుమారు వంద ట్రాక్టర్లు సీరియల్ లో ఉన్నాయంటే ఎంత మేర అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. రోజుకు సుమారు 80 నుండి 100 ట్రాక్టర్లు ఒక్కో ట్రాక్టర్ 5 నుండి 8 ట్రిప్పుల ఇసుక రవాణా అవుతుంది. అంటే సుమారు రోజుకు 500 ట్రిప్పుల వరకు ఇక్రమ ఇసుక రవాణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను రోజుకు సుమారు రూ. 2.5 నుండి 3 లక్షల వరకు అక్రమంగా దోచుకుంటున్నట్లు సమాచారం.
ర్యాంపు వద్ద కనిపించని అధికారులు….
ర్యాంపు వద్ద పంచాయితీ కార్యదర్శి కానీ వారి సహాయకుల పర్యవేక్షణలో డి.డి. లు తీసిన ట్రాక్టర్ యజమానులకు ఇసుకను ఇవ్వాల్సి ఉంది. కానీ సంబంధించిన ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షణ ఉండటం లేదు. పంచాయితీ రశీదు పుస్తకం సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీంతో పంచాయితీ ఆదాయానికి భారీగా గంఢీ కొడుతున్నట్లు వినిపిస్తోంది. పంచాయితీ ఆదాయానికి గంఢీ పడుతుందని కొందరు స్థానికులు అడ్డుకొనగా అధికార బలంతో పోలీసులతో కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు స్థానికంగా వినిపిస్తోంది. అధికారులను సైతం ర్యాంపు వైపు కన్నెత్తి చూడకుండా ఓ చోటా నాయకుడు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పేరు చెప్పి హడలెత్తిస్తున్నట్లు సమాచారం. స్థానికులు కొందరు అక్రమ ఇసుక రవాణా పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి.

పంచాయితీ అధికారులకు సదరు చోటా నాయకుడు “ఉన్నతాధికారుల నుండి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం, అధికార పార్టీకి చెందిన వాళ్ళం మా మాట వినని అధికారి ఎవరు” అంటూ భరోసా ఇస్తున్నట్లు సమాచారం. మా అక్రమ వ్యాపారానికి అడ్డువస్తే ఎంతటి వారినైనా అంతుచూస్తాం అది అధికారియైనా… విలేకరులు అయినా… ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. ఈ వ్యాఖ్యలతో స్థానికంగా అధికార పార్టీకి మచ్చ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఎలాంటి అవినీతిని సహించని స్థానిక ఎమ్మెల్యే జరుగుతున్న అక్రమం పై అధికారుల చేత విచారణ చేపడుతారా లేదా అని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. ఇప్పటికైనా అక్రమంగా తరలుతున్న ఇసుకపై స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు దృష్టి సారించి పంచాయితీ ఆదాయాన్ని పెంచి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments