Home భద్రాద్రి కొత్తగూడెం గంజాయి మయం

గంజాయి మయం

Illegal Transports Cannabis in Badradri District
మన తెలంగాణ/భద్రాచలం : తెలంగాణ రాష్ట్ర సరిహద్దున ఉన్న ఏఓబి(ఆంధ్రా – ఒడిస్సా బోర్డర్) లో గంజాయి వనాలు ఉన్నాయి. అక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ సాగుకు అనువైన ప్రదేశం కావడంతో పెద్దఎత్తున సాగు చేయిస్తున్నారు. అక్కడి గిరిజనులు గుట్టల మధ్యలో, ఇతర పంటల్లో అంతర సాగుగా, చెట్ల క్రింది, ఇంటి ఆవరణలో గల పెరడ్లో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయేందుకు దళారీ వ్యవస్థ దశలవారీగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే అసలైన వారు ఎక్కడుంటారో… ఎవరికీ తెలీదు. మధ్య వర్తులు మాత్రం తరలించుకుపోతుంటారు, ఏదైనా విషమ పరిస్థితి ఎదురైతే సమిదలయ్యేది క్రింది స్థాయిలో కూలీకి పనిచేసేవారే. గత రెండు మాసాలుగా భద్రాచలంలో సుమారు రూ.70 లక్షల విలువైన గంజాయితో పాటు సరఫరా చేసే వాహనాలను సైతం పట్టుకున్నారు. తాజాగా సోమవారం స్థానిక బ్రిడ్జీ సెంటర్లో కారులో తరిలించుకుపోతున్న గంజాయిని పోలీసులు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మాటు వేసి పట్టుకుని స్వాదీనం చేసుకున్నారు. గత నెలన్నర క్రితం ఖమ్మం నగరంలోని ఓ నివాస గృహంలో 194 కేజీల గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. దీనిని బట్టి చూస్తే భద్రాచలం మీదుగా వెళ్లే గంజాయికి ఖమ్మం పట్టణంలోనే స్టాక్ పాయింట్ ఉన్నట్లు అంతా భావిస్తున్నారు. రవాణాకు రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలు విరివిగా అందుబాటులో ఉండటం, హైదరాబాద్,విజయవాడ వంటి నగరాలకు 2 నుండి 4 గంటల వ్యవధిగల ప్రయాణం మాత్రమే ఉండటం, పట్టుబడే మార్గం అత్యంత తక్కుతవగా ఉండటంతో ఇక్కడి నుండి ఎగుమతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఎల్లలు దాటుతూ : రాష్ట్ర సరిహద్దున ఒడిస్సాలో పండించే గంజాయిని భద్రాచలం మీదుగా, మరో ప్రక్క పాపికొండల నుండి రాజమండ్రి వైపుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అనునిత్యం వేలాది కేజీల గంజాయి భద్రాచలం మీదుగా తరలిపోతున్నట్లు తెలుస్తోంది. అనుకోని సందర్భాల్లో మాత్రం తరలించుకుపోతున్న వాహనాలు పట్టుబడి పోతున్నాయి. సమీప నగరాలకు చేరుకున్న తర్వాత ముంబాయ్, చెన్నై లలో అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కేజి రూ.15 వందల నుండి రూ.2 వేలకు కొని ఇతర ప్రాంతాల్లో రూ.7 వేల వరకు అమ్ముతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భలే తెలివి : రెండు కేజీల ప్యాకెట్లే కాకుండా విలైన అన్ని రకాలుగా కూడా గంజాయి సరఫరా చేస్తున్నారు. నూతన తరహాలో కొద్ది మొత్తాల్లో కావాల్సిన గంజాయి ప్రియులకు బాల్స్, జేమ్స్ చాక్లెట్స్ బాల్స్, ఐస్‌క్రీమ్ కిట్స్, షూస్, మూతలు వేసి ఉండే ఇతర వస్తువులు పప్పీ,మంకీ, డాక్ వంటి బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మల్లో పెట్టి సలువుకు అందిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గత రెండేళ్ల క్రితం ఖమ్మం నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ మెట్లపై ఆటవస్తుల్లో గంజాయి లభ్యమైంది. అదేవిధంగా గత కొంత కా లం క్రితం హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో పూలకుండీల్లో గంజాయి మొక్కలు పెంచి దొరికిపోయారు, అదేవిధంగా పలువురు ప్రముఖులు సైతం గంజాయి కేసుల్లో ఇరుకున్న సందర్భాలు లేకపోలేదు. దట్టమైన అటవీ ప్రాంతమైన ఒడిస్సాలో సాగుయ్యే గంజాయికి అధిక ధర పలుకుతుండటంతో స్మగ్లర్లు ఇక్కడ్నుంచి తరిలించుకుపోయేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంటారు. కానీ ఎన్నిసార్లు దొరికినప్పటికీ ఈ అక్రమ వ్యాపారం ఆగడం లేదు.
అరికట్టరేమి? : గంజాయి సాగు చేసే ప్రాంతం పూర్తి అటవీ ప్రాంతం కావడంతో అక్కడికి వెల్లేందుకు ఏ అధికారులు కూడా సాహసం చేయడం లేదు. మావోయిస్టులు ప్రాభల్యం సైతం ఉన్న కారణంగా అధికారులు జంకుతుంటారు. దీనిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయలేక పోవడంతో యువత క్రమక్రమంగా గంజాయి మత్తులో తూలుతున్నారు. భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం వంటి ప్రాంతాల్లో గంజాయికి బానిసలైన యువతు ఊరి శివారుల్లో గంజాయి మత్తు కోసం అర్రులు చాస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు ఫలానా సమయాన్ని ఎంచుకుని కావాల్సిన వారికి గంజాయిని సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు అనుమానిస్తున్నారు. పలువురు యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నట్లు పలు సర్వే ల్లో వెల్లడైంది. ఇప్పటికైనా గంజాయిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.