Home సినిమా వెంటాడుతున్న సెక్స్ రాకెట్

వెంటాడుతున్న సెక్స్ రాకెట్

అమెరికా వెళ్తున్న టాలీవుడ్ నటీమణులకు ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు
గంటల తరబడి విచారణ
ఆదివారం నాటి అనుభవం చెప్పిన మెహిరిన్

Tollywood

మన తెలంగాణ/ హైదరాబాద్: చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు ఇప్పుడు అమెరికా కు వెళ్లాలంటే జంకుతున్నారు. అమెరికాలో కలకలం రేపిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ నేపథ్యంలో భారతదేశం నుంచి ఏ నటీమణి అక్కడికి వెళ్లినా వారిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ కేసుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు భయం తో వణికి
పోతున్నారు. ఇప్పటికే అమెరికాకు వెళ్లిన కొందరు సినీ తారలకు చేదు అనుభవం ఎదురైంది. సెక్స్ రాకేట్‌కు సంబంధించి అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు సుమారు ఐదారు గంటల పాటు విచారిస్తున్నారు. తాజాగా ఆదివారం మెహ్రీన్‌తో పాటు మరో ఆరు మంది సినీ తారలకు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మెహ్రీన్‌ను అమెరికా విమానాశ్రయంలో సుమారు అరగంట సేపు అధికారులు విచారించారు.

తన తల్లిదండ్రులను కలిసేందుకు కెనడాలోని వాంకూవర్ నుంచి అమెరికాకు వెళ్తుండగా, అమెరికాలోని విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను ఆపేశారని మెహ్రీన్ తెలిపింది. తాను టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసుకున్న అధికారులు అరగంట సేపు ప్రశ్నించారని తెలిపింది. సెక్స్ రాకెట్‌కు సంబంధించి తనను ప్రశ్నించారని..తాను షాక్‌కు గురయ్యానని వివరించింది. టాలీవుడ్ నిర్మాత అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడనే విషయం తనకు ఇంత వరకు తెలియదని స్పష్టం చేసింది. ఈ విషయం ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పాకే తనకు తెలిసిందని వెల్లడించింది. మరో ముగ్గురు హీరోయిన్లను కూడా దాదాపు ఆరు గంటల సేపు విచారించినట్లు తెలుస్తోంది.

అయితే వారి పేర్లు మాత్రం బయటికి రాలేదు. ఎన్‌ఆర్‌ఐ కిషన్ తన భార్య చంద్రకళతో కలిసి టాలీవుడ్‌కు చెందిన నటీమణులతో అమెరికాలో వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ సెక్స్ రాకెట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఐదుగురు హీరోయిన్‌లు ఉన్నారని అక్కడి పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి సమయంలో హీరోయినులు అమెరికాకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ సెక్స్ రాకెట్ గురించే ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రశ్నిస్తుండడంతో జంకుతున్నారు. ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే అమెరికా వెళ్తున్నారు. లేదంటే తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. కిషన్ దంపతులు సాంస్కృతిక కార్యాకలాపాల పేరుతో విసాలు మంజూరు చేయించి నటీమణులను అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిన సినీ తారల విసాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.