Home దునియా రోగనిరోధకశక్తిని పెంచడంలో ముందుంటుంది..

రోగనిరోధకశక్తిని పెంచడంలో ముందుంటుంది..

యాపిల్ సీజన్ ఇది. మార్కెట్లో ఎక్కడ చూసినా ఎర్రగా యాపిల్స్ నోరూరిస్తున్నాయి. ఖరీదు కాస్త ఎక్కువైనా వీటిలోని పోషక విలువలు ఎన్నో ఎన్నెన్నో.  రోజుకొక యాపిల్ తింటే డాక్టర్లకు దూరంగా ఉండొచ్చంటారు. ముమ్మాటికీ నిజమే. శీతాకాలం అనగానే వైరల్ ఇన్‌ఫెక్షన్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జ్వరాల బారిన పడుతుంటారు. యాపిల్ తినడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. యాపిల్ తినడం వల్ల ఎన్ని విధాలుగా ఉపయోగాలున్నాయో ఓ సారి చూద్దాం..  

Apple

యాపిల్‌లో ఇనుము, ఫాస్పరస్‌లు అధికం. రోజుకు రెండు యాపిల్స్ తింటే మల బద్ధకం సాఫీగా జరుగుతుంది. విరేచనాలవుతున్నప్పుడు ఉడికించిన యాపిల్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆపిల్ తింటే సరిపోతుంది. యాపిల్‌ని మెత్తని గుజ్జుగా చేసి, దాల్చిన చెక్కపొడి, తేనెను కలిపి తీసుకోవాలి. యాపిల్ ముక్కలకు 1 టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా నువ్వుల పొడిని కలిపి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి నివారణి కూడా. బాగా పండిన ఆపిల్‌పై పొట్టు తొలగించి, కొద్దిగా ఉప్పువేసి ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తల నొప్పులు తగ్గుతాయి. ఈ పద్ధతిని కనీసం రెండు మూడు వారాలు పాటించాలి.

 Immunity Power Increased with Apple

అధిక రక్తపోటు రాకుండా.. రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి ఆపిల్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. పొటాషియం అధిక మొత్తాల్లో ఉండడం వల్ల మూత్రం ఎక్కువగా తయారై వెలుపలకు విసర్జితమవుతుంది. అలాగే సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గడానికి కారణమవుతుంది.
కీళ్లనొప్పులు రాకుండాః గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాపులతో కూడిన కీళ్ల నొప్పులకి ఇది ఎంతోగానో తోడ్పడుతుంది. ఈ పండులో ఉండే మ్యాలిక్ యాసిడ్, గౌట్ వ్యాధిలో పెరిగే యూరిక్ యాసిడ్‌ని ఆపి నొప్పులను దూరం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. యాపిల్స్‌ని ఉడికించి పేస్టు లాగా చేసి పై పూతగా రుద్దితే నొప్పులను లాగేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

పొడిదగ్గు: పొడి దగ్గుకి తియ్యటి యాపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకు ఒక యాపిల్ చొప్పున తీసుకుంటే బలహీనత కారణంగా వచ్చే పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

కిడ్నీలో స్టోన్స్: కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు యాపిల్స్ తినడం మంచి ఫలితం ఉంటుంది.

More Health Benefits with Apple

కంటి సమస్యలు: కళ్ల కలకలు, కంటి ఎరుపులూ ఉన్నప్పుడు ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. జ్యూస్‌గా తీసుకుంటే చాలా మంచిది. జ్యూస్ తయారీకి, ముందుగా ఒక పాన్‌లో నీళ్ళు పోసి, అందులో ముక్కలుగా చేసిన యాపిల్‌ని వేసి ఉడికే వరకు ఉంచి, దించేయాలి. మిశ్రమం చల్లబడిన తర్వాత వడపోసి, అందులో తేనె కలిపి తీసుకోవాలి. బాగా పండిన యాపిల్‌ని కళ్లమీద పట్టువేయడానికి ఉపయోగించవచ్చు. కంటి మంటల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

దంత సమస్యలు: ఆపిల్స్‌లో దంతాలు పుచ్చిపోకుండా, నియంత్రించే రసాయనాలు ఉన్నాయి. యాపిల్‌ను నిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆహారం తీసుకున్న యాపిల్‌ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే యాసిడ్స్ వల్ల ‘లాలాజలం’ స్రవించి సహజమైన రీతిలో బ్యాక్టీరియాను నిర్వీర్యం చేస్తుంది. ఏ ఇతర పండులోనూ లేని అద్భుత గుణమిది.  ఇటీవల చేసిన సర్వే ప్రకారం రెడ్ ఆపిల్‌లో ఉండే క్వర్సెటిన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.  ఆపిల్ తినని మహిళలతో పోలిస్తే ప్రతి రోజు ఒక ఆపిల్ తినే మహిళల్లో 28 శాతం తక్కువగా టైప్ 2 మధుమేహం వస్తుందని ఒక సర్వేలో వైల్లడైంది.

Green-Apple