Home మెదక్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

 Implementation of the guarantees given to journalists
జోగిపేటః జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వేంటనే అమలు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణుప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఫైసల్‌ ఆహ్మద్‌లు డిమాండ్ చేశారు. శనివారం అందోల్ విశ్రాంతి భవనంలో వారు జర్నలిస్టుల గర్జన (మే 28న ఛలో హైదరాబాద్)కు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలు కానీ, సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించిన హామీలుగాని ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక పక్క ఉద్యోగ ధర్మన్ని, మరోపక్క ఉద్యమ కర్తవ్యాన్ని మోసి రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించింది జర్నలిస్టులమేనని వారు గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం గతం నుండి జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలను సైతం కొన్ని నిబంధనల పేరుతో పొందకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు,హెల్త్‌కార్డులు, అక్రెడిటేషన్లతో పాటు తమ హక్కుల సాధన కోసం టీయూడబ్లూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులందరూ పోరుబాట పట్టాలని వారు పిలుపునిచ్చారు.
జర్నలిస్టుల గర్జనను విజయవంతం చేయండి
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ పథకాలను ఆగం చేసేందుకు చేపడుతున్న చర్యలను ప్రతి జర్నలిస్టు ప్రతిఘటించాలని టియూడబ్లూజే జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి జర్నలిస్టుల సమస్యలను తెలుపేందుకు టియూడబ్లూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఈ నెల 28న హైదరాబాద్‌లో జర్నలిస్టుల గర్జన నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కొరారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఎస్.వెంకట్‌రెడ్డి, అందోలు తాలూకా జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భూమయ్య, యాదగిరి, జిల్లా నాయకులు రాజశేఖర్, ప్రభు, అంజనేయులుతో పాటు తాలూకా పరిధిలోని వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.