Home కెరీర్ ఇంటర్వ్యూలో ఇవీ ముఖ్యమే!

ఇంటర్వ్యూలో ఇవీ ముఖ్యమే!

lf
ఉద్యోగానికి తగిన లక్షణాలు అభ్యర్థుల్లో ఉన్నాయో లేదో పరీక్షించడం ఇంటర్వ్యూ ఉద్దేశం. ఈ లక్ష్యంతోనే సర్వీస్ కమిషన్లూ, ఇతర నియామక సంస్థలూ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఏ అంశాలపై పట్టు సాధించాలి?మౌఖిక పరీక్షలో పరిశీలించే వాటిలో ప్రధానంగా ఏడు అంశాలుంటాయి.
పరిజ్ఞాన పరీక్ష కాదు
సాధారణంగా ఇంటర్వ్యూ అనగానే మళ్లీ పుస్తకాలు ముందేసుకుని చదివేవారి సంఖ్యే అధికం. నిజానికి పరిజ్ఞాన పరీక్షలో గట్టెక్కారు కాబట్టే ఇంటర్వ్యూ దశలోకి ప్రవేశించారు. అందువల్ల అభ్యర్థి పరిజ్ఞాన పరిశీలనకు ప్రాధాన్యం ఉండదు. అయితే ఇంటర్వ్యూ బోర్డు ముందుండే ఆ పది నిమిషాల్లో అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులు ఉద్యోగానికి కావాల్సిన లక్షణాలు అభ్యర్థిలో ఉన్నాయో లేదో సులువుగానే నిర్ధారించగలుగుతారు. అందువల్ల అభ్యర్థి తన మూర్తిమత్వ, వ్యక్తిత్వ లక్షణాలను మెరుగుపరచుకుని ప్రదర్శించడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.
బహిర్గత లక్షణాలు
పైకి కనిపించే కొన్ని లక్షణాల ద్వారా బోర్డు ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది. ఉద్యోగం పొందిన తరువాత అభ్యర్థి సమాజంలో ఏవిధంగా ఒక ఆదర్శనీయమైన వ్యక్తిగా నిలబడతాడనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రశ్నలు వేస్తుంది. అందులో భాగంగానే దుస్తులు, కేశాలంకరణ, శుభ్రత, నగలు ఇతరత్రా వస్తువులతోపాటు చెప్పులు మొదలైన అంశాలను క్షణాల్లోనే బోర్డు పరిశీలించగలుగుతుంది.
కమ్యూనికేషన్ అంశాలు
ప్రభుత్వ ఉద్యోగిగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య ప్రసార వారధిగా ఉద్యోగవ్యవస్థ ఉంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఉద్యోగి బాధ్యత. అలాగే ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం మరో విషయం. ఈ అంశాలను పరిశీలించడానికి ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థి చెప్పే సమాధానాలపై ఆధారపడుతుంది. సమాధానం చెప్పే పద్ధతి, స్వరంలో హెచ్చుతగ్గులు, ముఖ కవళికల తీరు, సంబోధన క్రమం లాంటివి దృష్టిలో పెట్టుకుని బోర్డు సభ్యులు నిర్ణయానికి రాగలుగుతారు.
వ్యక్తిత్వ లక్షణాలు
అభ్యర్థి ముఖకవళికలు, శారీరక కదలికలతోపాటు సంభాషణ అంశాలు కూడా మూర్తిమత్వ లక్షణాలను వ్యక్తపరుస్తాయి. చెబుతున్న సమాధానాల్లో కచ్చితత్వం, చెప్పే విషయంలో పారదర్శకత, తప్పుని ఒప్పుకోగల తత్వం, వివిధ సామాజిక, వ్యక్తిగత విషయాలపట్ల సానుకూల, వ్యతిరేక ధోరణులు, వాద ప్రతివాదనలు, చర్చించే అంశాల లోతు, పరిధి అభ్యర్థి మూర్తిమత్వ లక్షణాలను తెలియజేస్తాయి. అందువల్ల అనుభవజ్ఞులైన వ్యక్తుల ద్వారా తమ లక్షణాలను పరిశీలింపజేసుకుని, లోపాల సవరణ చేసుకోవాలి.
శరీర భాష
రాష్ట్రస్థాయి సర్వీస్ కమిషన్లలో ప్రత్యేకంగా శరీరభాష పరిశీలనకు ఎవరూ ఉండరు. కానీ అభ్యర్థి ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించిన క్షణం నుంచి వెళ్లిపోయేవరకూ శరీర కదలికలూ, ముఖ కవళికలూ కచ్చితంగా అభ్యర్థిపై ఒక అభిప్రాయం ఏర్పరిచేందుకు దోహదపడతాయి. అందువల్ల ఏవి సరైనవో, ఏవి కాదో ముందుగానే గుర్తించుకుని, సరిదిద్దుకోవాలి.
బయోడేటాపై పట్టు
ఇంటర్వ్యూలో మొదటి రెండు నుంచి మూడు నిమిషాలు అభ్యర్థి బయోడేటా సంబంధిత అంశాలపైనే ప్రశ్నలుంటాయి. ఈ కొద్ది సమయంలో అభ్యర్థి తన బయోడేటా అంశాల ద్వారా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచగలిగితే తొలి అభిప్రాయం సానుకూలమయ్యే అవకాశముంది. అభ్యర్థికి కూడా బెరుకు, బిడియం లాంటివి తగ్గుతాయి. ఫలితంగా తర్వాత ఇంటర్వ్యూ బాగా జరిగే వీలుంది.