Home అంతర్జాతీయ వార్తలు పాక్ నూతన ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ఎన్నిక

పాక్ నూతన ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ఎన్నిక

నేడు ప్రమాణస్వీకారం

Imrankhan

ఇస్లామాబాద్: రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ నూతన ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌లో ఇటీవల ఏకపక్షంగా జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రముఖ రాజకీయవేత్త షాబాజ్ షరీఫ్‌ను ఓడించారు. పాక్ ప్రధాని పదవికి ఇమ్రాన్ ఖాన్ ఎంపిక కేవలం లాంఛనంగా జరిగింది. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో పాకిస్థాన్ పీపుల్ పార్టీ (పిపిపి) షరీఫ్ అభ్యర్థిత్వంపై విభేదించి ఓటింగ్ నుంచి గైర్హా జరు అయింది. పాకిస్థాన్ 22వ ప్రధానిగా నేడు ఇమ్రాన్ ఖాన్ పదవీ ప్రమాణం చేస్తారు.

పార్లమెంటులోని దిగువ సభలో మొత్తం 342 సభ్యులుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 172 ఓట్లు కావాలి. ప్రధాని ఓటింగ్ వివిధ గ్యాలరీల్లో సభ్యుల విభజన ద్వారా ఓటింగ్ బహిరంగంగానే జరిగింది. ఓటింగ్ జరిగేప్పుడు పిపిపి శాసనసభ్యులు తమ సీట్లలోనే కూర్చుండిపోగా, జమాత్‌ఇఇస్లామీ ఓటింగ్‌లో పాల్గొన లేదు. ఓటింగ్ నుంచి గైర్హాజరు కావొద్దని బిలావల్ భుట్టో జర్దారీని షాబాజ్ షరీఫ్ కోరినప్పటికీ ఆయన తనను మన్నించమని తప్పుకున్నారు. ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు చిన్నాచితక పార్టీల మద్దతు లభించింది. సమావేశానికి ముందు ఇమ్రాన్ ఖాన్, షాబాజ్ షరీఫ్ కరచాలనం చేసి ఒకరినొకరు గ్రీట్ చేశారు.