Home ఎడిటోరియల్ పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్

పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్

Imran Khan is pakistan captain

భారతదేశంతో మా సంబంధాలు మెరుగుపరచుకోడానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఒక అడుగు ముందుకు వేస్తే మేం రెండడుగులు ముందుకు వేస్తాం. ఇవి పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలు. కశ్మీరు సమస్యతో సహా అన్ని సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని, కూర్చుని మాట్లాడుకోవాలని, ఒక క్రికెటరుగా తనకు యావత్తు భారత ఉపఖండంలో అన్ని దేశాల ప్రజల గురించి అవగాహన ఉందని, భారత పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే దక్షిణాసియాలో అన్ని దేశాలకు మేలు కలుగుతుందని, వాణి జ్యం, ఆర్థికవ్యవస్థలు మెరుగవుతాయని చెప్పారు. కాని నిజంగా పాకిస్తాన్ మారుతుందా. పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పదవిలోకి వచ్చిన ఉగ్రవాదంపై అదుపు సాధిస్తారా? సైన్యాన్ని నియంత్రించగలరా? మానవహక్కులను రక్షించగలరా? కశ్మీరులో చొరబాట్లు ఆగుతాయా? నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనలు జరగవా? ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలు. నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ కోర్టు అవినీతి కుంభకోణంలో జైలుశిక్ష విధించడం తదితర పరిణామాల తర్వాత ఇమ్రాన్ ఖాన్ గెలుపు తథ్యమని చాలా మంది ముందే ఊహించారు. ఇమ్రాన్ ఖాన్ గెలుపు వెనుక పాకిస్తాన్ సైన్యమే పావులు కదిపిందని, పాకిస్తాన్ సైన్యం ఆశీస్సులతోనే ఇమ్రాన్ ఖాన్ గెలిచాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంతో ఇమ్రాన్ ఖాన్ ఎలా వ్యవహరిస్తాడన్న విషయమై పెద్ద ఆశలేమీ లేవనిపిస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ గతంలో అఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించారు. అమెరికాకు ఈ విషయమై మద్దతివ్వరాదని ర్యాలీలు తీశారు. అప్పట్లో తాలిబాన్లకు మద్దతుగా గట్టిగా వాదించిన నాయకుడు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాలిబాన్లు చర్చలకు సిద్ధమైనప్పుడు తమ ప్రతినిధిగా ఇమ్రాన్ ఖాన్ పేరునే ప్రతిపాదించారన్నది కూడా గుర్తుంచుకోవాలి. మాజీ ప్రధాని నవాజ్ షరీప్‌ను తీవ్రంగా విమర్శించిన నాయకుడు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ సైన్యం నవాజ్ షరీఫ్‌ను తొలగించాలని అనుకున్నప్పుడు వారికి అవసరమైన సాధనంగా ఇమ్రాన్ ఖాన్ దొరికాడని పలువురు భావిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ వ్యవహారాల్లో సైన్యం పాత్రను పరిమితం చేయడానికి ప్రయత్నించి సైనికాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వ్యూహాన్ని సైన్యమే రచించింది. కఠినమైన చట్టాలు కావాలని కోరే తహ్రీకె లబ్బైక్ దాంతో పాటు లష్కరె తయ్యిబ, లష్కరె జాంగ్వీ వంటి సంస్థలు పాకిస్తాన్ లో చురుకుగా పనిచేయడం ప్రారంభించాయి. హర్కతుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఫజలుర్రహ్మాన్ ఖలీల్ వంటి వారు కూడా ఇమ్రాన్ ఖాన్ కు మద్దతిచ్చారన్నది గమనించాలి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని నయా పాకిస్తాన్‌గా తయారు చేస్తానని అంటున్నప్పటికీ ఆయన వెనుక మద్దతుగా ఉన్న శక్తులను చూస్తే అనుమానాలు అధికమవుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు పాకిస్తాన్‌ని మార్చేస్తానని రాజకీయాల్లోకి వచ్చాడు. కాని పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్‌ని మార్చేసి ప్రధాని చేసేసింది. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న ఇమ్రాన్ ఖాన్ 2011లో జీవిత చరిత్ర రాసుకున్నాడు. ఆ పుస్తకం పేరు “పాకిస్తాన్ ఏ పర్సనల్ హిస్టరీ”. మతనింద విషయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పాకిస్తానీ సెనెటర్ సల్మాన్ తసీర్ హత్యను ఆ పుస్తకంలో ఖండించాడు. తసీర్ ధర్మనిందపై కఠిన చట్టాలను వ్యతిరేకించిన నాయకుడు. తసీర్‌ని చంపిన ఖాద్రీ అనే బాడీగార్డు పాకిస్తాన్‌లో హీరో అయిపోయాడు. పాకిస్తాన్‌లో కొత్త పార్టీ తహ్రీకె లబ్బైక్ పుట్టుకొచ్చింది. అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ ఈ మతపెద్దలను తీవ్రంగా విమర్శించాడు. 2013 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తహ్రీకె ఇన్సాఫ్ పార్టీ కేవలం మూడోస్థానంలో ఉంది. కాని తర్వాత ఇమ్రాన్ ఖాన్ వైఖరిలో మార్పు వచ్చింది. ఛాందసవాదుల వైపు మొగ్గు చూపడం ప్రారంభమైంది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాకిస్తాన్‌ను ఇస్లామిక్ వెల్ఫేర్ స్టేట్ గా మారుస్తానని అంటున్నాడు. ఇప్పుడు ఆయనకు మరోపేరు తాలిబాన్ ఖాన్. క్రికెటరుగా అత్యంత ప్రతిభాసంపన్నుడైన క్రీడాకారుడు.

18 సంవత్సరాల వయసులో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. లండనులో ఉండేవాడు. ప్లేబాయ్‌గా పేరు పొందాడు. 1971లో ఇంగ్లాండుపై మొదటి మ్యాచ్ ఆడాడు. మూడే ళ్ళ తర్వాత మొదటి వన్ డే ఆడాడు. ఫాస్ట్ బౌలరుగా అద్భుతమైన ప్రతిభ చూపించాడు. 1982లో కేవలం 9 టెస్టుల్లో 62 వికెట్లు సాధించాడు. యావరేజి కేవలం 13.29 పరుగులు మాత్రమే. 1983లో టెస్టు బౌలింగ్ రేటింగుల్లో 922 పాయింట్లతో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్‌లో గొప్ప ఆల్ రౌండర్లలో ఇమ్రాన్ ఖాన్ పేరు తప్పక చెప్పుకోవాలి. 75 టెస్టుల్లో 3000 పరుగులు 300 వికెట్లు సాధించాడు. టెస్టుల్లో 61.86 బ్యాటింగ్ యావరేజి. 1992లో శ్రీలంకతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. 1992లో వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగింది. ఇంగ్లాండుపై అద్భుతమైన విజయాన్ని కెప్టెనుగా సాధించిపెట్టాడు. అప్పటికే ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు. 1990లోనే రాజకీయాల్లోకి వచ్చాడు. వరల్డ్ కప్ విజయం తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా రిటైరయ్యాడు. మొత్తం 88 టెస్టు మ్యాచులు, 126 ఇన్నింగులు, 3807 పరుగులు, ఆరు సెంచరీలు, 15 అర్థశతకాలు, బౌలరుగా 362 టెస్టు వికెట్లు, 175 వన్ డే మ్యాచులు, 3709 పరుగులు, యావరేజ్ 33.41 పరుగులు, బౌలింగులో కేవలం 14 పరుగులకే 6 వికెట్లు. అందుకే ఆయనకు భారతదేశంలోను అభిమానులు ఉన్నారు. ఆయన క్రికెట్ కెరీర్ చాలా గొప్పదే. కాని రాజకీయాల్లో ఆ గొప్పదనం నిలబెట్టుకుంటాడా?

ఒకప్పుడు మతనిందపై కఠిన చట్టాలను వ్యతిరేకించిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా మతనింద తీవ్రమైన నేరం అంటున్నాడు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడే ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదులపై దాడులను ఖండిస్తున్నాడు. అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను సమర్థిస్తున్నాడు. పాకిస్తాన్ లో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభ పరిస్థితి, ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్సు నిఘాలో ఉండడం వంటి కారణాలు సైన్యం వైఖరిని మార్చుతాయా? పాకిస్తాన్ ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సహకారం అవసరం. ఈ ఆర్ధిక సహాయానికి కఠినమైన ఆంక్షలకు ఒప్పుకోక తప్పదు. పైగా అమెరికాతో సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. అమెరికా సహాయం ఇప్పు డు లేదు. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా అమెరికా విషయంలో తీవ్రమైన విమర్శలు సంధించి ఉన్నాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సైన్యాన్ని, ఛాందసవాదులను ఇమ్రాన్ ఖాన్ అదుపు చేసే అవకాశాలున్నాయి.

టెర్రరిజం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వప్రమాణాలను అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్రంగా విమర్శించాడు. కాబట్టి పాకిస్తాన్ ట్రాక్ రికార్డును చక్కదిద్దే ప్రయత్నాలు ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించక తప్ప దు. మరోవైపు అమెరికా కూడా అఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లతో చర్చించాలని భావిస్తోంది. తాలిబాన్ ఖాన్ బహుశా ఈ విషయంలో కూడా చొరవ తీసుకోవచ్చు. కాని ఇవన్నీ కేవలం ఊహాగానాలే. ఇమ్రాన్ ఖా న్ ఇప్పటి వరకు కేవలం కొన్ని మాటలు మాత్రమే చెప్పారు కాని స్పష్టమైన శాంతి సందేశాలేవీ లేవు. శాంతి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండడుగులు ముందుకు వేస్తానని సెంటిమెంట్ మాటలు చెప్పారు. దాంతో పాటు అసలు సమస్య కశ్మీరును కూడా ప్రస్తావించాడు. భారతదేశం కశ్మీరును అసలు సమస్యగా గుర్తించడం లేదు. కశ్మీరులో పాకిస్తాన్ ఊతంతో కొనసాగుతున్న టెర్రరిజాన్ని అసలు సమస్యగా చెబుతోంది. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ వచ్చినా పాకిస్తాన్ ధోర ణి మారేలా కనబడడం లేదు.

                                                                                                                                                   – ఎస్.ఇందుప్రియ