Home అంతర్జాతీయ వార్తలు 18న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం

18న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం

Imran-Khan

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎన్నికల్లో ఇటీవల ఎన్నికైన పాకిస్థాన్ తెహ్రీక్‌ఎఇనాఫ్(పిటిఐ) నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధానిగా ఆగస్టు 18న (శనివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీకి చెందిన సెనెటర్ ఫైసల్ జావేద్ ట్వీట్ చేశారు. ప్రమాణస్వీకారానికి భారత మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్, నవజోత్ సింగ్ సిధు, సునీల్ గవాస్కర్‌లను ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు. అధ్యక్షుడు మామూన్ హుస్సేన్ ఆగస్టు 13న జాతీయ అసెంబ్లీని పిలిచిన నేపథ్యంలో ఫైజల్ ఈ ట్వీట్ చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అదే రోజున ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా పిటిఐ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఇమ్రాన్ ఖాన్ పేరును అధికారికంగా ప్రకటించింది. పాక్ జాతీయ అసెంబ్లీకి జూలై 25న జరిగిన ఎన్నికల్లో పిటిఐ 116 సీట్లు గెలుచుకుని దిగువ సభలో మెజారిటీ పార్టీగా ఏర్పడింది. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా శుక్రవారం పాకిస్థాన్ ప్రధాని కాబోతున్న ఇమ్రాన్‌ను కలుసుకున్నారు. గెలుపొందినందుకు అభినందనలు తెలిపారు. టీమిండియా మొత్తం ఆటగాళ్లు సంతకాలు చేసిన క్రికెట్ బ్యాట్‌ను కానుకగా ఇచ్చారు.