Home అంతర్జాతీయ వార్తలు ఒక్క యాప్ తో ఊపేశాడు!

ఒక్క యాప్ తో ఊపేశాడు!

ఇమ్రాన్ గెలుపు లోగుట్టు
ఓటర్లను ఆకట్టుకోవడం ..
ఓట్లను రాబట్టుకోవడం

Imran-Khan

ఇస్లామాబాద్ : బ్యాట్ పట్టిన క్రికెట్‌ను గడగడలాడించిన ఇమ్రాన్ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టడం ఎట్లా సాధ్యం అయింది? 5 కోట్ల మంది ఓటర్ల పూర్తి వివరాల చిట్టాతో కూడిన సిఎంస్ యాప్ పోలింగ్ మ్యాచ్‌లో ఆయనకు గెలుపు నిచ్చిందని వెల్లడైంది. పాకిస్థాన్‌లో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తికరమైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆయన బోటాబోటీ గెలుపునకు చివరికి ఒక యాప్‌ను వాడటమే కారణం అయిందని విశ్లేషిస్తున్నారు. ప్రచార దశలో ఓటర్లను అనుకూలంగా మార్చుకోవడం, ఓటేసేందుకు తరలివెళ్లేలా చేసేందుకు ఇమ్రాన్ పార్టీ వారు వాడిన అనుబంధ యాప్, వారు సేకరించుకుని పెట్టుకున్న డాటాబేస్ దోహదం చేసింది. జూలై 25 పోలింగ్‌కు ముందు వరకూ పిటిఐ పార్టీ వారు తమ ఓట్ల టెక్ బ్యాటింగ్‌ను రహస్యంగా ఉంచారు.

ప్రత్యర్థి పార్టీలకు తమ సరికొత్త యాప్ ఆధారిత ప్రచారం గురించి తెలియకుండాజాగ్రత్తలు తీసుకున్నారు. ఈ యాప్ ద్వారానే వారు సాగించిన ప్రచారం చివరికి వారిని ఎన్నికలలో అందరి కన్నా ఎక్కువ సీట్ల వైపు నడిపించింది. ఇతర పార్టీలు ఏవీ కూడా చేయలేనవి తాము చేయడం ద్వారా, ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు, ఓటింగ్ సమాచారం సకాలంలో ఇవ్వడం ద్వారా ఇమ్రాన్ పార్టీ అందరినీ ఆకట్టుకుంది. పార్టీ మద్దతుదార్లు ఓటింగ్‌కు భారీ స్థాయిలో వెళ్లేందుకు ఈ ఫోన్ యాప్ బాగా ఉపయోగపడింది. ఓ వైపు ప్రభుత్వ సొంత టెలీఫోన్ సమాచార సేవల నుంచి పోలింగ్ సంబంధిత సమాచారం సరిగ్గి లేకపోవడం, ఇదే సమయంలో పిటిఐ వారి నుంచి సమగ్ర సమాచారం అందడంతో ఎన్నికలకు ముందే ఓటర్లకు ఆ పార్టీపై భరోసాకు దారితీసింది. ఇతర పార్టీలేవీ కూడా ఈ పనిచేయలేక చతికిల పడ్డాయి. యాప్, డాటాబేస్ వాడకం గురించి పిటిఐ వారు ఐటి నిపుణుడు అమీర్ ముఘల్ సాయం తీసుకున్నారు. తాము ఎంచుకున్న టెక్నాలజీ బాగా పనిచేసిందని అమీర్ చెప్పారు. నియోజకవర్గాల వారిగా నిర్వహణా వ్యవస్థ (సిఎంఎస్) పద్థతిని పాటించి తాము ఓటర్లను పార్టీ వైపు మొగ్గు అయ్యేలా చేశామని అమీర్ వివరించారు. అసద్ ఉమర్ అనే నేతకు వ్యక్తిగత కార్యదర్శి అయిన అమీర్ అత్యంత చాకచక్యంగా సిఎంఎస్ వ్యవస్థను తీర్చిదిద్దారు. దీనితో ఇమ్రాన్ పార్టీ అభ్యర్థులు చాలా మంది కీలక స్థానాలలో గెలిచారు. అంతేకాకుండా అమీర్ బాస్ అసద్ కూడా విజయం సాధించారు. ఆయన పాకిస్థాన్‌కు తదుపరి ఆర్థిక మంత్రి కానున్నారు.

నియోజకవర్గాల స్థాయిలో ఓటర్ల వివరాలు

అమీర్‌ఖాన్ పలు బృందాలను ఏర్పాటు చేసి, నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలను సేకరించి యాప్‌లో పొందుపర్చారు. ఓటర్ల పూర్వాపరాలు, వారికి పార్టీల పట్ల ఉండే అభిప్రాయాలు, ఎందరు పిటిఐ అనుకూలురు? ఎందరు తటస్థులు? ఎందరు వ్యతిరేకులు? అనే పలు విషయాలను సమగ్రంగా తెలుసుకున్నారు. దీనితో విజయ ఘట్టం తేలిక అయింది. ముందుగా తమ పార్టీ మద్దతుదార్లు అనివార్యంగా భారీ సంఖ్యలో పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా వారిని ప్రో త్సహించారు. సెంటిమెంట్‌ను పండించారు.సాధారణం గా అయితే ఈ పని పూర్తి చేసేందుకు కనీసం వారాలు పడుతుంది. కానీ దీనిని ఈ బృందం కేవలం ఒకటి రెం డు గంటలలో చేసేశారు. ప్రత్యర్థి పార్టీలు ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపునే ఖేల్ బంద్ దుకాణ్ బంద్ తరహాలో పని కానిచ్చేశారు. దాదాపుగా అనుకున్న స్కోర్ సాధించారు.

ఎన్నికలకు ముందు పార్టీ అభ్యర్థులు అం తా సిఎంఎస్ పద్ధతిని పాటించండని ఇమ్రాన్ వాట్సాప్ సందేశంతో సూచించడంతో పనులు చకచకా సాగాయి. సిఎంఎస్‌లో భారీ స్థాయిలో ఓటర్ల పూర్తి వివరాలు చేరడంతో ఓ దశలో ఇది 2 కోట్లకు పైగా సెర్చర్‌ల దశకు పోవడంతో యాప్ దెబ్బతింటుందని ఆందోళన చెందా రు. దీనితో ఇమ్రాన్ వ్యూహకర్తలలో ఒకరు తీవ్ర స్థాయి లో స్పందించారు. సిఎంఎస్ టీంలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. సిస్టమ్ పనిచేయకపోతే , ఓటమి తప్పదని చివరికి మీరే విలన్లు అవుతారని చురకలు పెట్టారు. తరువాత సిఎంఎస్ బాగా పనిచేయడంతో ఖాన్ సన్నిహితులు యా అల్లా అంటూ సంతోషం వ్యక్తం చేశారు.