Home తాజా వార్తలు నేటి నుంచి ఆసియా క్రీడలు

నేటి నుంచి ఆసియా క్రీడలు

In Indonesia games asian continent 45 countries participating

జకార్తా: 18వ ఆసియా క్రీడలకు శనివారం తెరలేవనుంది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో ఆసియా ఖండానికి చెందిన 45 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. భారత్, దక్షిణ కొరియా, చైనా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, ఇండోనేషియా, మలేసియా, థాయిలాండ్, మంగోలియా, తజికిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, హాంకాంగ్ తదితర దేశాలు ఈ క్రీడల్లో పోటీ పడుతున్నాయి. ఇక, గతంలోలాగే ఈసారి కూడా చైనా, జపాన్, సౌత్ కొరియా, భారత్, మలేసియా, ఇండోనేషియా దేశాల మధ్య పతకాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. భారత్ బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్, ఆర్చరీ, షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్,  టెన్నిస్, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో పతకాలపై కన్నేసింది. ఈసారి కూడా షూటింగ్, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్‌లలో భారత్‌కు స్వర్ణాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

హాకీలో కూడా పురుషుల జట్టు పసిడి పతకంపై కన్నేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఈసారి కూడా స్వర్ణం గెలిచి ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తోంది. ఇక, సింధు, సైనా, శ్రీకాంత్, ప్రణయ్ తదితరులతో కూడిన బ్యాడ్మింటన్ బృందం కూడా స్వర్ణంపై ఆశలు రేకెత్తిస్తోంది. అథ్లెటిక్స్‌లోనూ భారత్‌కు భారీ ఆశలున్నాయి. ఈ క్రీడల కోసం 572 మందితో కూడిన భారీ బృందాన్ని భారత్ బరిలోకి దించింది. కాగా, శనివారం జరిగే ప్రారంభోత్సవ వేడుకల్లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా భారత బృందానికి సారథ్యం వహిస్తున్నాడు. ఈ క్రీడల్లో జాతీయ పతాకధారుడిగా చోప్రా వ్యవహరిస్తాడు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని గెలొరా బంగ్ కర్నో స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు దాదాపు 70 వేల మంది హాజరుకానున్నట్టు తెలిసింది. కాగా, క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు పూర్తి భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అంతేగాక ఏలోటు లేకుండా క్రీడలను జయప్రదం నిర్వహించేందుకు నిర్వాహకులు నడుంబిగించారు.