Search
Wednesday 14 November 2018
  • :
  • :

మెయిన్స్‌లో ప్రెజంటేషనే ప్రధానం

In Mains, candidate exams the understanding, analysis writing skills

ప్రతిష్టాత్మక సివిల్స్ మెయిన్స్ పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. ప్రిలిమినరీ పరీక్షకు ఇది పూర్తిగా భిన్నమైనది. ప్రిలిమినరీలో జ్ఞాపకశక్తి, తార్కిక చింతనలను పరీక్షిస్తే, మెయిన్స్‌లో అభ్యర్థి అవగాహన, విశ్లేషణ సామర్థ్యం, రాత నైపుణ్యాలను పరీక్షిస్తారు. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్షలకు దేశవ్యాప్తంగా 10,500 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 600 మందికి అర్హత లభించింది. ఈ పరీక్షల్లో అభ్యర్థులు దేశంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిపుణుల సూచనలు పాటిస్తూ సమగ్రంగా సంసిద్ధమై ప్రాధాన్యత క్రమంలో తమను తాము పరీక్షించుకుంటే విజయం సాధించవచ్చు.

సివిల్స్ మెయిన్స్‌లో
1 విశ్లేషణాత్మకంగా, క్లుప్తంగా సమాధానాలు
2 రైటింగ్ ప్రాక్టీసే కీలకమంటున్న నిపుణులు
3 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు పరీక్షలు

ప్రెజంటేషన్ చాలా ముఖ్యం
ప్రధాన పరీక్ష (మెయిన్స్)లో ఎక్కువ మార్కులు సాధించగలిగితే తదుపరి మౌఖిక పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ర్యాంకు సాధించవచ్చు. ఈ పరీక్షల్లో అభ్యర్థి ప్రశ్నను అర్థం చేసుకోవడమే ముఖ్యమైన అంశం. ప్రశ్నలో ఏ అంశాలు అడిగారు, మనం ఏం సమాధానం రాయాలనేది అత్యంత ప్రధానం. మరో ముఖ్యమైన అంశం రాత నైపుణ్యం. ఎంత చదివాము అన్నదాని కంటే పరీక్ష గదిలో ఇచ్చిన సమయంలో ఎంత చక్కగా ప్రెజంటేషన్ చేశామన్నది ముఖ్యం. దీనికి నమూనా ప్రశ్నలను సాధన చేయడం చాలా అవసరం. చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా, క్లుప్తంగా చెప్పడం రాతసాధన ద్వారా మాత్రమే వస్తుంది.

తక్కువ పదాలతో ఎక్కువ విషయాన్ని వ్యక్తపరిచే విధానాన్ని అలవర్చుకోవాలి. రాస్తున్న సమాధానాన్ని పేరాలుగా విభజించి, అవసరమైన చోట సబ్ హెడ్డింగులు పెట్టాలి. ఒక అంశంపై అభ్యర్థికి ఏ మేరకు లోతైన అవగాహన ఉంది. ఏయే కోణాల్లో ఆ అంశాన్ని విశ్లేషించగలుగుతున్నారు, ఆ సమస్యకు లేదా సంఘటనకు ఆచరణాత్మక పరిష్కారం చూపగలుగుతున్నారా..?లేదా..? అనే అంశాలను ఎగ్జామినర్ పరీక్షిస్తారు. కాబట్టి సమాధానాన్ని వివరణాత్మకంగా, విశ్లేషాత్మకంగా రాయాలి. మెయిన్స్‌లో ప్రామాణిక భాష(వాడుక భాష)లో సమాధానాలు రాయాలి. గ్రాంథిక భాషలో సమాధానాలు రాయకూడదు. సాంకేతిక పదాలనూ, కష్టమైన మాటలనూ ఉపయోగించకూడదు.

తొమ్మిదింటిలో ఏడు పేపర్ల మార్కులే లెక్క
సివిల్స్ మెయిన్స్‌లో మొత్తం తొమ్మిది పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఏడు పేపర్లకు సంబంధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్వూ జాబితా రూపకల్పనలో ఈ ఏడు పేపర్లలో పొందే మార్కులే కీలకం. జనరల్ ఎస్సే, మూడు జనరల్ స్టడీస్ పేపర్లు, ఎథిక్స్ అండ్ ఆప్టిట్యూడ్‌తో పాటు ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 250 మార్కుల చొప్పున మొత్తం 1750 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటితోపాటు రెండు లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి. ఇవి కేవలం అర్హత పేపర్లు మాత్రమే. అందరికీ కామన్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక పేపర్, మరొకటి ప్రాంతీయ భాషకు సంబంధించిన పేపర్ ఉంటుంది. ఈ రెండు లాంగ్వేజ్ పేపర్లలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకోరు. సాధారణంగా ఈ పరీక్షల్లో 50 శాతం నుంచి 55 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఆలిండియా టాప్ 10లో ఉంటుండగా, 45 శాతం నుంచి 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఎంపిక జాబితాలో ఉంటున్నారు.

జనరల్ ఎస్సే కీలకం
సివిల్స్ ప్రధాన పరీక్షల్లో జనరల్ ఎస్సే పేపర్ ముఖ్యమైన పేపర్. ఎందుకంటే మిగతా రెండు, మూడు పేపర్లలో అభ్యర్థులందరికీ ఒకే రకమైన మార్కులు వస్తుంటాయి. కానీ జనరల్ ఎస్సే పేపర్‌లో సాధించే మార్కులు మాత్రం వ్యత్యాసం ఉంటాయి. ఈ పేపర్‌లో జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన అంశాలు, భారతీయ సమాజంలో సామాజిక, ఆర్థిక సమస్యలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్దిపై అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఈ పేపర్‌లో అభ్యర్థి ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకుని సరైన సమాధానాన్ని విస్తృతంగా, విశ్లేషణాత్మకంగా సరళమైన, స్పష్టమైన భాషలో రాయాలి. కేవలం సమస్యను రాస్తే సరిపోదు. సమస్యతోపాటు పరిష్కా మార్గాలను కూడా చూపించాలి. ప్రతి ప్రశ్నకూ ఉపోద్ఘాతం, కంటెంట్, ముగింపు అనే విధానాన్ని అనుసరించాలి. ఎస్సే పేపర్‌లో రాణించడానికి సోషల్ సైన్సెస్‌కు సంబంధించిన కొన్ని ప్రమాణిక జర్నల్‌ను చదవడం చాలా అవసరం. సెమినార్, యోజన, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లి, ఎకనామిక్ సర్వే వంటి జర్నల్స్‌లో వివిధ సమస్యలకు సంబంధించిన నిర్థిష్టమైన విశ్లేషణలు ఉపయోగపడతాయి.

జిఎస్‌పై విస్తృత అవగాహన ఉండాలి
జనరల్ స్టడీస్‌కు సివిల్స్ అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రధాన పరీక్షల్లో మొత్తం నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. ఈ సబ్జెక్టులపై అభ్యర్థి విస్తృత అవగాహన ఏర్పరుచుకోవాలి. డిగ్రీలో సైన్స్, ఆర్ట్, ఇంజనీరింగ్, మెడిసిన్…ఇలా ఏ గ్రూప్ చదివినా జనరల్ స్టడీస్‌పై పట్టు సాధిస్తేనే సివిల్స్ మెయిన్స్‌లో రాణించగలుగుతారు. పేపర్లవారీగా సిలబస్‌కు అనుగుణంగా సిద్దం కావాలి. జనరల్ స్టడీస్ పేపర్1లో భారతదేశ చరిత్ర, వారసత్వం, సంస్కృతి సబ్జెక్టులు ఉంటాయి. అలాగే జనరల్ స్టడీస్ పేపర్2లో రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, జనరల్ స్టడీస్ పేపర్3లో సైన్స్ అండ్ టెక్నాలజి, అంతర్జాతీయ సంబంధాలు, పర్యావరణం, సుస్థిర అభివృద్ది అంశాలు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ సంబంధిత అంశాలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున 1000 మార్కులు ఉన్నాయి.

ఆప్షనల్స్‌ను లోతుగా అధ్యయనం చేయాలి
అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌లో రెండు పేపర్లకు లోతైన అధ్యయనం అవసరం. ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ దానిని విస్తృతంగా చదవాలి. ఆయా సబ్జెక్టుల్లో ప్రధాన అంశాలు, సిద్దాంతాలు, శాస్త్రవేత్తలు తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషణాత్మకంగా రాయడం అలవరుచుకోవాలి.

పుస్తకాల ఎంపిక సరిగ్గా ఉండాలి
సివిల్స్ మెయిన్స్ సిద్దమవుతున్న అభ్యర్థులు సరైన పుస్తకాలను ఎంపిక చేసుకుని ప్రణాళికాబద్దంగా చదవాలి. ఆయా అంశాలకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలను లోతుగా అధ్యయనం చేయాలి. మార్కెట్‌లో లభించే అన్ని రకాల పుస్తకాలు చదవడం వల్ల అభ్యర్థి సమయం వృథా కావడంతో పాటు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకుని వాటినే అధ్యయనం చేయాలి. అభ్యర్థి కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ ప్రచురణ సంస్థలు వివిధ అంశాలపై విడుదల చేసే వార్షిక పుస్తకాలను, ఇండియా టుడే, యోజన, సెమినార్ వంటి ప్రామాణిక జర్నల్స్‌ను చదవాలి. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఒకటి, రెండు ఇంగ్లీష్ దినపత్రికలు, ఒకటి, రెండు ప్రాంతీయ దినపత్రికలు అధ్యయనం చేయాలి.

రాత సాధన అవసరం
పోటీ పరీక్షల్లో అభ్యర్థుల వ్యక్తిత్యాన్ని అంచనా వేయడానికి రాత పరీక్షలు నిర్వహిస్తారు. సివిల్ సర్వీసెస్ కూడా ఈ కోతకు చెందిందే. కొంతమంది అభ్యర్థులకు సివిల్స్ మెయిన్స్ సబ్జెక్టులపై ఎంత పరిజ్ఞానం ఉన్నా, పరీక్షల్లో ఏం రాశారనే దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకుని సరళమైన భాషలో స్పష్టంగా సమాధానం రాయాలి.
అభ్యర్థులు పరీక్షలకు కనీసం ఆరు నెలల ముందు నుంచి నిర్ధిష్ట సమయంలో ప్రశ్నలకు సమాధానం రాయడం ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. ఆయా పేపర్లకు సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలకు సమయపాలన పాటిస్తూ సమాధానాలు రాయాలి. ఆ సమాధానాలను ఆయా సబ్జెక్టు నిపుణులకు చూపిస్తూ ఎప్పటికప్పుడు లోపాలను సరిచేసుకుంటూ నిరంతరం రాత సాధన చేస్తుండాలి. రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా అభ్యర్థిలో సరిగ్గా రాయగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు నిర్థిష్ట సమయంలో సమాధానాన్ని నైపుణ్యం మెరుగవుతుంది. చేతిరాత కూడా మెరుగు
పడుతుంది.

సివిల్స్ మెయిన్స్ పరీక్షల టైం టేబుల్ సమయం పేపర్

28.09.2018 ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పేపర్1(జనరల్ ఎస్సే)
29.09.2018 ఉ.10 నుంచి మ.12 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్1
29.09.2018 మ.2 నుంచి సా.5 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్-2
30.09.2018 ఉ.10 నుంచి మ.12 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్-3
30.09.2018 మ.2 నుంచి సా.5 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్-4
06.10.2018 ఉ.10 నుంచి మ.12 గంటల వరకు ఇండియన్ లాంగ్వేజ్
06.10.2018 మ.2 నుంచి సా.5 గంటల వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్
07.10.2018 ఉ.10 నుంచి మ.12 గంటల వరకు ఆప్షనల్ పేపర్1
07.10.2018 మ.2 నుంచి సా.5 గంటల వరకు ఆప్షనల్ పేపర్-2

                                                                                                                                              –  ఎం.భుజగేందర్

Comments

comments