Home సినిమా ప్రైవేట్ జెట్‌లో సెట్స్‌కి!

ప్రైవేట్ జెట్‌లో సెట్స్‌కి!

Pooja

క్షణం తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అన్నీ అగ్ర హీరోల సినిమాలే. ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్‌లతో ఆమె సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్-4’ వంటి క్రేజీ మూవీలో అక్షయ్‌కుమార్ సరసన పూజ నటిస్తోంది. అయితే ఈ సినిమాలన్నీ షూటింగ్ జరుపుకుంటుండడంతో ఆమె బిజీ బిజీగా ఉంటోంది. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు హడావుడిగా పరిగెడుతోందట. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ అత్యవసర పరిస్థితి వచ్చిందట. ఓవైపు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజ ‘హౌస్‌ఫుల్-4’ సెట్స్‌కు పరిగెత్తాల్సి వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ను జైసల్మేర్ వంటి విమాన సౌకర్యం అంతగా లేని చోట చేస్తున్నారు. అక్కడికి ఒకే ఒక్క ఫ్లైట్ అందుబాటులో ఉందట. అయితే ఆ విమానం దొరకకపోవడంతో పూజాహెగ్డే హైదరాబాద్ నుంచి ఏకంగా ఓ ప్రైవేట్ జెట్‌ను బుక్ చేసుకుందట. లక్షల్లో చెల్లించి ఆ జెట్‌లో జైసల్మేర్‌లోని లోకేషన్‌కు చేరుకుందట ఈ భామ. దీంతో పూజ తన వృత్తిని ఎంతో అంకితభావంతో చేస్తోందని అంటున్నారు. అంత కమిట్‌మెంట్ ఉన్న అమ్మడు కాబట్టే ఒకేసారి నాలుగు భారీ సినిమాల్లో ఛాన్స్ అందుకుందన్న మాట.