Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సోషల్ మీడియాలో సంతన్న హోరు

photo1

 సంతోష్‌కు రాజ్యసభ సీటు ఖాయమని, ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘమని సోషల్ మీడియాలో వ్యాఖ్యల వెల్లువ   

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో గెలుపు టిఆర్‌ఎస్‌దేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆ మూడు పదవులకు పోటీచేసే అభ్యర్థులెవరనేది ఇంకా అధికారికంగా వెల్లడికాకపోయినప్పటికీ పార్టీ ఆవిర్భావం మొదలు కెసిఆర్‌కు వెన్నంటి ఉన్న జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే రాజ్యసభ సభ్యుడు కావడానికి ఆయనకున్న అర్హతేంటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. ‘కెసిఆర్‌కు ఆత్మలా వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర తెరపైన కనిపించకపోయినా పార్టీకి ఆయన చేసిన సేవ ఎలాంటిదో ఆ పార్టీ కార్యకర్తలుగా మాకందరికీ తెలుసు’ అని టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు కిషోర్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో సంతోష్‌కు అనుకూలంగా ఎన్నో పోస్టింగ్‌లను పెట్టి తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌కు నీడలా ఉన్న ఫోటోలను విస్తృత ప్రచారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర సాధనలో కెసిఆర్ రధసారధిగా ఉంటే, ఆయనకు నీడలా ఉన్న సంతోష్ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పట్టించుకోకుండా రాష్ట్రం కోసం, పార్టీ కోసం వెచ్చించారని అభిమానులు సోషల్ మీడియాలో ప్రచా రం చేస్తున్నారు. ఇంతకంటే అర్హతలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దకాలంగా పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారని, 2009లో కెసిఆర్ దీక్ష సమయంలో నీడలా నిలిచారని ఫోటోలతో సహా వివరిస్తున్నారు. కుమారుడు కాబట్టి కెటిఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించి ఉండకపోతే ‘బంగారు తెలంగాణ’ నిర్మాణంలో ఈ రోజు ఆయనను ఒక సమర్ధ నాయకుడి గా చూడగలిగేవారమా అని కిషోర్‌గౌడ్ ప్రశ్నించారు. అదే తరహాలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ కూడా భవిష్యత్తులో పార్టీ నాయకుడిగా, రాష్ట్ర అభివృద్ధిలో ఒకరిగా ఉంటారుకదా అని ప్రస్తావించారు. ఎంతో మంది సాధా రణ కార్యకర్తలు కెసిఆర్ ఉద్యమ నాయకత్వంలో నాయకులుగా ఎదిగారని, ఇప్పుడు సంతోష్ ప్రస్థానం కూడా అలాంటిదేనని వ్యాఖ్యానించారు. ఎన్నో కీలక సమయాల్లో పార్టీలో సంతోష్ పోషించిన పాత్రను మరువలేమని, పరీక్షా సమయాల్లో సైతం వెనకడుగు వేయకుండా పార్టీతో, కెసిఆర్‌తోనే కొనసాగారని ఉదహరించారు. రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ పేరు దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయనపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి టిఆర్‌ఎస్ కార్యకర్తలు, సంతోష్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ధీటైన సమాధానాలు ఇస్తున్నారు.

Comments

comments