Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రజా సమస్యల పరిష్కారంలో…ప్రభుత్వం విఫలం

ప్రజా సమస్యల పరిష్కారంలో…ప్రభుత్వం విఫలం

 

cpi

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి 

మన తెలంగాణ/ఆసిఫాబాద్ : రాష్ట్రంలో అప్రజాస్వామిక నియంతృత్వ పాలన కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా స్వామ్య హక్కులను కాలరాస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం కుమ్రం భీం జిల్లా కేంద్రంలోని సిపిఐ పోరుబాట చేరుకోవడంతో పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఉద్యమాలు,  త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి మూడు సంవత్సరాలు గడుస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. స్వరాష్ట్రంలో తమ కలలు సాకారం అవుతాయనున్న అన్ని వర్గాల ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం,సమాగ్రాభివృద్ధి ఆచరణకు నోచుకోలేదన్నారు. మూడు సంవత్సరాల పాలన పూర్తయినప్పటికి రైతుల రుణమాపీ పథకం ఇంకా పూర్తికాలేదన్నారు. రైతులకు వడ్డీభారం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. రైతులకు రాయితీలు , నష్టపోయిన పంటలకుభీమా చెల్లించడంలో జాప్యం వహిస్తున్నారని, దీంతో రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. పాఠశాల విద్యలో డ్రాప్‌అవుట్‌లు కొనసాగుతూనే ఉన్నాయని, 13 విశ్వ విద్యాలయాల్లో బోధన బోదనేతర సిబ్బంది ఖాలీలు వేల సంఖ్యలో అలాగే ఉన్నాయన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలపేరుతో ఇష్టారాజ్యంగా జీవోలను తీసుకువచ్చి రైతుల, దళితులు ,గిరిజనులు బలహీన వర్గాల ప్రజల నుండి లక్షలాది ఎకరాలు బలవంతంగా సేకరిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో పెనుభూతంగా పెరిగిపోతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినిరుద్యోగులకు నిరాశ కల్గజేశారన్నారు. దీంతో నిరుద్యోగ యువత ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో 39,42 జీవోలు తీసుకువచ్చి రైతు సమన్వయ కమిటీల పేరుతో రాష్ట్ర, జిల్లా , మండల , గ్రామ స్థాయి కమిటీలు టీఆర్‌ఎస్ కార్యకర్తలో నింపుకున్నారన్నారు. ఇతర పార్టి ప్రజా ప్రతినిధులు పరిగణలోకి తీసుకోకుండా తమ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో భూ మాఫియా, ఇసుకు మాఫియా,డ్రగ్ మాఫియా అధికార పార్టి అండదండలతో రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించే ఇందిరా పార్కు, ధర్నా చౌక్‌లు అధికార బలంతో ఎత్తివేయడం ప్రజల గొంతును నొక్కడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు ,జీఎస్‌టి విధించడం వల్ల పేద మద్య తరగతి ప్రజలు వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోయాన్నారు.
జీఎస్టితో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాటు ధరలు ఆకాశానంటుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను అనుసరిస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సామాజిక తెలంగాణ రాష్ట్ర సమాగ్రాభివృద్ధి లక్షంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సీపీఐ పోరుబాటు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుండా మల్లేష్, ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి ఎండి యూసుఫ్ , సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె నర్సింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి భద్రిసత్యనారాయణ, ఏఐటియూసి, సిపిఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తిరుపతి, గోపినాథ్, చిరంజీవి, రవీందర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.