Home జాతీయ వార్తలు గతం కంటె ఎక్కువ సీట్లే

గతం కంటె ఎక్కువ సీట్లే

In the Lok Sabha polls, the BJP is more than 2014

ప్రధాని మోడీ ధీమా
విపక్ష కూటమి విచ్ఛిన్నం ఖాయం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2014 కన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ‘మహా కూటమి’ విజ యం సాధించదని, ఎందుకంటే కేంద్రంలో బలమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్షాల కూటమి 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు విచ్ఛిన్నమవుతుందా, తర్వాత విచ్ఛిన్నమవుతుందా అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న అని శనివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మోడీ పేర్కొన్నారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, మన సమాజం, విదేశీ సంబంధాలు సహా అనేక రంగాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మోడీ ఇంటర్వూలో సమాధానాలు చెప్పారు.

ప్రతిపక్షాల మహా కూటమి గురించి మాట్లాడుతూ, సిద్ధాంతాల ప్రాతిపదికపై కాకుండా అవకాశ వాద రాజకీయలపై ఏర్పడే ప్రతిపక్షాల కూటమి ఎక్కువ కాలం మనజాలదని ప్రధాని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తన నినాదం ‘అభివృద్ధి, వేగంగా అభివృద్ధి, అందరికీ అభివృద్ధి’గా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘ గత ఎన్నికల్లో సాధించిన దానికన్నా ఎక్కువ స్థానాలను మేము సాధిస్తాం. అంతేకాదు ఎన్‌డిఎ గతంలో సాధించిన స్థానాల అన్ని రికార్డ్టులను బద్దలు కొడతామన్న నమ్మకం నాకు ఉంది’ అని మోడీ చెప్పారు.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు
అసోంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న జాతీయ పౌర నమోదు( ఎన్‌ఆర్‌సి) కార్యక్రమంపై కాంగ్రెస్ ఓటు బ్యాంకు రా.కీయలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే 1972లో ఆ పార్టీ కుదుర్చుకున్న ఒప్పందాలను సైతం అది అమలు చేయలేకపోయిందని మోడీ అన్నారు. తమపై తమకు, ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేని వారంతా ఆత్మరక్షణలో పడి ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2005లో పార్లమెంటులో తాను ఏం చెప్పిందో మమత గుర్తు చేసుకోవాలన్నారు. గోరక్షకులతో పాటుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకోన్మాద దాడులపై ఆందోళన వ్యక్తమవడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

‘ప్రతి పౌరుడి ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడడానికి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఏ వ్యక్తి కూడా ఎటి పరిస్థితుల్లోను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించం’ అని ఆయన అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వారిపట్ల తమ ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోందని, అలాంటి వారి ఆస్తులు జప్తు చేయడానికి ఇటీవల తీసుకొచ్చిన చట్టంవల్ల ఈ దిశగా ఫలితాలు ఉంటాయని అన్నారు. మోసపూరితంగా ప్రజల సొమ్మును దోచుకుని దేశం వదిలిపెట్టి పారిపోయే ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.

రాఫెల్ ఒప్పందం
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానమిస్తూ, ఆ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. అది రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమని, నిజాయితీ, పారదర్శకతతో కూడిన ఒప్పందమని అంటూ, కాంగ్రెస్‌దంతా కూడా దేశ ప్రయోజనాలను దెబ్బ తీసే దుష్ప్రచారం తప్ప మరోటి కాదన్నారు.

70 లక్షల ఉద్యోగాలు సృష్టించాం
ఉద్యోగాలను సృష్టించడంతో తమ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, 2017 సెప్టెంబర్‌నుంచి 2018 ఏప్రిల్ వరకు 45 లక్షలకు పైగా ఉద్యోగాలు సృషించబడ్డాయని ప్రధాని చెప్పారు. గత ఏడాది 70 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని ఇపిఎఫ్‌ఓ గణాంకాలు చెప్తున్నాయని తెలిపారు. పర్యాటక రంగంలో వృద్ధి, ముద్రా పథకం కింద రుణాలు, నిర్మాణ రంగాల కారణంగా మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడుతాయని ఆయన తెలిపారు.

పొరుగు దేశాలతో సాన్నిహిత్యం
పొరుగు దేశాలతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటానని తాను అనేక సందర్భాల్లో చెప్పానని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రధాని చెప్పారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ గత నాలుగు దశాబ్దాల్లో సరిహద్దుల్లో ఒక్క తూటా కూడా పేలక పోవడం ఇరు దేశాల పరిపక్వతకు నిదర్శనమని అన్నారు. డోక్లాం వివాదాన్ని పరిష్కరించుకోవడం కూడా వివాదాలను శాంతియతంగా పరిష్కరించుకోవాలన్న రెండు దేశాల కృత నిశ్చయానికి నిదర్శనమన్నారు. పాకిస్థాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న తెహ్రీక్‌ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఉగ్రవాదం, హింసకు తావుండదని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. భారత్, పాక్‌ల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు ఇమ్రాన్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలియజేశారు.