Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

హత్య కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్

In the Murder case, two persons were arrest
జగిత్యాలటౌన్: జిల్లాలో సంచలనం సృష్టించిన ధర్మపురిలో తుపాకీ కాల్పుల సంఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులను శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జిల్లా ఎస్‌పి సునీల్‌దత్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి మాట్లాడుతూ, ముంబాయిలోని కల్లు దుకాణం యజమానులు కిరాయి హంతకుడికి సుఫారి ఇచ్చి రామగుండంకు చెందిన పొడేటి సత్యనారాయణ గౌడ్‌ను ధర్మపురిలో హత్య చేయించిన సంఘటనలో ఇది వరకే ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని, సంఘటన జరిగిన నుంచి తప్పించుకు తిరుగుతున్న ఐదుగురిలో శనివారం ఇద్దరు ప్రధాన నిందితులైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన కరడుగట్టిన నిందితుడు రాజు బయ్యా అలియాస్ హంజిల్ ముషారఫ్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లి గ్రామానికి చెందిన నోముల వెంకటేశ్‌గౌడ్‌లను పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. ముంబాయిలోని తమ కల్లు వ్యాపారానికి అడ్డుపడుతున్నాడనే కోపంతో రామగుండంకు చెందిన పొడేటి సత్యనారాయణ గౌడ్‌ను హతమార్చాలని కల్లు దుకాణ యజమానులు పక్కా ప్రణాళిక రచించి తుపాకితో కాల్చి చంపేలా పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజు బయ్యాతో రూ.50 వేలకు సుఫారీ కుదుర్చుకున్నట్టు ఎస్‌పి వివరించారు. ఈ మేరకు మే 9న ధర్మపురి మండలం కమలాపూలో జరిగే ఎల్లమ్మ బోనాల పండుగకు రావాలని సత్యనారాయణగౌడ్‌ను ఆహ్వానించారని, ముందు వేసుకున్న పథకం ప్రకారం… సత్యనారాయణ గౌడ్‌తో కలిసి చిత్తుగా మద్యం తాగిన వారు మరోసారి మద్యం తాగుదామని ధర్మపురి సత్య వైన్స్ వద్దకు తీసుకెళ్లారన్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న రాజుబయ్యా కారులోంచి దిగుతున్న సత్యనారాయణగౌడ్‌పై కంట్రీ మేడ్ రివాల్వర్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన సత్యనారాయణగౌడ్ అక్కడికక్కడే మృతి చెందడన్నారు. జిల్లాలో సంచలనం సృష్టించిన కాల్పుల సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపగా 13 మంది నిందితులు పాల్గొన్నట్టు తెలిసిందన్నారు. దాంతో నిందితులను పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి వారి ఆచూకీ కనుగొన్నామన్నారు. ఇప్పటికే నిందితులైన కమలాపూర్‌కు చెందిన నేరేళ్ల రాజేశ్‌గౌడ్, రమేశ్‌గౌడ్, జగిత్యాలకు చెందిన కరబూజ వెంకటరమణయ్య, దమ్మన్నపేటకు చెందిన నేరేళ్ల మల్లేశ్‌గౌడ్, నేరేళ్లకు చెందిన తీగల దుబ్బయ్య, రాయపట్నంకు చెందిన గుండ శంకర్‌గౌడ్, లక్ష్మీపూర్‌కు చెందిన గర్వందుల నరేశ్‌గౌడ్, రాయికల్‌కు చెందిన బత్తిని హరికృష్ణలు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో ముగ్గురు నిందితులైన జగిత్యాలకు చెందిన ఆకుల మధుగౌడ్, నేరెళ్లకు చెందిన కాసారపు రాజయ్యగౌడ్, హైదరాబాద్‌కు చెందిన ఎలిమేటి రాజేశంగౌడ్‌లు పరారీలో ఉన్నారని ఎస్‌పి వివరించారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ధర్మపురి సిఐ లక్ష్మిబాబు, సిసిఎస్ సిఐ ఎం.డి సర్వర్, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బంది రవీందర్, మధుకర్, చిరంజీవి, సుందర్‌సింగ్‌లను ఎస్‌పి అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.

Comments

comments