Home లైఫ్ స్టైల్ తండా నుంచి అంతర్జాతీయ స్థాయికి..

తండా నుంచి అంతర్జాతీయ స్థాయికి..

In the sixteenth year has been recognized international

అమె పుట్టింది ఓ మారుమూల తండాలో కాని పదహారేళ్లకే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తొలుత అథ్లెటిక్ వైపు మొగ్గినా కోచ్ ప్రోత్సాహంతో ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. స్వీయ ప్రతిభతో అనతి కాలంలోనే అండర్ 14, 16, 17,19 విభాగాల్లో భారత జట్టుకు ప్రాతి నిథ్యం వహించే స్థాయికి ఎదిగింది. కోచ్ శిక్ష ణలో రాటుదేలి 2015లో చైనా వేదికగా జరి గిన ఆసియా టోర్నితో జాతీయ జట్టులోకొచ్చింది. ఆ తర్వాత 2016 లో చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ రాణించి భారత్ తరఫున నాలుగు గోల్స్ సాధించి టాప్ స్కోరర్‌గా అబ్బుర పరిచింది. ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టులో కెప్టెన్సీ బాధ్యత చేపట్టిన మన తెలుగమ్మాయి గుగులోత్ సౌమ్య సకుటుంబంతో తన ప్రస్థానాన్ని పంచుకుంది.

మీ నేపథ్యం….?
మాది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజర్ల మండలం కిసాన్ తండా. మాది వ్యవసాయ కూలీల కుటుంబం. మా అమ్మానాన్నలకు మేము నలుగురం పిల్లలం. నేను మూడో సంతానం. మా నాన్నకు 2002లో ఎస్‌జీటి టీచర్ ప్రభుత్వ ఉద్యోగం వస్తే మా చదువుల కోసం 2012లో నిజమాబాద్ పట్టణానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కేర్ కాలేజీలో డిగ్రీ ఎంపిసిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాను.

తండా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు కదా మీ ఫీలింగ్…
నాకు చాల సంతోషంగా ఉంది. కొందరికి ఊహించని సందర్భాలు ఎదురుపడతాయంటారు. నా జీవితంలో అలాగే జరిగింది. నేను అథ్లెటిక్ ప్లేయర్‌గా రాణించాలనుకున్నాను. కాని నా పరుగు వేగం నన్ను ఊహించని ఫుట్‌బాల్ ప్లేయర్ ఇండియా కెప్టెన్‌గా నిలబెట్టింది. ఈ కృషి వెనుక మా అమ్మనాన్నతో పాటు నన్ను కూతురులా చూసుకునే నా గురువు, కోచ్ నాగరాజు సార్ ప్రోత్సాహం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ సమాజంలో చాల కుటుంబాల్లో ముఖ్యంగా మా తండాలో ్లఆడపిల్లల్ని ఇంటికే పరిమితం చేస్తారు. కాని మా నాన్న మమ్మల్ని అలా చూడలేదు. కొడుకు కూతురు ఇద్దరూ సమానమే అంటారు. ఇప్పుడు మా ఊర్లో చాలా మంది నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

తల్లిదండ్రులు: భాగ్యలక్ష్మీ,గోపి. మా కూతురు జాతీయ ఫుట్ బాల్ జట్టులో చోటు దక్కించుకున్న తొలి తెలుగమ్మాయి అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు జాతీయ జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం గౌరవంగా ఉంది. ఈ తరానికే కాదు రాబోయే తరాల ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తుంది.

నాన్న: నేను చదువుకున్నప్పుడు నాకు ఆటల మీద చాలా ఆసక్తి ఉండేది. కాని పేదరికం నా కళలకు ఆటంకంగా మారింది. కాని నా పిల్లలకు అలాంటి పరిస్థితి రాకూడదనుకున్నాను. నా లక్షాలను వాళ్లలో చూడాలనుకున్నాను. ఇప్పటికి నేను సంపాదించినదంతా నా పిల్లల ఎదుగుదలకే ఖర్చుపెడుతున్నాను. మా అమ్మాయి ఫిట్‌నెస్ కోసం జొన్నరొట్టె, గట్కా పెడుతుంటాం. మా పిల్లల అభివృద్ధే మా సంతోషం.
చదువు, ఆట ఎలా సాధ్యపడింది..
నేను ఉదయం 4.30 గం॥ నిద్రలేచి గ్రౌండ్ కి వెళ్లి ప్రాక్టీస్ చేస్తాను. టైమ్ కి కాలేజీ చేరుకుంటాను. సాయంత్రం రాగానే మళ్లీ గ్రౌండ్ కి వెళతాను. కాలేజీ సమయాల్లో ఆడటానికి వెళ్లినపుడు మా కాలేజీ యాజమాన్యం నాకు పూర్తి మద్దతుగా నిలబడుతూ అందరూ సహకరిస్తారు.

భారత అండర్ 17 పుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా మీ ప్రస్థానం..
నేను పదో తరగతి వరకూ ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకున్నాను. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు పాఠశాలలో ఆటలాడించే వారు. అప్పుడు నేను చాలా చురుకుగా ఆడేదాన్ని. నాకు అథ్లెటిక్స్ అంటే ఇష్టం. ఏడో తరగతిలో ఉన్నప్పుడు జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్‌లో మండల స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. మా పాఠశాల తరుఫున నేను పాల్గొన్నాను. వంద, రెండు వందల మీటర్ల పరుగు పందెంలో ఫస్ట్ వచ్చాను. అక్కడున్న కోచ్ నాగరాజు సార్ నా వేగాన్ని చూసి మంచి ప్లేయర్ అవుతావని చెప్పాడు. మా తల్లిదండ్రులతో మాట్లాడి ఫుట్‌బాల్ లో బాగా రాణిస్తావని 2012లో నన్ను వారి కోచింగ్ అకాడమీలో చేర్చుకున్నారు. అప్పటి నుండి స్కూల్ తరుఫున ఎక్కడ ఆటల పోటీలు జరిగినా సంగారెడ్డి, మెదక్, కర్నూల్ లో జిల్లా స్థాయి పోటీలకు తీసుకెళ్లారు. అక్కడ నా ఆట చూసి బళ్లారిలో జరిగే, నేషనల్ లెవల్ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపిక చేశారు.

201314 లో నేషనల్ స్కూల్ గేమ్స్ కోల్‌కతా వెస్ట్ బెంగాల్‌లో. 201415 లో అండర్ 17 జట్టు తరుఫున మణిపూర్ వేదికగా. తరువాత ఇంటర్నేషనల్ స్థాయిలో 2015 నేపాల్ ఖాట్మండ్ లో జర్మని, బర్మాతో, అండర్ 16 తరుఫున; 2016లో చైనాలో మలేషియా దక్షిణకొరియా, దేశాలతో ఆడాను. అలా అండర్ 19 తరుఫున వియత్నాం వేదికగా రష్యామీద గోల్ చేశాను. 2017 జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉర్జాకప్పు నేషనల్ మ్యాచ్ విన్నర్ గా తిరిగొచ్చాను. ఆ తరువాత న్యూఢిల్లీలో కెఏఎఫ్‌సి ఇండియన్ క్యాంప్‌లో సెలక్ట్ అయ్యాను.

అండర్ 17 తరుఫున సౌతాఫ్రికాలో రష్యాతో ఆడే అవకాశం వచ్చింది. అక్కడ ఊహించని మలుపు ఏమిటంటే భారత అండర్ 17 జట్టుకు నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 201718 ఇండియా మహిళల పుట్‌బాల్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాను. ఆ సమయంలో సంతోషంతో పాటు భయం రెండూ ఒకే సారి ఎదురుపడ్డాయి. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ‘కొమురం భీం’ అవార్డు పురస్కారంతో రవీంద్రభారతిలో నాకు సన్మానం చేశారు. నాకు అప్పగించిన ఈ పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. తొందర్లోనే సీనియర్ జట్టుకు ఎంపికవుతానన్న నమ్మకం ఉంది.

                                                                                                                                                         – బొర్ర శ్రీనివాస్