Home తాజా వార్తలు టైటిల్ పోరుకు హలెప్, ఫెదరర్

టైటిల్ పోరుకు హలెప్, ఫెదరర్

In the tennis tournament federer, novak djokovic reached final

ఫైనల్లో జొకొవిచ్, కికి బెర్టెన్స్
సిన్సినాటి: ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులు రోజర్ ఫెదరర్, నొవాక్ జొకొవిచ్ (సెర్బియా)లు ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) టైటిల్ పోరుకు అర్హత సాధించారు. పురుషుల విభాగంలో రెండో సీడ్ ఫెదరర్ పూర్తి మ్యాచ్ ఆడకుండానే ఫైనల్‌కు చేరాడు. సెమీఫైనల్ పోరులో ప్రత్యర్థి ఆటగాడు. పదకొండో సీడ్ డేవిడ్ గోఫిన్ (బెల్జియం) గాయం వల్ల అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఆ సమయంలో ఫెదరర్ 76, 11 ఆధిక్యంలో ఉన్నాడు. ప్రత్యర్థి ఆటగాడు వైదొలగడంతో ఫెదరర్‌కు ఫైనల్ బెర్త్ ఖాయమైంది. మరో సెమీ ఫైనల్లో పదో సీడ్ నొవాక్ జొకొవిచ్ 64, 36, 63 తేడాతో క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్‌ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన పోరులో జొకొవిచ్ చెమటోడ్చి విజయం సాధించాడు.

తొలి సెట్‌లో జొకొవిచ్ దూకుడును ప్రదర్శించాడు. పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ లక్షం దిశగా అడుగులు వేశాడు. ఇదే క్రమంలో సునాయాసంగా సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ, రెండో సెట్‌లో జొకొవిచ్‌కు గట్టి పోటీ ఎదురైంది. సిలిక్ అద్భుత ఆటతో జొకొవిచ్‌ను హడలెత్తించాడు. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను గెలిచాడు. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో జొకొవిచ్ మళ్లీ పుంజుకున్నాడు. సిలిక్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. సునాయాసంగా సెట్‌ను గెలిచి టైటిల్ వేటకు అర్హత సాధించాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ హలెప్ విజయం సాధించింది. బెలారస్ క్రీడాకారిణి అరినా సబలెంకాతో జరిగిన సెమీఫైనల్ పోరులో హలెప్ 63, 64తో విజయం సాధించింది. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించిన హలెప్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చెలరేగి ఆడుతూ వరుసగా రెండు సెట్లను సొంతం చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో సెమీస్‌లో 8వ సీడ్ పెట్రా క్విటొవాకు చుక్కెదురైంది. నెదర్లాండ్స్ క్రీడాకారిణి కికి బెర్టెన్స్ 36, 64, 62 తేడాతో క్విటొవాను ఓడించింది. తొలి సెట్‌లో గెలిచిన క్విటొవా తర్వాతి రెండు సెట్లలో ఓటమి పాలైంది. ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైన క్విటొవా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది.