Home జాతీయ వార్తలు రగడ రాజ్‌భవన్‌కు

రగడ రాజ్‌భవన్‌కు

గవర్నర్‌ను కలుసుకున్న పన్నీర్ సెల్వం, శశికళ 

ఎంఎల్‌ఎలు లేకుండా రావాలని ఆహ్వానించిన విద్యాసాగర్‌రావు
రాజీనామా ఉపసంహరణకు అనుమతి కోరిన తాత్కాలిక సిఎం
జాబితా సమర్పించిన చిన్నమ్మ
వెలువడని రాజ్‌భవన్ నిర్ణయం

tnచెన్నై: తమిళనాడు సహా యావద్దేశం ఇప్పుడు గవర్నర్ విద్యాసాగర్ రావువైపుకే చూస్తోంది. ఆయన నిర్ణయం కోసం ఆసక్తితో నిరీక్షిస్తోంది. ఒకవైపు ఆపద్ధర్మ సిఎం పన్నీర్ సెల్వం, మరోవైపు అన్నాడిఎంకె శాసనసభా పక్షనేతగా ఎన్నికైన వికె శశికళ గురువారంనాడిక్కడ సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను వేర్వేరుగా కలిశారు. తననే సిఎం గా కొనసాగించాలని, అసెంబ్లీలో బలం నిరూపించు కుంటా నని సెల్వం… ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం తన వద్ద ఉందని శశికళ వేర్వేరుగా వినతిపత్రాలం దించారు. చిన్నమ్మ మరో అడుగుముందుకేసి తనకు మద్దతు నిస్తున్న ఎంఎల్‌ఎల పేర్లతో కూడిన జాబితాను విద్యాసాగర్ రావుకు అందజేశారు. ఆ తర్వాత నిర్ణయాన్ని గవర్నర్ కోర్టు లో వదిలేసిన రెండు శిబిరాలు రాత్రి వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. నేతలతో శశికళ పార్టీ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించగా… పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో కలిసి ఇంట్లో మంతనాలు సాగించారు. అంతకు ముందు ఉదయం నుంచి రాత్రి వరకు చెన్నైలో పరిణామాలు చకచకా మారాయి. సంచలన నిర్ణ యాలతో సిఎం పన్నీర్ సెల్వం కాసేపు శశికళ వర్గానికి టెన్షన్ తెప్పించారు. బ్యాంకులకు లేఖలు, పోయెస్ గార్డెన్‌పై ఆదేశాలు, పోలీస్ కమిషనర్‌పై చర్యలకు పూనుకున్నారు. దానికితోడు ఉదయం వరకు శశికళకు గట్టి మద్దతుదారుగా ఉన్న పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధు సూదనన్ ఒక్కసారిగా పన్నీర్ పం చన చేరారు. రాత్రి కల్లా సీన్ మారు తుందని, ఎంఎల్‌ఎలంతా తన చెం తకు వస్తారన్న సెల్వం ప్రకటన శశి కళ శిబిరంలో సెగలు రేపింది. వెం టనే అప్రమత్తమైన శశికళ అప్పటికే కట్టుదిట్టమైన ప్రైవేటు భద్రత నడుమ ప్రత్యేక శిబిరాల్లో ఉంచిన తన మద్దతుదారులైన ఎంఎల్‌ఎలపై నిఘా మరింత పెంచారు.
ధర్మంగెలుస్తుంది..అంతా మంచే జరుగుతుంది: పన్నీరు సెల్వం
త్వరలోనే అంతా మంచి జరుగుతుందని, తాను గవర్నర్ విద్యాసాగర్ రావుకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్నింటినీ వివరించానని తమిళ నాడు ఆపద్ధర్మ సిఎం పన్నీరుసెల్వం తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత ఆయన నివాంలో మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌తో ఏమి మాట్లాడిందీ, ఆయన ఏం చెప్పిందనే వివరాలు పన్నీరుసెల్వం వివరించ నప్పటికీ ఏది ఏమైనా ధర్మం జయిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అంతా మంచి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు. పార్టీ సీని యర్ నేతలు మధుసూదనన్ ఇతరులతో కలిసి తాను గవర్నర్‌ను కలిసినట్లు వివరించారు. తమకు దివంగత నాయకురాలు జయలలిత ఆశీస్సులు ఉన్నా యని పన్నీరుసెల్వం చెప్పారు. ధర్మం అప్పుడప్పుడు చెర అయినట్లుగా కన్పిం చినా చివరికి ధర్మమే నిలిచి వెలుగుతుందని స్పష్టం చేశారు. గవర్నర్‌తో ఏమే మీ మాట్లాడారు? అనే ప్రశ్నకు పన్నీరుసెల్వం చేతులు జోడించి జవాబు దాట వేశారు. అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేసుకుని తీరుతానని చెపుతోన్న పన్నీరుసెల్వం ఇప్పటివరకూ తన వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నదీ స్పష్టంగా వెల్లడించలేదు. సుమారు 30నిమిషాలపాటు గవర్నర్‌తో ఆయన భేటీ అయ్యారు. గవర్నర్‌ను కలిసి వచ్చినతరువాత పన్నీరుసెల్వం తన గ్రీన్ వేస్ రోడ్‌లోని అధికార నివాసంలో మద్దతుదార్లతో సమావేశం అయ్యారు.
పన్నీర్‌కు పలువురి మద్దతు..
సిఎం పన్నీర్ సెల్వంకు అనూహ్యంగా గురువారంనాడు పలువురి నేతల మద్దతు దక్కింది. మంత్రి కెపి మునుస్వామి, నాతన్ ఆర్ విశ్వనాథన్, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్, మరికొందరు సిట్టింగ్ ఎంఎల్‌ఎలు ఆయన వెంట ఉన్నారు. వారికి తోడు ఎఐఎడిఎంకె ప్రిసీడియం చెర్మన్ మధుసూదనన్ వచ్చి చేరడంతో పన్నీర్ శిబిరంలో ఉత్సాహం వెల్లివెరిసింది. ఆయన 40మంది ఎంఎల్‌ఎల మద్దతు తనకు ఉందని చెప్పుకుంటున్నప్పటికీ పన్నీర్ వెంట అంత సంఖ్యలో కనిపించడం లేదు. బల నిరూపణ జరిగితే తనకు మెజారిటీ వస్తుందని పన్నీర్ చెప్పుకొస్తున్నారు.
బలం ఉంది…అధికారం ఇవ్వండి: గవర్నర్‌కు శశికళ అభ్యర్థన
తనకు అత్యధిక ఎమ్మెల్యేల బలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవ కాశం కల్పించాలని వికె శశికళ గురువారం గవర్నర్ విద్యాసాగర్ రావును అభ్యర్థించారు. ఆపద్ధర్మసిఎం పన్నీరుసెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావును సాయంత్రం కొద్ది సేపు కలిసివెళ్లిన కొద్ది సేపటికే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తన మద్దతుదార్లతో కలిసి గవర్నర్‌ను కలిశారు. 10మంది సీనియర్లను వెంటబెట్టుకొని వెళ్లిన శశికళ గవర్నర్‌తో దాదాపు 40 నిమిషాల పాటు సమా వేశం అయ్యారు. తనను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్ను కున్నారని గవర్నర్‌కు శశికళ తెలిపారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను శశికళ గవర్నర్‌కు అందించారు. ప్రభుత్వ స్థాపన కు తనకు అన్ని విధాలుగా అర్హత ఉన్నందున తనకు ఆహ్వానం అందించాలని కోరారు. సాయంత్రం 7.25 గంటలకు రాజ్‌భవన్‌కు వచ్చిన శశికళ సరిగ్గా 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. వెలుపల కానీ తన నివాసం వద్ద అప్పటికే వేచి ఉన్న విలేకరులతో ఏమీ మాట్లాడలేదు. లోపలికి వెళ్లిపోయారు.
జయ సమాధి వద్ద నివాళి…
గవర్నర్‌తో భేటీకి ముందు శశికళ నేరుగా మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లారు. ఆకుపచ్చ చీర ధరించిన శశికళ అమ్మ సమాధిపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళి అర్పించారు. దాంతో పాటు తనకు మద్దతుగా నిలుస్తున్న ఎంఎల్‌ఎల జాబితాతో కూడిన కవర్‌ను కూడా జయ సమాధిపై పెట్టి మరోసారి నమస్కరించారు. అనంతరరం భారీ కాన్వాయ్‌తో పలువురు సీనియర్ నేతలతో వచ్చి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసారు.