Search
Friday 21 September 2018
  • :
  • :

రోడ్ల మరమ్మతులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాల్లో వేగం పెంచండి

Increase speed in roads repairs and footpath constructions

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో ఫుట్‌పాత్‌ల నిర్మాణాలను, రోడ్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్ అదేశించారు. నగరంలో రోడ్ల నిర్మాణంపై జిహెచ్‌ఎంసి, హెచ్‌ఆర్‌డిసి, మెట్రోరైలు, జాతీయ రహదారులు, రోడ్ల భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ అదనపు కమిషనర్లు అనిల్‌కుమార్, చౌహాన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే రోడ్ల పక్కన ఉండే నిర్మాణ వ్యర్థాలను తొలగించే పక్రియ ముమ్మరంగా సాగుతుందని అన్నారు. రోడ్లపై ఏర్పడే గుంతల పూడ్చివేసే కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, కొత్తగా ఏర్పడే గుంతలను కూడా ఎప్పటికప్పుడు పూడ్చివేయాలని అదేశించారు. గణేష్ నిమజ్జన శోభయాత్రలోగా నగరంలోని రోడ్లన్నింటిని పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించాలని అన్నారు. పలు రోడ్ల నిర్మాణం, మెట్రోరైలు కారిడార్లలో ఫుట్‌పాత్‌ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. గణేష్ శోభయాత్ర మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తగిన లైటింగ్‌ను ఏర్పాటు చేసి, మార్గమధ్యలో ఉన్న వృక్షాల కొమ్మలను తొలగించాలని అన్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో సరిపడ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి, ఎలక్ట్రికల్ విభాగం అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, హెచ్‌ఆర్‌డిసి చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్ పాల్గొన్నారు.

Comments

comments