Home సంగారెడ్డి రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి పెంచాలి

రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి పెంచాలి

18ఏళ్లు నిండిన గొల్లకుర్మలు యూనిట్‌కు అర్హులు

గొర్రె, మేకల అభివృద్ధి పథకాన్ని విస్తరించాలి

2, 3 మండలాలకు ఒక గొర్రెల సంత ఏర్పాటు

తహాసీల్లార్లు, ఎంపీడీఓలు చొరవ తీసుకోవాలి

జేసీ వాసం వెంకటేశ్వర్లు 

JC

మన తెలంగాణ/ సంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో ఉన్న గొల్లకుర్మయాదవ కుటుం బాలలోని అర్హత గల గొర్రెల పెంపకం దారులకు ఒక్కొ గొర్రెల యూనిట్ అందిం చేందుకు ప్రణాళికను సిద్దం చేయాలని జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు ఆదేశించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గురు వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక గొర్రెల అభివృద్ది కార్యక్రమంపై తహసీల్దార్లు, ఎంపిడిఓలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లకు వర్క్‌షాప్‌ను నిర్వ హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించ డంలో భాగంగా గొల్ల, కుర్మ, యాదవ కుటుంబాలకు గొర్రె, మేకల అభివృద్ధి పథ కాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అదే విధంగా మన రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ లో మాంసం వినియోగానికి అవసరమైన మేర ఉత్పత్తి లేదని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన  ఈ పథకం గొర్రెల పెంపకందారులకు లాభాదాయకమైన పథకమన్నారు. సంబంధిత అధికారులు గ్రామాలలో గొర్రెల పెంపకం దారులకు ఈ పథకంపై అవగాహన కల్పించాలన్నారు. గొర్రెల పెంపకానికి ముందుకు వచ్చే గొల్ల కుర్మయాదవ కుటుంబాలకు చెందిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని సంఘంలో సభ్యులుగా చేర్పించాలని తెలిపారు.

ఒక కుటుంబంలో ఎందరినైన సభ్యులుగా చేర్పించ వచ్చని, అవసరమైన చోట కొత్త సంఘాలు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సంఘంలో చేరిన ఆసక్తి గల గొల్ల, కుర్మలందరికి గొర్రెల యూనిట్ అంది స్తారని అన్నారు. ఒక్కొ యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పోటేలు ఉంటాయని, ఒక్కొ యూనిట్‌కు లక్షా 25 వేల రూపాయల వ్యయం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో 25 శాతం లబ్దిదారులు తన వాట ధనంగా చెల్లించాలని, 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అంది స్తుందని జేసీ తెలిపారు.

గొర్రెల మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి 2,3 మండలాలకు ఒక గొర్రెల సంత ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడత లబ్దిదారులకు ఎంపిక చేయడానికి గ్రామ సభలు పెట్టి గ్రామాల వారిగా ఎంపిక చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. పథకం అమలులో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవా లన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పశుసంవర్థక శాఖాధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తారని, మండలస్థాయిలో మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లతో కూడిన త్రిసభ్య బృందం క్షేత్ర స్థాయిలో పథకాన్ని నిర్వ హించాలని ఆయన సూచించారు.

లబ్దిదారునికి పంపిణీ చేసే గొర్రెలను ఖచ్చితంగా ఎంపిక చేసిన ఇతర రాష్ట్రాల నుండే కొనాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. గొర్రెల రవాణా, వాటి భీమా ఖర్చు అంత ప్రభుత్వమే భరిస్తుం దని ఆయన తెలిపారు. త్వరలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల సంఖ్య పెరగడంతో పాటు మాంసం ఉత్పత్తి స్వయం సమృద్ది సాధించడానికి ఆయా అధికారులందరూ కృషిచేయాల న్నారు.

అంతకు ముందు పశుసంవర్థక శాఖ రాష్ట్ర రిసోర్సుపర్సన్ డా. అశోక్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గొర్రెల పెంపకం కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను, పథకం అమలు తీరతెన్నుల గురించి వివరించారు. జిల్లాకు సుమారు 8,312యూనిట్లు మంజూరి చేయనున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 1.75 లక్షల గొర్రెలు రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం గురించి జిల్లాలో విస్తృత ప్రచారం చేయాలని ఆయా అధికారులను కోరారు. ఈ వర్క్‌షాప్‌లో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా. అశోక్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా నోడల్ అధికారి సుబ్రమణ్యం, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లు తదితరులు పాల్గొన్నారు.