Home ఎడిటోరియల్ బ్యాంకుల దివాలాతో పెరిగిన సహకార రంగ ప్రాధాన్యత

బ్యాంకుల దివాలాతో పెరిగిన సహకార రంగ ప్రాధాన్యత

co-operative

నేడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సైతం రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ మధ్య కొన్ని ప్రధాన దినపత్రికలలో అమెరికాలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు కథనాలు వెలవడ్డాయి. భారతదేశంలో పాలకుల లోపభూయిష్ట విధానాలు, ప్రభుత్వాల అసమర్థ పథకాలు అమలవుతుండడంతో పాటు ఇక్కడి రైతుల్లో సరైన విధంగా చైతన్యం కొరవడడం వల్ల కొన్ని దశాబ్దాలుగా ఆత్మహత్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నది. 1991 నుండి నేటి వరకు భారతదేశంలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. ఇదే విధంగా మన దేశంలో రైతులకు సరైన ఆయుపట్టుగా వున్న భూమి, నీరు పుష్కలంగా లేకపోవడంతోపాటు వ్యవసాయానికి తగిన పెట్టుబడి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వంటివి లభించకపోవడం వంటి కారణాలు పట్టి పీడిస్తున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికావంటి దేశంలో జనాభా తక్కువగా వుండడం భూమి అత్యధిక స్థాయిలో అందుబాటులో వున్నందున అక్కడ వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయ రంగంగా మార్చారు. ఒక్క రైతు ఆధునిక పద్ధతులతో కొన్ని వందల ఎకరాలలో సేద్యం చేస్తున్నాడు. వేయి ఆవులను ఒకే వ్యక్తి ఒంటి చేత్తో మేపే విధంగా వాటిని కంట్రోల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నాడు. భూమి మీద విశాలమైన గడ్డిమైదానాలలో వేలాది ఆవులు మేస్తుంటాయి. వాటి యజమాని లేదా రైతు హెలికాప్టర్‌లో తిరుగుతూ ఆవులను సైరన్ ద్వారా కంట్రోల్ చేస్తుంటాడు. ఈ విధంగా అక్కడ జనాభా పరిమిత స్థాయిలో వుండడం, సాగుభూమి అత్యధిక మోతాదులో వుండడం వల్ల ఆ విధమైన పద్ధతులు సజావుగా సాగుతున్నాయి. భారతదేశంలో భూమి కోసం, భుక్తి కోసం అనాదిగా పోరాటం సాగుతూనే వుంది.
ఇక్కడ వున్నవాడికి వందలాది, వేలాది ఎకరాలు వున్నాయి. లేనివాడికి కనీసం గూడు కట్టుకోవడానికి కావలసిన స్థలంతో పాటు తాను పోయిన తర్వాత కాటికెళ్లే సమయంలో కూడా స్థలం లేక బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వున్నవాళ్లను, లేనివాళ్లను ఒక తాటిమీదికి తీసుకువచ్చి ‘ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు’ అనే సహకార స్ఫూర్తితో అందరి భాగస్వామ్యంతో బ్రిటీష్ హయాంలోనే సహకార సేద్యాన్ని తీసుకువచ్చారు. సహకార పద్ధతిలో సేద్యంతోపాటు నిత్యావసర వస్తువులను సైతం తక్కువ రేట్లతో ప్రజలకు విక్రయించడానికి సహకార సంఘాల ద్వారా సరైన ప్రణాళిక రూపొందించారు. ఇలాగే ఈ సహకార సంఘాల ద్వారానే ఆర్థిక లావాదేవీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విధంగా బ్యాంకులు అంటే ఏమిటో ప్రజలకు తెలియని రోజుల్లోనే భారతదేశంలో నాటి బ్రిటీష్ పాలకులు 1904లో సహకార చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా సంఘాల ఏర్పాటుకు చేయూతనిస్తూ వచ్చారు. 1904 బ్రిటీష్ ఇండియన్ సహకార చట్టం రావడానికి లండన్‌లోని రాబర్ట్ ఓవెన్ ప్రేరణ కర్తగా నిలచారు. ఆయన ఆధ్వర్యంలో యూరోపియన్ దేశాలలో సహకార ఉద్యమం భారీ ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలో 1844లో లండన్‌లోని రాక్‌డేల్ పట్టణంలో మొదటి సహకార సంఘం ఏర్పడింది. అక్కడ ఒక కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు వారి ఆర్థిక అవసరాల కోసం 20 మంది నుంచి 30 మంది ఒక కూటమిగా ఏర్పడి వినియోగదారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం సత్ఫలితాలు ఇవ్వడంతో వెంటవెంటనే దేశవ్యాప్తంగా వేయి సహకార సంఘాలు రూపొందాయి. అప్పటినుంచి ఇప్పటివరకు యూరోపియన్ దేశాలలో, అమెరికాలో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తూనే వున్నాయి. నేటికీ ప్రపంచంలో సహకార వ్యవస్థలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ముందంజలో వున్నాయి. భారతదేశంలో ఆ మధ్య సహకార రంగం ఓ ఉద్యమం లాగా పనిచేసి ఒక స్థాయికెళ్లిన తరువాత ఈ వ్యవస్థలోకి కలుషిత రాజకీయాలు ప్రవేశించడంతో సహకార రంగం అపకార రంగంగా మారిపోయింది. ఈమధ్య మళ్లీ ఈ సహకార రంగం ద్వారానే ఉపకారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. బ్యాంకులు బడా బాబులకు నిలయాలుగా మారి రోజుకు ఓ కుంభకోణం వెలుగు చూస్తుండడంతో పాలకులతో పాటు ప్రజలు కూడా ఈ రంగంవైపు ఆసక్తి చూపిస్తున్నారు. సహకార వ్యవస్థ ప్రాధాన్యతను ఇంచుమించు శతాబ్దం కిందటనే ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతియేటా జులై 7న అంతర్జాతీయ సహకార దినోత్సవం జరపాలని తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు ఆ రోజు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. మనదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అమలులో వున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానాలే అడుగడుగునా పైచేయిగా మారుతున్నాయి. అమెరికాలో పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ వున్నందున ధనవంతులు మరింత ధనవంతులుగా ఎదుగుతున్నా…. సహకార స్ఫూర్తితో సహకార సంఘాల ద్వారా సామాన్యులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. చైనాలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వున్నందున అక్కడి పాలకుల చిత్తశుద్ధితో పాటు ప్రజలు కూడా బాధ్యాతాయుతంగా నిరంతరం శ్రమజీవులుగా కష్టపడుతున్నందున నేడు చైనా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌కు సవాలుగా మారాయి. ఇప్పుడిప్పుడే చైనా ప్రజల జవాబుదారీతనాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన దేశ ప్రజలు కూడా ఆ బాటలో పయనిస్తూ ఉత్పత్తిరంగంలో ముందుకు దూసుకెళ్తున్నారు. మొత్తం మీద మన దేశంలో వ్యవసాయశాఖలో ఒక భాగమైన సహకార వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి పాలకులతో పాటు ప్రజలు కూడా మేల్కొనవలసి వుంది. రైతులు, ప్రజలు ప్రతి పనికీ ప్రభుత్వాలను విమర్శించడం కన్నా అందుబాటులో వున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి చైతన్యవంతులు కావాలి. ముఖ్యంగా సహకార చట్టం గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. రైతులు సహకార సంఘాల ద్వారా తమ ఉత్పత్తులను తామే అమ్ముకొనే విధంగా వ్యవహరిస్తే దళారీ వ్యవస్థ దూరమై నల్ల వ్యాపారుల గుప్పెట్లోకి పోకుండా తగిన గిట్టుబాటు ధరలతో ఆర్థిక అభివృద్ధితో వ్యవహరించడానికి అవకాశం ఏర్పడుతుంది.ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో సహకార సంఘాల మీద ప్రజలకు ఆసక్తి పెరుగుతున్నది. ఇందుకు రకరకాల ప్రోత్సాహకాలతో రెండు ప్రభుత్వాలూ చేయూతనిస్తున్నాయి.

 తిప్పినేని రామదాసప్పనాయుడు
99898 18212