Home జాతీయ వార్తలు తల్లిపాలు అందక పెరుగుతున్న శిశు మరణాలు

తల్లిపాలు అందక పెరుగుతున్న శిశు మరణాలు

Untitled-2.jpg-123123తల్లిపాలు ప్రకృతి సహజం. పిల్లలు ఆరోగ్య వంతంగా ఎదిగి జీవించడానికి తల్లిపాలు తప్పనిసరి. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 26 మిలియన్ల శిశువులు జన్మిస్తుండగా, ఇందులో 20 మిలియన్ల శిశువులకు తొలి ఆరునెలలు తల్లిపాలు అందడం లేదు. మరో 13 మిలియన్ల శిశువులకు సరైన సమయంలో తల్లి పాలతోపాటు అదనపు పోషకాహారం లభించడం లేదు. దీంతో ఐదేళ్లలోపు పిల్లల మరణాలు గణనీయమైన సంఖ్యలో ఉంటున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, ఆరునెలల పాటు శిశువుకు తల్లిపాలు అందుతున్నది కేవలం 46.3 శాతం. కొంతమంది తల్లులకు సరైన అవగాహన లేకపోవడంతో మొదటి నెల నుంచి ఆరు నెలలు వచ్చేసరికి తల్లిపాలను మాన్పిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

కేవలం 20 శాతం మంది శిశువులకు మాత్రమే ఆరునెలల వరకు తల్లిపాలు కొనసాగిస్తున్నారు. పుట్టిన శిశువుకు వెంటనే (గంటలోపు) తల్లిపాలు తాగిస్తున్నది కేవలం 24.5 శాతమే. అదే గ్రామీణ ప్రాంతాలకు వస్తే 40 శాతం ఉంది. తల్లిపాలతో పాటు అదనపు పోషకా హారం ఇస్తున్నవారు ( 69 నెలల వయస్సు) 55.8 శాతంకు చేరుకుంది. గతంలో 35 శాతానికే పరిమితమైన ఈ సంఖ్య కొంత మెరుగైంది. కానీ, గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి 23.9 శాతానికే పరిమితమైంది.

శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ద్వారా 22 శాతం నవజాత శిశు మరణాలు నివారించవచ్చు. మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు పట్టడం ద్వారా ఐదు సంవత్సరాల వయసు లోపు పిల్లల మరణాలు 13 శాతం వరకు నివారించవచ్చు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం ప్రారంభించి రెండు సంవత్సరాల వయస్సు వరకు తల్లిపాలు కొనసాగించడం వల్ల మరో 6 శాతం మరణాలు నివారించవచ్చు. ఈవిధంగా రెండు సంవత్సరాలలోపు పిల్లలకు సరియైన పోషక ఆహారపు పద్ధతులను పాటించడం ద్వారా మిలీనియం అభివృద్ధి లక్ష్యాల సాధన సాధ్యపడుతుం ది. ఐదు సంవత్సరాలలోపు పిల్లల ఆరోగ్యాభివృద్ధి చేతికందుతుంది. కానీ, ఇందుకు భిన్నంగా బాల్యం తప్పటడుగులు వేస్తోంది. తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల శిశువులు నీళ్ళ విరేచనాలు, శ్వాసకోశ జబ్బుల కు గురవుతున్నారు. లోపపోషణ ఏర్పడి వయస్సుకు మీరిన బరువు, ఊబకాయం బారినపడుతున్నారు. మేథోసంపత్తి కొరవడడం, చురుకుదనం లోపిం చి ధీర్ఘకాలిక వ్యాధులతో సతమత మవుతున్నారు.
మిలీనియం అభివృద్ధి లక్ష్య సాధనలో తల్లిపాలకు పెద్దపీట వేసింది. మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడం, ఆతర్వాత రెండు సంవత్సరాలు తల్లిపాలు కొనసాగించడం వల్ల శిశువు ఎదుగుదలకు కావలసిన శక్తి, పోషకాలు లభిస్తాయి. తల్లిపాలతో పాటు పోషక విలువలతో కూడిన అదనపు ఆహారం ఇవ్వడంవల్ల ఆరోగ్యంతోపాటు మానసిక మేధో సంపత్తి పెరుగుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రసవానంతర రక్తస్రావం, రొమ్ము, అండాశయం, గర్భకోశ క్యాన్సర్లను నివారించవచ్చు. ఎముకల బలహీనత తదితర వ్యాధుల నుంచి తల్లికి రక్షణగా ఉంటుంది. సహజ గర్భనిరోధక శక్తివల్ల వెంటనే గర్భం దాల్చకుండా ఉంటారు.

వ్యాధి నిరోధకశక్తి సంక్రమించి వివిధ వ్యాధుల నుంచి తల్లిపాల ద్వారా శిశువుకు రక్షణ లభిస్తుంది. హెచ్‌ఐవి సోకిన తల్లులు, హెచ్‌ఐవి మందులు వాడుకుంటూ పిల్లలకు కూడా హెచ్‌ఐవి మందులు ఇప్పిస్తూ మొదటి 6 నెలలకాలం తల్లిపాలు ఇచ్చినట్లయితే తల్లి నుంచి శిశువుకు హెచ్‌ఐవి సంక్రమణ తగ్గుతుంది.
ఉద్యోగినులయిన తల్లులకు మన దేశంలో అందుతున్న సహకారం అంతంతమాత్రంగానే ఉంది. 1961లో ‘మాతృదోహద చట్టం’ అములు లోకి వచ్చింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి మహిళా ఉద్యోగికి, పూర్తి వేతనంతో కూడిన 12 వారాల ప్రసవానంతర సెలవు ఇవ్వాలి. శిశువుకు 15 నెలల వయస్సు వచ్చేవరకూ పనివేళల్లో పాలివ్వడానికి వీలుగా రెండుసార్లు తల్లికి విరామం కల్పించాలి. ఈ సౌకర్యం వ్యవస్థీకృత సంస్థలలో పనిచేస్తున్న కొద్దిమంది ఉద్యోగినులకు మాత్రమే అవకాశం కలుగుతున్నది. వ్యవస్థీకృతం కాని సంస్థలలో పనిచేస్తున్న చాలామంది మహిళలకు ఈ సౌకర్యం లేదు. సామాజిక భద్రత కల్పించ కుండా యాజ మాన్యాలు వారితో పనిచేయించు కుంటున్నారు.

వేతనంతో కూడిన ప్రసవ సెలవులు కల్పించకపోవడం, ప్రసవం తర్వాత వీలైనంత త్వరగా విధులు నిర్వర్తించమని వొత్తిడి చేస్తుండడంతో చాలా మంది మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని గమ నించిన కేంద్ర ప్రభుత్వం 2008లో 6వ వేతన కమిషన్ సూచనల మేరకు ఉద్యోగినులకు వేతనంతో కూడిన 6 నెలల ప్రసవానంతర సెలవు, పిల్లల సంరక్షణకు 2 సంవత్సరాల కాలం వేతనంతో కూడిన సెలవు కల్పించబడింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రసవానంతర సెలవును 120 నుంచి 180 రోజులకు పెంచింది. ఇదిలావుంటే, పిల్లలకు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వడానికి తోడ్పడే పథకాలు, ప్రణాళికలపై ప్రపంచవ్యాప్తంగా 2008, 2012, 2015లలో అధ్యయనాలు జరిపింది.

ఇవేవి మన దేశంపై ప్రభావాన్ని చూపించ లేదు. వ్యవస్థీకృతంకాని సంస్థలలో పనిచేస్తున్న 90 శాతం మహిళలకు ఏలాంటి మాతృ దోహదాలు అందడం లేదు. అమలులో ఉన్న 1961 మాతృ దోహద చట్టం కూడా అమలు కావడం లేదు. 12 వారాల ప్రసవానంతర సెలవు మినహా, పనిచేసే చోట పిల్లలను ఉంచుకోవడానికి వసతి కల్పించలేక పోతున్నాయి.
ఈ చట్టం అమలుపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగినులు శిశువులను ఆరోగ్య వంతమైన వాతావరణంలో పెంచలేకపో తున్నారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి, బస్ టర్మినల్స్‌లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. రాష్ర్ట రోడ్డు రవాణ సంస్థ, పురపాలక సంఘాలు కలిసి శిశువుకు తల్లిపాలు ఇవ్వడానికి వీలుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టాయి. ప్రయాణం చేసే తల్లుకు ఇవి ఉపయోగకరంగా ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే జయలలిత ప్రభుత్వం 2014లో ‘మిల్క్‌బ్యాంక్’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తల్లులు డొనేట్ చేసే తమ పాలతో ఈ బ్యాంకును నిర్వహిస్తున్నారు. లోపపోషణ పిల్లలకు ఈ పాలను అందిస్తున్నారు.

2000 సం॥లో ఐక్యరాజ్యసమితి, 23 అంతర్జాతీయ సంస్థలతో కలిసి నిర్వహించిన మిలీనియం శిఖరాగ్ర సమావేశంలో 2015 సం॥ నాటికి సాధించవలసిన ‘మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు’ నిర్ణయించింది. తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించి, సహకరించి, రక్షించడంతో పాటు పిల్లల పోషణ, ఆరోగ్యం కాపాడుకుంటూ ఈ ఏడాది తల్లిపాల వారోత్సవాన్ని ప్రస్తావించింది. తల్లిపాలపై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసినప్ప టికీ, రెండు దశాబ్దాలుగా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందలేదు. కుటుంబ సభ్యులు, యాజమాన్యాలు, ఆసుపత్రుల నుంచి తల్లులకు తగినంత సహకారం అందకపోవడం, పాలపౌడరు, శిశు ఆహార పరిశ్రమల వారి విపరీత వాణిజ్య ప్రకటనల పోకడలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.