Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అప్పటి పేర్లే ఇప్పటికీ కొనసాగింపు..

Increasing awareness can be achieved on our village lands

అవగాహన పెంచుకుంటే మన గ్రామ భూములపై పట్టు సాధించవచ్చు..
వాటిలో కొన్ని మాత్రమే అమ్ముకోవచ్చు..                                                                                                                          మరికొన్ని బదలాయింపునకు సాధ్యం కాదు

సాగు చేసుకునే భూములతో పాటు నిరుపేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి, పేదలకు ప్రభుత్వం ఇచ్చే భూములను తెలంగా ణలో ఏ విధంగా పిలుస్తారు. వాటిని ఎవరికి ఎలా కేటాయిస్తారో తెలుసుకోవాలంటే ముందుగా వాటి గురించి అవగాహన ఉండాలి. వాటిలో కొన్నింటిని అమ్ముకోవచ్చు, మరికొన్నింటిని బదలాయించడానికి వీలు లేదు. దీనికోసం అప్పట్లోనే ప్రభుత్వం చట్టాలను రూపొందించింది. ఇప్పటికీ వాటిని అలాగే పిలుస్తున్నారు. ఆ చట్టాలను అలాగే కొనసాగిస్తున్నారు.  ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన పెంచుకుంటే చాలా వరకు మన గ్రామానికి చెందిన భూముల మీద అవగాహన వచ్చినట్టే. రాష్ట్రంలో వివిధ రకాల భూములను ఏళ్ల తరబడి ఈ  పేర్లతో పిలుస్తున్నారు. అందులో మచ్చుకు కొన్ని భూముల గురించి…

గ్రామకంఠం : గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామకంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలంగా పేర్కొంటారు. దీనిలో ప్రభుత్వానికి సంబంధించిన సభలు, సమావేశాలను నిర్వహించుకోవచ్చు.

అసైన్డ్‌భూమి : భూమిలేని నిరుపేదలు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్ భూములుగా పేర్కొంటారు. దీన్ని మినీ వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే. వేరే వారికి బదలాయించడం కుదరదు.

ఏ డబ్లూ భూములు : శిస్తును నిర్ధారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్ వేస్ట్ ల్యాండ్ భూములను ఏ డబ్లూ భూములుగా పిలుస్తారు. మెట్ట భూములైతే వాటిని ల్యాండ్స్ అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు ఎక్కువగా పంపిణీ చేస్తారు.

బంజరు భూమి : గ్రామం, మండలం పరిధిలో ఖాళీగా నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములుగా గుర్తిస్తారు. వీటిని రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తులేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన గ్రామం లేదా అందులో కొంతభాగాన్ని అగ్రహారం అంటారు. అడంగల్ : అడంగల్‌ను పహాణీ అని కూడా పిలుస్తారు. గ్రామంలోని సాగు భూముల వివరాలు ఈ దస్త్రం (రిజిస్టర్)లో నమోదు చేస్తుంటారు. దీనినే గ్రామ లెక్కల మూడో నంబర్ రిజిస్ట్రర్‌గా పిలుస్తారు. ఆంధ్రాలో అడంగల్ అని పిలుస్తుండగా తెలంగాణలో పహాణీగా దీనిని పరిగణిస్తారు.

చిట్టా : రోజువారీ వసూళ్లను తెలిపే రిజిస్ట్రర్‌ను చిట్టా అని పిలుస్తారు. దీనిని గ్రామ లెక్క నెంబర్ 6 గా పిలుస్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను, భూమి శిస్తు వగైరాలను అసామీల వారీగా వసూలు చేసి రిజిస్ట్రర్‌లో నమోదు చేస్తారు. జమాబంధీ : ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు, నీటి పన్ను, ఇతర బకాయిలు సక్రమంగా లెక్కకట్టడం. రెవెన్యూ లెక్కల్లోకి తీసుకువచ్చారా లేదా అని నిర్ధారించడం, గ్రామ, మండల, రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీలను జమాబంధీ అంటారు.

అజమాయిషీ : భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నదీ, లేనిదీ తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలను సంబంధిత తహసీల్దారు, ఉప తహసీల్దారు తనిఖీలు నిర్వహించాలి. తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్కనెంబర్ 3లో నమోదు చేయాలి. ఈ విధంగా అజమాయిషీని ఏటా నిర్వహించాల్సి ఉంటుంది.

దస్తావేజు : భూములకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం, ఇతర లావాదేవీలను తెలియచేసే పత్రం. భూ బదలాయింపులు చేసే సమయంలో ఈ దస్తావేజులను చట్టపరంగా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

ఎన్‌కంబర్ సర్టిఫికెట్ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియచేసే ధ్రువపత్రం. 32 ఏళ్ల ఓ సర్వే నెంబర్ భూమికి గల లావాదేవీలను తెలియచేస్తుంది.
ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ (ఎఫెఎంబీ) : దీనిని ఎఫ్‌ఎంబీ టిప్పన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఇది ఒక భాగం. దీనిలో గ్రామంలోని అన్ని సర్వేనెంబర్లు, పట్టాలు, వాటి కొలతలు ఉంటాయి.

బందోబస్తు: వ్యవసాయ భూములను సర్వే నిర్వహించి వర్గీకరణ చేపట్టడాన్ని బందోబస్తుగా పేర్కొంటారు.

బీమమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. అర్హులతేనే కొనసాగిస్తారు. అనర్హులతే తొలగిస్తారన్నమాట.

ఫసలీ : ఏటా జూలై1 వ తేదీ తరువాత సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు ఉన్న 12 నెలల కాలాన్ని ఫసలీ అంటారు. ఈ పదం మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.

ఎకరం : ఇది భూమి విస్తీర్ణానికి కొలమానం. 4,840 చదరపు గజాల స్థలం లేదా100 సెంట్లు (సెంటు అంటే 48.4 గజాల స్థలం లేదా 40 కుంటలు (కుంట అంటే 121 చదరపు గజాల స్థలం). వీటిని ఎకరంగా పరిగణిస్తారు.

Comments

comments