Home హైదరాబాద్ ప్లాస్టిక్‌పై సమరం

ప్లాస్టిక్‌పై సమరం

Increasing contamination with plastic

రోజుకు కోటికిపైగా ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం
ప్లాస్టిక్‌తో పెరుగుతున్న కాలుష్యం
వ్యర్థాలతో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
నేడు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్‌ల నిషేధ దినోత్సవం
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న బల్దియా

మన తెలంగాణ/సిటీబ్యూరో : అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) నగరంలో విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు చేసింది. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ భూమిలో కలిసిపోవడానికి 50 నుంచి వెయ్యి సంవత్సరాల సమయం పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు కోటికిపైగా ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నారని ఒక అంచనగా ఉంది. సంవత్సరానికి 360 కోట్ల ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడం, వీటిలో అధిక శాతం ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు ఉండడం నగరంలో పర్యావరణానికి పెను ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా డ్రైనేజీ పొంగిపోర్లుతుంది. 2000 సంవత్సరంలో నగరంలో వచ్చిన వరదలకు ప్లాస్టిక్య్‌ర్థాలు కూడా ఒక కారణమని అప్పట్లో ని యమించిన కిర్లోస్కర్ కమిటీ తన నివేదికలో స్పష్టం చే సింది. గత సంత్సరం వర్షాకాలంలో మైండ్‌స్పెస్ దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలతో కల్వర్టు ముసుకపోవడంతో కొన్ని రోజుల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రస్తుతం కల్వర్ట్‌లను తొలగించి, రూ.7 కోట్ల అంచనా వ్యయం తో బాక్స్ డ్రెయిన్ నిర్మిస్తున్నారు. భూగర్భ, వాయు కాలుష్యంతో పాటు ప్లాస్టిక్ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్‌ల నిషేధ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నగరవాసుల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చేందుకు జి హెచ్‌ఎంసి పలు కార్యక్రమాలు నిర్వహణకు ప్రణాళిక లు పొందించింది. నగరంలో 7,659 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, వీటిలో ఉన్న సుమారు 10 లక్షల మంది విద్యార్థినీవిద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధం, దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చైతన్య, అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు.

స్వచ్ఛ విద్యార్థిగా ఉండాలంటే ఏం చేయాలి…?
స్వచ్ఛ విద్యార్థిగా ఉండాలంటే ఏం చేయా లి అనే అంశంపై నగరంలో ప్రతి పాఠశాలను మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ, జోనల్ కమిషనర్లు మంగళవారం నుంచి సందర్శించనున్నారు. ప్రధానంగా ప్రార్థన నిర్వహించే సమయంలో విద్యార్థినీవిద్యార్థులను ఉద్దేశించి, ప్రసంగించి, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించనున్నారు. ప్లాస్టిక్ సంచుల స్థానంలో జూట్, క్లాత్ బ్యాగ్‌ల వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తారని కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి చెప్పారు. ప్లాస్టిక్ ఉత్పత్తులు వినియోగించకుండా, వాటి స్థానంలో చేతి సంచులను ఉపయోగించడం ద్వారా స్వచ్ఛ విద్యార్థిగా మారుతానని తెలుపుతూ సంతకాలు సేకరిస్తారు. ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగ్‌లు, పెట్‌బాటిళ్లు, ప్లాస్టిక్ స్ట్రాలు, డిస్పోసబుల్ ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు, స్పూన్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నిషేధిస్తున్నామని తెలిపే హామీ పత్రాన్ని విద్యార్థుల నుంచి జిహెచ్‌ఎంసి అధికారులు సేకరించనున్నారు.

మార్కెట్లు, రైతు బజార్లలో ప్రత్యేక ప్రచారం…
50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా వాడకాన్ని నిలిపివేయాలని కోరుతూ మార్కెట్లు, రైతు బజార్లతో పాటు పార్కులు, మాల్స్‌ల దగ్గర ప్రత్యేకంగా ప్లాస్టిక్ సఫకేషన్(ప్లాస్టిక్ బ్యాగ్‌తో పూర్తిగా కప్పివేయడం) ప్రచారాన్ని చేపట్టనున్నారు. ప్రధానంగా వారంతపు మార్కెట్లు, రైతు బజార్లలో ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్, జూట్ బ్యాగ్‌లను ఉపయోగించాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

బల్దియా కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం…
జిహెచ్‌ఎంసికి చెందిన జోనల్, సర్కిల్ కార్యాలయాన్నింటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ జో న్లుగా ప్రకటించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ అదేశాలు జారీ చేశారు. తమ కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని తెలిపే స్టిక్కర్లను ప్రదర్శించాలని తెలిపారు. ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగ్‌లు, పెట్‌బాటిళ్లు, ప్లాస్టిక్ స్ట్రాలు, డిస్పోసబుల్ ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు, స్పూన్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ బాటిళ్లను కార్యాలయాల్లో పూర్తిగా నిషేదించాలని, ఈ విషయంలో నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా రూపొందించడంలో కృషి చేస్తానని తెలుపుతూ ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ నిర్వహించాలని కమిషనర్ చెప్పారు.

ఫ్రైడే డ్రైడేగా పాటింపు…
నగరంలో దోమల పెరుగుదలకు ప్లాస్టిక్ వాడకం కూడా ఒకటని కమిషనర్ అన్నారు. దోమల నివారణపై చైతన్యం కల్పించేందుకు ప్రవేశపెట్టిన మై జిహెచ్‌ఎంసి యాప్‌ను ఇప్పటి వరకు 3.80 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. దీంతో పాటు దోమల నివారణ, ప్లాస్టిక్ సంచుల ఏరివేతకు చేపట్టిన ప్లాగింగ్ కార్యక్రమానికి నగరంలో విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటిస్తూ ఎంటమలాజి సిబ్బంది నగరంలో ప్రతి ఇంటికి వెళ్లి, నీటి నిల్వలను తొలగించడం, హై రిస్క్ ఏరియాలో దోమల నివారణకు స్ప్రేయింగ్‌ను చేపట్టనున్నట్లు కమిషనర్ వివరించారు.