Home ఖమ్మం పెరుగుతున్న ఆర్థిక నేరాలు

పెరుగుతున్న ఆర్థిక నేరాలు

Increasing financial crimes

తెలిసి మోసపోతున్న ప్రజలు
మోసం కోట్లలో కేసులు మాత్రం 420నే
ప్రతి ఏటా ఇదే తంతు
రుణాలిస్తామంటూ లక్షల్లో మోసం
ఇసుక ర్యాంపులు ఇప్పిస్తానని చివరకు చేతులెత్తేసిన వైనం

మన తెలంగాణ/ఖమ్మం క్రైం : నమ్మకం చాలా మందిని దెబ్బతీస్తుంది. ఆ నమ్మకమే ఆర్థిక నేరాలు పెరగడానికి కారణమవుతుంది. కొనుగోళ్లు, అమ్మకాలు, ఇతర వ్యవహారాల్లో ఇతరులను నమ్మి మోసపోతున్నారు. లక్షలాది రూపాయలు ఎగనామం పెట్టి యథేచ్ఛగా తిరుగుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి  చిన్న, సన్నకారు రైతులకు డబ్బులు ఎల్లగొట్టడం ప్రతి యేటా ఓ తంతుగా మారింది. దీంతో పాటు నగరంలో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే కేసులు పెరిగిపోతున్నాయి. లక్షలు కాజేయడం భూములు, ఇండ్ల స్థలాలంటూ ఆర్థిక నేరాలకు పాల్పడటం కొందరికీ అలవాటుగా మారిం ది. ఇటువంటి విషయాల్లో చట్టానికి లోబడి 420 కేసులు నమోదు చేయడం మినహా  మరేం చేయలేని పరిస్థితి. కొందరు తెలిసి మోసపోవడం శోచనీయం. ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా గత రెండేళ్ల నుండి పరిశీలిస్తే ఎక్కువ మొత్తంలో మోసాల కేసులు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల కాలంలో ఖమ్మం నగరంలో ఓ వ్యక్తి సుమారు 50 మంది నుండి లక్షల కొద్ది డబ్బులు వసూలు చేసి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు జేబులో వేసుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. చట్టాల లోసుగులను ఆసరా చేసుకుని కోట్లు ఎన్ని అయినా కేసు 420నే నమోదు చేశారు. ఈ కేసు లాండ్ ఆర్డర్ నుండి సిసిఎస్ పోలీసులకు బదిలీ చేయడం జరిగింది. సిసిఎస్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీంతో పాటు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ వ్యక్తి  దళితులకు వచ్చే రుణాల విషయంలో డిఆర్‌డిఏ నుండి ఇతర ప్రభుత్వ సంస్థల నుండి రుణాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు. ఇతనిపై సైతం 420 కేసు నమోదు చేశారు. మోసం ఎంతైనా సెక్షన్ 420నే. వీటితో పాటు ఖమ్మం నగరంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గతంలో  నివాసమున్న మరోక వ్యక్తి టిఎస్‌ఎన్‌డిసి (తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చైర్మన్ మాకు బంధువు అవుతాడని కొంత మంది వ్యక్తుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేశాడు. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఇసుక ర్యాంపులు ఇప్పిస్తానని నమ్మబలికి చివరకు చేతులెత్తేసినట్లు సమాచారం. ఇతనిపై ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకు రావడం లేదు. కారణం డబ్బులు అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నాడన్న సమాచారం ఉంది. ప్రస్తుతం ఇతను ఖమ్మం నుండి హైద్రాబాద్‌కు మకాం మర్చినట్లు తెలుస్తుంది. గతంలోనూ ఖమ్మం అర్బన్ ఎంఆర్‌వో కార్యాలయంలో నకిలీ సర్టిఫికెట్లు, ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కారం, నకిలీ విత్తనాలు, నకిలీ ఆయిల్ దందా వంటి విషయాల్లో పోలీసులు నామ మాత్రంగా కేసులు  నమోదు చేశారు. ఈ కేసులు సైతం క్షేత్రస్థాయిలో పనిచేసే గుమస్తాలపైనే కానీ నకిలీకి కారణమైన పెద్దలపై మాత్రం ఎక్కువ మొత్తంలో కేసులు నమోదు చేయలేదు. ఇన్ని జరుగుతున్నా ప్రజలు ఎప్పటికప్పుడు మోసపోతూనే ఉన్నారు. మోసం చేసిన వారిపై పోలీసులు కేవలం 420 కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. చట్టాలు ఇంకా బలంగా ఉంటే తప్ప పోలీసులు సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. మోసాలు జరుగకుండా చూడాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రభుత్వం, పోలీస్ యంత్రాం గం ఎప్పటికప్పుడు ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తులపై పూర్తి స్థాయిలో దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరీ.