Home తాజా వార్తలు ఆస్ట్రేలియాదే సిరీస్

ఆస్ట్రేలియాదే సిరీస్

ఖ్వాజా శతకం, రాణించిన బౌలర్లు

టాప్ ఆర్డర్ విఫలం, చివరి వన్డేలో భారత్ ఓటమి
న్యూఢిల్లీ: భారత్‌తో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 32తో కైవసం చేసుకుంది. అంతకుముందు రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక ఈ గెలుపుతో కిందటి సిరీస్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం కూడా తీర్చుకుంది. బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన ఐదో, చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (100) శతకంతో కదం తొకకడంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆతిథ్య భారత జట్టు 50 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఒక దశలో 20 ఆధిక్యంలో ఉన్న టీమిండియా తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకుంది. మరోవైపు తొలి రెండు మ్యాచుల్లో ఓడినా అసాధారణ పోరాట పటిమను కనబరిచిన ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో రానున్న ప్రపంచకప్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కానుంది. కాగా, ఎన్నో ఆశలతో సిరీస్‌కు సిద్ధమైన కోహ్లి సేన మాత్రం అవమానకర రీతిలో ఓటమి పాలై కోట్లాది మంది అభిమానులను నిరాశలో ముంచెత్తింది. చివరి మూడు మ్యాచుల్లో భారత్ పేలవమైన ఆటతో ఓటమి కొని తెచ్చుకుంది.
ప్రారంభంలోనే
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. కిందటి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 15 పరుగులే. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్‌తో స్కోరును నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అయితే రెండు ఫోర్లతో 20 పరుగులు చేసి కుదురు కున్నట్టు కనిపించిన కెప్టెన్ కోహ్లిను స్టోయినిస్ వెనక్కి పంపాడు. దీంతో 53 పరుగుల రెండ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 89 బంతుల్లో 4 ఫోర్లతో 56 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
జాదవ్, భువీ పోరాడినా

మరోవైపు జట్టును ఆదుకుంటాడని భావించిన యువ ఆటగాడు రిషబ్ పంత్ నిరాశే మిగిల్చాడు. ఒక ఫోర్, సిక్స్ కొట్టి దూకుడు మీద కనిపించిన పంత్ (16) కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే విజయ్ శంకర్ కూడా ఔటయ్యాడు. శంకర్ ఒక సిక్స్‌తో 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 132 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్‌లు అసాధారణ పోరాట పటిమతో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ముందుకు సాగారు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ ఆశలు మళ్లీ చిగురించాయి. కానీ 54 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 46 పరుగులు చేసిన భువనేశ్వర్‌ను కమిన్స్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే జాదవ్ కూడా ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కేదార్ 57 బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. వీరిద్దరూ కీలక సమయంలో ఔట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, రిచర్డ్‌సన్, స్టోయినిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆడమ్ జంపా అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా, సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేగాక సిరీస్‌లో నిలకడగా రాణించడంతో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.
ఖ్వాజా దూకుడు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా, అరోన్ ఫించ్‌లు శుభారంభం అందించారు. అద్భుత ఫామ్‌లో ఉన్న ఖ్వాజా ఈ మ్యాచ్‌లోనూ చెలరేగి పోయాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. ఫించ్ కూడా సమన్వయంతో ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 4 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన హాండ్స్‌కొంబ్ అండతో ఖ్వాజా మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఖ్వాజా 106 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. సిరీస్‌లో ఖ్వాజాకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. మరోవైపు కిందటి మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన హాండ్స్‌కొంబ్ ఈ మ్యాచ్‌లో కూడా మెరుగైన బ్యాటింగ్ కనబరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హాండ్స్‌కొంబ్ 4 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. కాగా, చివరి ఓవర్లలో భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా స్కోరు 272 పరుగులకే పరిమితమైంది.

IND vs AUS: Australia won by 35 runs in 5th ODI