Home తాజా వార్తలు అబ్బా… జస్ట్ మిస్

అబ్బా… జస్ట్ మిస్

విజయం ముంగిట భారత్ బోల్తా
4 పరుగుల తేడాతో చివరి టి 20లో ఓటమి
సిరీస్ కివీస్ కైవసం
ఆక్లాండ్: భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటన చివరికి ఓటమితో ముగిసింది. ఆస్ట్రేలియాపై టి20, వన్‌డే, టెస్టు సిరీస్‌లను దకించుకున్న టీమిండియా సమరోత్సాహంతో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. దానికి తగ్గట్టుగానే ఆతిథ్య జట్టును వన్‌డే సిరీస్‌లో 4 1తేడాతో చిత్తు చేసింది. అయితే టి20 సిరీస్‌లో మాత్రం జట్టు వ్యూహం ఫలించలేదు. జట్టు సారథి విరాట్ కోహ్లీ లేని లోటు బాగా కనిపించింది. ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగినప్పటికీ టి20 సిరీస్‌ను మాత్రం గెలవలేకపోయింది. 1 2తేడాతో ఓటమి పాలయి పర్యటనను ముగించింది. ఆదివారం జరిగిన ఆఖరిమాచ్ అయితే చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగింది. కివీస్ నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్షాన్ని ఛేదించడంలో భాత్ ఒడిదుడుకులను ఎదుర్కొన్నపటికీ చివరివరకు విజయం కనుచూపు మేరలో ఊరిస్తూ కనిపించింది. అయితే చివరికి నాలుగు పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో కివీస్ గడ్డపై తొలి టి 20సిరీస్‌ను గెలవాలన్న టీమిండియా కల నెరవేర లేదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో వదిలేసిన క్యాచ్‌లో భారత్ కొంప ముంచాయని చెప్పాలి.ఆ క్యాచ్‌లనే పట్టి ఉంటే భారత్ ఛేదించాల్సిన లక్షం అంత భారీగా ఉండేది కాదు. అప్పుడు సిరీస్ కూడా మన సొంతం అయి ఉండేది.
కాగా కివీస్ నిర్దేశించిన లక్ష ఛేదనలో భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. 5 పరుగులు మాత్రమే చేసిన శిఖర్ ధావన్ ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ తన సత్తా చాటాడు. అద్భుతమైన ఫోర్లు, చూడ చక్కటి సిక్సర్లతో కేవలం 28 బంతుల్లోనే 43 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. రోహిత్ శర్మ(32 బంతుల్లో 38)తో కలిసి రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ క్రీజ్‌లో ఉన్నది కొద్ది సేపే అయినప్పటికీ మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు చేసి వెనుదిరిగాడు. జట్టు స్కోరు 121 పరుగుల వద్ద టిక్నర్ అతడిని ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్య సైతం రోహిత్‌తో కలిసి స్కోరు బోర్డుకు ఊపునిచ్చాడు.11 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్, హార్దిక్‌లతో పాటుగా, ఎన్నో సార్లు జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ సైతం వెంటవెంటనే ఔట్ కావడంతో టీమిండియా పరుగుల వేగం తగ్గింది. అయితే ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన దినేశ్‌కార్తిక్, కృణాల్ పాండ్యలు సమయోచిత బ్యాటింగ్‌తో మరోసారి విజయంపై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 63 పరుగుల అజేయ భాగస్వామ్యంతో అంతా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో విజయంపై ఆశలు చిగురించేలా చేశారు. వీరిద్దరూ 18వ ఓవర్ వరకు అద్భుతంగా ఆడారు. పరుగుల వరద పారించారు. దీంతో రన్‌రేట్ సైతం అదుపులోకి వచ్చింది. అయితే 19వ ఓవర్‌లో కుగులీన్ ఆచితూచి బంతులు వేశాడు. దీంతో భారత్ చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఆఖరి ఓవర్ టిమ్‌సోథీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సమీకరణం చివరి 2 బంతులకు 12 పరుగులుగా మారింది. అయిదో బంతికి పరుగులేమీ ఇవ్వని సోథీ ఆరో బంతిని వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతిని దినేశ్ కార్తిక్ సిక్స్‌గా మలిచినప్పటికీ టీమిండియా విజయానికి నాలుగు పరుగుల దూరంలోనే నిలిచింది. సిరీస్ 2 1తేడాతో కివీస్ వశమైంది. మ్యాచ్ ముగిసే సమయానికి దినేశ్ కార్తిక్ 16 బంతుల్లో 33 పరుగులతో, కృనాల్ పాండ్య13 బంతుల్లో 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కార్తిక్ స్కోరులో నాలుగు సిక్స్‌లు ఉండగా, పాండ్య 2 ఫోర్లు, మరో రెండు సిక్స్‌లు బాదాడు.

మెరిసిన మున్రో

అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, కొలిన్ మున్రోలు చెలరేగి ఆడడంతో పరుగుల వరద పారింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత 43 పరుగులు చేసిన సీఫెర్ట్ ఔటయ్యాడు. కేవలం 25 బంతుల్లోనే అతను మూడు సిక్స్‌లు, మరో మూడు బౌండరీలతో ఈ స్కోరు చేశాడు.ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి మున్రో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఇద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత 72 పరుగులు చేసిన మున్రో ఔటయ్యాడు.40 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 5 ఫోర్లు, మరో అయిదు సిక్స్‌లున్నాయి. ఆ తర్వాత మరో 15 పరుగులకే విలియమ్సన్ (27)కూడా ఔటయ్యాడు. అప్పటికి కివీస్ స్కోరు 150 పరుగులే. అయితే ఆ తర్వాత వచ్చిన గ్రాండ్‌హోమ్ (30),డార్లీ మిచెల్ (9 నాటౌట్),రాస్ టేలర్ (14 నాటౌట్)లు తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించడంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు లభించగా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్‌లకు చెరో వికెట్ దక్కింది.72 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించిన మున్రోకు మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

IND vs NZ: Kiwis won by 4 runs in 3rd T20