Home స్కోర్ సమరోత్సాహంతో భారత్

సమరోత్సాహంతో భారత్

లంకకు చావోరేవో, నేటి నుంచి రెండో టెస్టు

Cricket

కొలంబో : శ్రీలంకతో గురువారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు భారత్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో సమరోత్సాహంతో బరిలోకి దిగనుంది. ఓపెనర్ కెఎల్.రాహుల్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ఆతిథ్య శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే లంక ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు. అయితే కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ లేమితో బాధ పడుతుండడం లంక కష్టాలను రెట్టింపు చేస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో లంక ఉంది. అయితే భీకర ఫాంలో ఉన్న టీమిండియాను ఓడించడం ప్రస్తుత పరిస్థితుల్లో లంకకు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో బలంగా ఉన్న కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. లంక కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
అందరి దృష్టి ధావన్‌పైనే..
తొలి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో కదం తొక్కిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌కు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అనిశ్చితికి మరో పేరుగా చెప్పుకునే ధావన్ ఈ మ్యాచ్‌లో రాణిస్తాడా లేదా అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. తనదైన రోజు ఎంతటి బౌలింగ్ నైనా చిన్నాభిన్నం చేసే సత్తా ధావన్ సొంతం. ఈ మ్యాచ్‌లో అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడనేది ఆసక్తిగా మారింది. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ధావన్ ఈ మ్యాచ్‌లోనూ మెరుపులు మెరిపించక తప్పదు. మరోవైపు చాలా రోజుల తర్వాత బరిలోకి దిగుతున్న కెఎల్. రాహుల్‌కు కూడా మ్యాచ్ కీలకంగా మారింది. ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన రాహుల్ రెండో టెస్టుకు సిద్ధమయ్యాడు. ముకుంద్ స్థానంలో అతనికి తుది జట్టులో చోటు లభించింది. గాయం వల్ల రాహుల్ చాలా రోజులుగా టీమిండియాకు దూరమయ్యాడు. దీంతో అతను ఎలా ఆడతాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అసాధారణ ఆటను కనబరిచిన రాహుల్ గాయం వల్ల జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా అతనికి శ్రీలంక సిరీస్ కోసం జట్టులో చోటు దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నాడు. జట్టులో ఓపెనర్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో రాహుల్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీన్ని అతను ఎలా ఎదుర్కొంటాడనే అనేది ఆసక్తి రేకెత్తించే అంశం.
జోరుమీదున్నారు
ఇక, టీమిండియా టాప్ ఆర్డర్ భీకర ఫాంలో ఉంది. వన్ డౌన్‌లో వచ్చే చతేశ్వర్ పుజారా తొలి టెస్టులో అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్ పుజారాకు 50వది కావడంతో అందరి దృష్టి అతనిపై నెలకొంది. ఈ మ్యాచ్‌లోనూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచి తీపి జ్ఞాపకంగా పెట్టుకోవాలనే లక్షంతో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో పుజారా సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. మైలురాయి మ్యాచ్‌లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో పుజారా కనిపిస్తున్నాడు. ఇదే జరిగితే లంక బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఫాంలోకి వచ్చాడు. తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి అద్భుత శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా మెరుపులు మెరిపించాలనే లక్షంతో కోహ్లి ఉన్నాడు. అజింక్య రహానె కూడా తొలి టెస్టులో నిలకడైన ఆటను కనబరిచాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. వెస్టిండీస్ సిరీస్ నుంచి రహానె ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ మెరుగైన బ్యాటింగ్ కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యాలు కూడా బ్యాత్‌తో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాండ్యా ఆకట్టుకున్నాడు. దీంతో అతనిపై అంచనాలు భారీగా పెరిగాయి. అశ్విన్, సాహాలకు కూడా టెస్టుల్లో మంచి రికార్డు ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం.
స్పిన్నర్లపైనే ఆశలు
మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లో కూడా స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను నమ్ముకుంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ కీలక సమయంలో వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా జట్టుకు వీరు కీలకంగా మారారు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా వీరికుంది. దీంతో కెప్టెన్ కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా వీరినే నమ్ముకున్నాడు. ఇక, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమిలు కూడా తొలి మ్యాచ్‌లో మెరుగైన బౌలింగ్‌ను కనబరచడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. ఈసారి కూడా వీరు అదే జోరును కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. పాండ్యా కూడా మెరుగైన బౌలింగ్‌తో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
లంకకు పరీక్షే!
ఆతిథ్య శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన లంకకు ఈ మ్యాచ్‌లో కూడా కష్టాలు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉండడం, లంక పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అయితే రెగ్యులర్ కెప్టెన్ దినేష్ చండీమల్ జట్టులోకి రావడం లంకకు ఊరటనిచ్చే అంశం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా చండీమల్‌కు ఉంది. ఇక, ఉపుల్ తరంగ, మాజీ కెప్టెన్ మాథ్యూస్, కుశాల్ మెండిస్, గుణతిలక, కరుణరత్నె, డిక్వెల్లా వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్ లంకకు అందుబాటులో ఉన్నారు. అయితే అనుభవ రాహిత్యం లంకకు పెద్ద సవాలుగా మారింది. ఈ లోపాన్ని అధిగమిస్తేనే లంక మెరుగైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్‌కు కనీస ప్రతిఘటన ఇవ్వడంలో కూడా లంక విఫలమైంది. అయితే ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే లక్షంతో లంక ఉంది. తిరిమన్నే చేరికతో బ్యాటింగ్ బలోపేతంగా మారింది. రంగన హెరాత్, నువాన్ ప్రదీప్ తదితరులతో బౌలింగ్ బలంగానే ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో మెరుగైన ఆటతో సిరీస్‌ను సమం చేయాలనే లక్షంతో లంక పోరుకు సిద్ధమైంది. ఇందులో చండీమల్ సేన ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.