Home స్కోర్ సమరోత్సాహంతో కోహ్లిసేన

సమరోత్సాహంతో కోహ్లిసేన

 లంకకు పరీక్ష, ఫెవరెట్‌గా భారత్, నేడు తొలి వన్డే

IND

దంబుల్లా : టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డే సమరానికి సమరోత్సాహంతో సిద్ధమైంది. శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. దంబుల్లా వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. డే/నైట్ ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సేన ఫెవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు ఇప్పటికే టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసిన శ్రీలంక కనీసం వన్డేల్లోనైనా జయకేతనం ఎగుర వేయాలనే పట్టుదలతో ఉంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలోపేతంగా ఉన్న భారత్‌ను ఓడించడం అనుకున్నంత తేలిక కాదు. సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు లేకుండానే భారత్ వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. వీరు లేకున్నా టీమిండియా చాలా బలంగా ఉంది. కెప్టెన్ కోహ్లి వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న విషయం తెలిసిందే. అంతేగాక ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్‌లు భీకర ఫాంలో ఉన్నారు. మిడిలార్డర్‌లో అజింక్య రహానె కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. ఇక మనీష్ పాండే కూడా చేరడంతో బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా, చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, శర్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యాలతో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ భారత్‌కు అందుబాటులో ఉంది. కాగా, సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో బలహీనంగా మారిన శ్రీలంకకు ఈ సిరీస్ సవాలుగా మారింది. టెస్టు సిరీస్ ఓటమితో ఇంటాబయట విమర్శలను ఎదుర్కొంటున్న లంక కనీసం వన్డేల్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది.
బ్యాటింగే బలం
ఈ సిరీస్‌లో భారత్ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మరోసారి చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. రాహుల్ కూడా ఓపెనర్ రేసులో ఉన్నా అతనికి ఈ స్థానంలో ఆడించడం కష్టమే. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రకంపనలు సృష్టించిన ధావన్, రోహిత్‌లు మరోసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. టెస్టుల్లో బెంచ్‌కే పరిమితమైన రోహిత్ వన్డేల్లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. అతను అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. వన్డేల్లో అసాధారణ రికార్డు కలిగిన రోహిత్ సిరీస్‌లో జట్టుకు ప్రధాన ఆయుధంగా మారాడు. ఇక టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన శిఖర్ ధావన్ వన్డేల్లో కూడా చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ధావన్, రోహిత్‌లు విజృంభిస్తే లంకకు కష్టాలు ఖాయం. రాహుల్‌కు మిడిలార్డర్‌లో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అజింక్య రహానె లేదా మనీష్ పాండే స్థానంలో అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కెప్టెన్ కోహ్లి కూడా వన్డేల్లో విజృంభించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న కోహ్లి లంకపై మరింత మెరుగ్గా ఆడాలని భావిస్తున్నాడు. టెస్టుల్లో కూడా కోహ్లి బ్యాట్‌ను ఝులిపించాడు. వన్డేల్లో కూడా జట్టును ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు.
ప్రత్యేక ఆకర్షణగా హార్దిక్
మరోవైపు టెస్టు సిరీస్‌లో అద్భుతంగా చెలరేగిన హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్‌కు కీలకంగా మారాడు. భీకర ఫాంలో ఉన్న పాండ్యా వన్డేల్లోనూ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా అతనికి ఉంది. చివరి టెస్టులో మెరుపు సెంచరీతో భారత్‌ను ఆదుకున్న హార్దిక్ వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. బౌలింగ్‌లో కూడా హార్దిక్ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో అతను సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఇక, కుల్దీప్ యాదవ్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. సీనియర్లు అశ్విన్, జడేజాలు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. దీంతో చివరి టెస్టులో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారాడు. స్పిన్ సహకరించే లంక పిచ్‌లపై చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరో బౌలర్ అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు జట్టుకు కీలకంగా మారారు. ఇటీవల కాలంలో వన్డేల్లో వీరిద్దరూ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది.
అందరి కళ్లు ధోనీపైనే..

ఇక, సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ సిరీస్ చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న ధోనీపై విమర్శల వర్షం కురుస్తున్న విషయం విదితమే. కాగా, తన బ్యాట్ ద్వారా వారికి గట్టి సమాధానం చెప్పాలనే పట్టుదలతో ధోనీ ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో ధోనీకి ఊరటనిచ్చే అంశం. ఇప్పటికే సీనియర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు జట్టులో స్థానం కోల్పోయిన నేపథ్యంలో ధోనీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సిరీస్‌లో రాణించడం అతనికి తప్పనిసరిగా మారింది. ఈసారి విఫలమైతే అతనికి కష్టాలు తప్పక పోవచ్చు. అయితే ధోనీ మాత్రం తన మార్క్ ఆటతో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. అజింక్య రహానె కూడా వన్డేల్లో చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. టెస్టుల్లో అసాధారణ రీతిలో చెలరేగిన రహానె మళ్లీ గాడిలో పడ్డాడు. వెస్టిండీస్‌పై మెరుపులు మెరిపించిన రహానె ఈసారి కూడా దూకుడుగా ఆడాలనే లక్షంతో కనిపిస్తున్నాడు.
లంకకు చావోరేవో..
టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌కు గురైన ఆతిథ్య శ్రీలంకకు వన్డే సిరీస్ పెను సవాలుగా తయారైంది. ఈ సిరీస్‌లో గెలిచి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలనే పట్టుదలతో లంక ఉంది. ఉపుల్ తరంగ నేతృత్వంలో లంక సిరీస్‌కు సిద్ధమైంది. అయితే టెస్టుల్లో తరంగ పేలవమైన ఆటతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. దీంతో అతను వన్డేల్లో ఎలా ఆడుతాడన్నది అంతు బట్టకుండా మారింది. కానీ టెస్టుల్లో నిలకడగా రాణించిన కుశాల్ మెండిస్, డిక్వెల్లాలు జట్టుకు కీలకంగా తయారయ్యారు. వీరిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఈ ఇద్దరు రాణించడం లంకకు చాలా కీలకం. వీరు చెలరేగితే లంక కష్టాలు చాలా వరకు తీరుతాయి. అంతేగాక టెస్టుల్లో విఫలమైన గుణతిలక, మాథ్యూస్‌లు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు సీనియర్ ఆటగాడు కపుగెడెర జట్టులోకి రావడం బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతంగా మార్చిందని చెప్పాలి. అతను కూడా రాణిస్తే లంకకు భారీ స్కోరు చేయడం కష్టమేమి కాదు.
మలింగ బూస్ట్
కాగా, ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ జట్టులో చేరడమే లంకకు ఊరటనిచ్చే అంశం. వన్డేల్లో మంచి బౌలర్‌గా పేరు తెచ్చుకున్న మలింగకు భారత్‌పై కూడా మెరుగైన రికార్డే ఉంది. ఈ సిరీస్‌లో అతను జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. అతను విజృంభిస్తే భారత బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. అంతేగాక, సీనియర్ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా కూడా జట్టులోకి వచ్చాడు. దీంతో ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ సేవలు లంకకు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించడం కూడా లంకకు కలిసి వచ్చే అంశమే. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతుండడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

మరో మైలురాయికి చేరువలో ధోనీ
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ ద్వారా ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకోనున్నాడు. ఇప్పటికే 296 వన్డేలు ఆడిన ధోనీ సిరీస్‌లో 300వ మ్యాచ్‌ను అందుకోనున్నాడు. తన వన్డే కెరీ ర్‌లో ఇప్పటిదాక ధోనీ 296 వన్డేలు ఆడాడు. ఇందులో 51.33 సగటుతో 9496 పరుగులు చేశాడు. వీటిలో పది సెంచరీలు, మరో 64 అర్ధ సెంచ రీలు ఉన్నాయి. కాగా, భారత్ తరపున మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూ ల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్‌లు మాత్రమే మూడువందల వన్డేల మైలురాయిని అందుకున్నా రు. మరో నాలుగు వన్డేలు ఆడితే ధోనీ కూడా ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించు కుంటాడు. కాగా, వికెట్ కీపింగ్‌లో కూడా ధోనీకి మ రో రికార్డు ఊరిస్తోంది. తన కెరీర్‌లో ధోనీ ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 97 స్టంపింగ్‌లు చేశాడు. మరో మూడు స్టంపింగ్‌లు చేస్తే ఈ విభాగంలో సెంచరీ మార్క్‌ను అందుకుంటాడు.