Search
Monday 24 September 2018
  • :
  • :

నేడు బంగ్లాతో భారత్ వార్మప్ పోరు

Virat-Kohli

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో సాధన మ్యాచ్ ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్ ఈసారి కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కివీస్‌పై భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ఫాంలోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. షమి, భువనేశ్వర్‌లు కివీస్‌పై సత్తా చాటారు. ఈసారి కూడా మెరుగైన బౌలింగ్‌ను కనబరిచేందుకు తహతహలాడుతున్నారు. జడేజా కూడా జోరుమీద కనిపించాడు. బుమ్రా కూడా మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక, బ్యాటింగ్‌లో కెప్టెన్ కుదురుగా ఆడాడు. కీలక ఇన్నింగ్స్‌తో ఫాంను అందుకున్నాడు. ఇది భారత్‌కు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి గాడిలో పడడం టీమిండియాకు శుభపరిణామంగా చెప్పవచ్చు. ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. కాగా, జ్వరంతో తొలి వార్మప్ మ్యాచ్‌కు దూరమైన సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. రోహిత్ శర్మ కూడా బంగ్లా మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. రోహిత్‌ను ఓపెనర్‌గా దించే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉంది. మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్ఫూర్తి దాయక ఆటతో ఆకట్టుకున్న బంగ్లాదేశ్ ఈసారి కూడా మెరుగైన ఆటను కనబరిచేందుకు తహతహలాడుతోంది. పటిష్టమైన భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా మెరుగ్గా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తమీమ్ ఇక్బాల్ జట్టుకు కీలకంగా మారాడు. ఇమ్రూల్ కైస్, రహీం తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా బంగ్లా మెరుగ్గా కనిపిస్తోంది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ సవాలు వంటిదేనని చెప్పక తప్పదు.

Comments

comments