Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సంపాదకీయం : సరిహద్దు ఉద్రిక్తత అవాంఛనీయం

Sampadakeeyam-Logo

చైనా-భూటాన్-భారత్(సిక్కిం) త్రిముఖ కూడలి డొకాలా వద్ద జూన్ 1 నుండి చైనా-భారత్ సైనికుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత వాంఛనీయం కాదు. ఇరుదేశాల సరిహద్దు వివాద చరిత్రలో 1962 తదుపరి ఇంత దీర్ఘకాల మోహరింపు ఇదే. ఉన్నతస్థాయిలో జోక్యం చేసుకుని ఈ ఉద్రిక్తతను సడలించటమే ఇరుదేశాలకు శ్రేయోదాయకం. సిక్కిం భూభాగాన్ని ఆనుకుని ఉన్న ఈ కూడలి ప్రాంతంపై వివాదమున్నప్పటికీ అది ఎన్నడూ ఇంతటి ఉద్రిక్తతకు తావివ్వలేదు. ఈ వివాదంపై భూటాన్, భారత్ విడివిడిగా చైనాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అక్కడ రహదారి నిర్మాణానికై చైనా యంత్రాలతో సహా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నిర్మాణ బృందాలను పంపటంతో ఉద్రిక్తత మొదలైంది. ఆ బృందాలను భారత సైనికులు నిలువరించారు. వాస్తవానికి ఈ 296చ.కి.మీ. భూభాగం గత ఒప్పందాల ప్రకారం తమదని భూటాన్ చెబుతున్నది. 1988, 1998 ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నది. చైనా సైనికుల చర్యపట్ల భూటాన్ చైనాకు నిరసన తెలిపింది. కాగా ఆ భూభాగం తమ టిబెట్ అటానమస్ రీజియన్ కిందకు వస్తుందన్నది చైనా వాదన. ఆ ప్రాంతాన్ని తమదిగా చూపుతూ ఒక మ్యాప్‌ను ప్రదర్శించిన చైనా, భారత సైనికులు తమ భూభాగంలోకి చొరబడినట్లు ఆరోపిస్తున్నది. భారత సైనికులు ఉపసంహరించుకుంటేనే చర్చలని చైనా షరతు పెట్టింది. చైనా సైనికులు, రహదారి నిర్మాణ బృందాల ఉపసంహరణకు చైనా అంగీకరిస్తేనే ఏకకాలంలో ఇరుపక్షాల ఉపసంహరణ సాధ్యం. యథాతథస్థితిని పరిరక్షిస్తామన్న హామీలను చైనా నిలబెట్టుకోవాలి. అంతేగాక, 1947 నుంచి భారత్-భూటాన్ ల మధ్యనున్న ప్రత్యేక సంబంధాన్ని, 2007 నాటి ఇరుదేశాల మైత్రీ ఒప్పందాన్ని చైనా గుర్తించాలి. నాటినుంచి ఇరుదేశాల సైన్యాల మధ్య సమన్వయం పెరిగింది. ఇప్పుడు వాస్తవానికి భూటాన్‌కు అండగానే భారత్ సైన్యాలు రంగంలో దిగాయి. ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా గస్తీ బాధ్యతలు నిర్వహిస్తున్న భారత సైన్యం 2012లో రెండు బంకర్‌లు (నేలమాళిగలు) నిర్మించింది. గతనెల 1వ తేదీన చైనా సైనికులు అక్కడికి వచ్చి బంకర్‌లు మూసివేయాలని కోరారు. ఆ భూభాగం తమదంటూ చైనా సైనికులు జూన్ 6 రాత్రి బుల్‌డోజర్లతో బంకర్‌లు ధ్వంసం చేశారు. దాంతో సైనిక ఉద్రిక్తత పెరిగింది. అటుతర్వాత ఇరుపక్షాలు అదనంగా సైనికులను దించాయి. అయితే ఇరుపక్షాలు సంయమనం పాటించటంవల్లనే తూటాలు పేలలేదు. కాని అనవసరపు మాటలు తూటాలై ఉద్రిక్తతను పెంచుతున్నాయి.
చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్ 2014 లో భారత్ సందర్శించినపుడు, ఇరుదేశాల మధ్య విశ్వాస కల్పన చర్యల్లో భాగంగా, కైలాస్ మానసరోవర్ యాత్ర వెళ్లే భారతీయులకు ప్రస్తుత ఉద్రిక్త ప్రాంతం ప్రత్యామ్నాయ మార్గంగా తెరవటానికి అంగీకారం కుదిరింది. ఈ సంవత్సరం యాత్రికుల తొలి బృందం నాథులా చేరేముందు ఆ మార్గాన్ని చైనా సైన్యం మూసివేసింది. ఈ మూడేళ్లలో భారత్-చైనా సంబంధాలు క్షీణించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా ప్రాజెక్టుల గూర్చి భారత్ లేవనెత్తిన తమ సార్వభౌమత్వ ఆందోళనలను చైనా తిరస్కరించటం, టెర్రరిజం సమస్యపై పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టే భారత్ ప్రయత్నాలకు చైనా అడ్డుపడటం, అణు సరఫరాల గ్రూపులో భారత్ సభ్యత్వాన్ని చైనా నిరోధించటం, చైనా ఒక బెల్ట్-ఒకరోడ్ ప్రాజెక్టును భారత్ తిరస్కరించటం, దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికాకు భారత్ వత్తాసు పలకటం వంటి వివాదాలు గుర్తు చేసుకోదగినవి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, భారత్‌లో చైనాపెట్టుబడులు వృద్ధి చెందుతున్నప్పటికీ, అధినేతల సమావేశాలు తరచూ జరుగుతున్నప్పటికీ వైరుధ్యాలు పెరగటం విచారకరం. అయినప్పటికీ తాజా సైనిక దళాల మోహరింపును ఉపసంహరించగల విజ్ఞత ఇరుదేశాలకు ఉంది. సరిహద్దు వివాదం అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, ప్రధాని మోడీ అన్నట్లు గత 50ఏళ్లలో భారత్-చైనా సరిహద్దు వెంట ఒక్క తూటా పేలకపోవటమే ఈ విశ్వాసానికి ఆధారం.

Comments

comments